మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:21:15

దసరా నాటికి రైతు వేదికలు రెడీ

దసరా నాటికి రైతు వేదికలు రెడీ

  • అన్నదాతలను సంఘటితం చేసేందుకే..
  • పండుగలా నియంత్రిత సాగు 
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  •   వనపర్తి రూరల్‌ : దసరా నాటికి రైతు వేదిక భవనాలను ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా నాగవరం, పెద్దగూడెం, సవాయిగూడెం, చందాపుర్‌, కాశీంనగర్‌, చిట్యాల, చిమనగుంటపల్లి గ్రామాలలో 7 క్లస్టర్లలో రైతు వేదిక భవన నిర్మాణాలకు జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాలతో కలిసి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 60 లక్షల రైతు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి విప్లవత్మాక వ్యవసాయ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచన నుంచి పుట్టిందే ఈ రైతు వేదికల ప్రణాళిక అన్నారు. రాబోయే రోజుల్లో అన్నదాతలు సంఘటిత సమాలోచనల చేసుకునే వేదికలుగా మారనున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఐదు వేల ఎకరాలను క్లస్టర్‌గా తీసుకొని ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లస్టర్‌లో వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో సాగుకు కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు వివరిస్తారన్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 2,604 క్లస్టర్లలో వ్యవసాయ శాఖ, ఉపాధి హామీ నిధులతో ఒక్కో భవనాన్ని రూ.22 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణాలలో రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారనున్నాయని తెలిపారు. సాగు మొదలుకొని పంటను విక్రయించే వరకు తోడుగా నిలవనున్నాయని చెప్పారు. వనపర్తి, పాన్‌గల్‌లో నిర్మించే భవనాల వ్యయాన్ని తాను, తన తల్లిదండ్రులు, తన కూతుళ్ల స్మారకార్థం అందించనున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం కాసీంనగర్‌ గ్రామంలో భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన ఎద్దుల స్వామి, మాసన్నలను, పెద్దగూడెంలో రోడ్డు వెడల్పునకు సహకరించిన బాలస్వామి, నగరమ్మ దంపతులను మంత్రి సన్మానించారు. అలాగే పెద్దగూడెం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్రూం ఇండ్లను కలెక్టర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలువురు మంత్రికి వినతులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, ఆర్డీవో చంద్రారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు మేఘారెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, రైతుబంధు సమితి మండల సమన్వయకర్త నరసింహ, పీఏసీసీఎస్‌ చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, పోతుపల్లి రాజు, ఎంపీటీసీ ధర్మానాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు విష్ణుయాదవ్‌, నాయకులు మాణిక్యం, మాధవ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సర్పంచులు, విండో డైరెక్టర్లు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.

పెబ్బేరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..

పెబ్బేరు : పెబ్బేరు మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని కొల్లాపూర్‌ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్‌ స్పెషల్‌ నిధులు రూ.30 లక్షలతో నిర్మించనున్న అంబేద్కర్‌ మోడల్‌ పార్క్‌ నిర్మాణం, రూ.2 కోట్లతో చేపట్టనున్న సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ పనులు, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద నిర్మించనున్న బస్‌షెల్టర్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, నగరాల అభివృద్ధికి సర్కారు ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్‌లో పెబ్బేరుకు మరిన్ని నిధులు కేటాయించి మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.  మున్సిపాలిటీల్లో సంస్కరణలు తెచ్చి, అవినీతికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పట్టణాభివృద్ధి కోసం సకాలంలో పన్నులు చెల్లించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, కమిషనర్‌ కృష్ణయ్య, కౌన్సిలర్లు సుమతి, అక్కమ్మ, రామకృష్ణ, బాబు, ఎల్లారెడ్డి, మాధవి, నాయకులు బుచ్చారెడ్డి, విశ్వరూపం, రాములు, శంకర్‌ నాయుడు, సాయినాథ్‌, ఎల్లయ్య, ముస్తాక్‌, బలరాం నాయుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


logo