శనివారం 15 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:15:08

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా


  • యోగా సాధనపై  పెరుగుతున్న మక్కువ
  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు.. సర్వం కల్తీమయం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ఉత్తమ మార్గం. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించేది యోగానే అని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. యోగాను ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే..   నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం..

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : మహబూబ్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ 1995లో ప్రేమ్‌హెల్త్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి 25 ఏండ్లుగా జిల్లా పరిషత్‌ ఆవరణలో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా పట్టణ పరిధిలోని ఏనుగొండలో నివాసం ఉంటున్న వనజారెడ్డి రాష్ట్ర, జాతీయస్థాయి అథ్లెటిక్స్‌, యోగా పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నది.

ఆసనాలు.. ఉపయోగాలు 

పాద హస్తాసనం : ఈ ఆసనం వేయడం వల్ల కాలేయం బాగా పని చేస్తుంది. మధుమేహ పీడితులు తప్పక వేయాల్సిన ఆసనమిది. అజీర్ణ వ్యాధులు నయం అవుతాయి.

త్రికోణాసనం : నాజుగ్గా ఉండాలనుకునే నవతరం అమ్మాయిలకు ఇష్టమైన ఆసనమిది. పిరుదులు, నడుములోని కొవ్వు తగ్గిపోతుంది. మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు, మూత్ర సంబంధ జబ్బులు నయమవుతాయి.

మకరాసనం : మెడ నొప్పితో బాధపడేవారు వేయదగిన ఆసనమిది. ఒత్తిళ్లతో సతమతమయ్యే వృత్తుల్లో ఉన్నవారికి ఇది ఓ వరం. పూర్తిగా విశ్రాంతినిస్తుంది.

పవన ముక్తాసనం : పొట్ట వస్తుందని బాధపడేవారు రోజూ ఈ ఆసనాన్ని సాధన చేస్తే ఆ సమస్య ఉండదు. అదే విధంగా జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది. మలబద్ధకం మటు మాయమవుతుంది. 

భుజంగాసనం : ఈ ఆసనం వల్ల వీపు నొప్పులు తగ్గుతాయి. వీపు నిటారుగా అవుతుంది. మెడ కండరాలు బల పడతాయి. వెన్ను సమస్యలున్నవాళ్లు తరచూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల వెన్ను నరాలు బలోపేతం అవుతాయి. వెన్నుముక్క బలపడుతుంది. 

మత్స్యాసనం : ఈ ఆసనం వల్ల శరీరం మనసూ తేలిక పడతాయి. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా దూరమవుతాయి. 

మేరు వక్రాసనం : ఈ ఆసనం వేయడం వల్ల కాలేయానికి, చిన్న పేగుకూ జీర్ణ గ్రంథులకు శక్తినిస్తుంది.

శీర్షాసనం : ఆసనాల్లో రారాజు, వెంట్రుకలు తెల్లబడకుండా, రాలి పోకుండా కాపాడుతుంది. కళ్లు, ముక్కు, చెవులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బుద్ధిని వికసింపజేస్తుంది.

సర్వాంగాసనం : ఈ ఆసనం వల్ల శరీరంలోని అన్ని భాగాలు చక్కగా పని చేస్తాయి. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్‌ తదితర జబ్బులపైన ప్రభావం చూపుతుంది.

యోగాతో ప్రయోజనాలు

  • యోగా చేయడం వల్ల పల్స్‌రేటు తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.
  • యోగా కారణంగా మనకు సైకలాజికల్‌ ప్రయోజనాలు కూడా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. యాగ్జయిటీ, డిప్రెషన్స్‌ తగ్గిపోతాయి. పగ, ధ్వేషం, అసూయ తగ్గిపోతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. లెర్నింగ్‌ ఎఫీషియన్సీ పెరుగుతుంది.
  • యోగా వలన జీవ రసాయన సంబంధంగా మన శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు అనేకం ఉంటాయి. బ్లడ్‌ గ్లూకోజ్‌ తగ్గుతుంది. ఫలితంగా డయాబెటిస్‌ దరిచేరదు. శరీరంలోని సోడియం, కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. దీంతో బీపీకి బలికాకుండా ఉంటాం. లింఫోసైట్‌ కౌంట్‌ పెరుగుతుంది. టోటల్‌ వైట్‌ బ్లడ్‌ సెల్‌ కౌంట్‌ తగ్గుతుంది. థైరాక్సిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ‘విటమిన్‌-సి’ ఇంక్రీజ్‌ అవుతుంది. బ్రెయిన్‌లో ఆక్సిజన్‌ లెవెల్‌ అభివృద్ధి చెందుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా యోగా.. 

  • ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అవసరమని ఆసియా నగరాల్లో భావిస్తుండగా, యోగా ఉత్పాదకతను పెంచే ప్రక్రియగా ఐరోపా దేశాల్లోని 70 శాతం మంది నమ్ముతున్నారు. ఆరోగ్య రక్షణలో యెగాకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
  • జర్మనీలో ప్రతి పట్టణంలో అక్కడి ప్రభుత్వం ఎన్‌జీవోలతో కలిసి యోగా పాఠశాలను ఏర్పాటు చేసింది.
  • ఆసియా ఖండంలో కనీసం ఇరవై దేశాలల్లో యోగా వ్యాపారంగా మారి ఏడాదికి 70 కోట్ల డాలర్ల టర్నోవర్‌ చేసుకుంటుందని అంచనా. 


logo