గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:10:50

నాటి ఎత్తపి.. నేటి ఎత్తం

నాటి ఎత్తపి.. నేటి ఎత్తం

కుమార తైలవుడు ఏలిన నేల

1160 గ్రామాలకు అనుసంధానం చేసిన పాలన

ప్రశంసించిన కందూరు చోళులు

నేటికీ చెక్కు చెదరని కట్టడాలు

రాజరిక పాలనలో విరాజిల్లిన ‘ఎత్తపి’

కాలక్రమంలో ఎత్తంగా మార్పు

ఎత్తపి గ్రామానికి ఎంతో చరిత్ర ఉన్నది.. క్రీ.శ 1042 నాటికే అప్పటి శాసనాలలో ఎత్తపి చరిత్ర నిక్షిప్తమై ఉన్నది. 11వ శతాబ్దంలో కర్ణాటకలోని కల్యాణి కాటకాన్ని పరిపాలించిన మూడో సోమేశ్వరుడి కుమారుడైన కుమారతైలవుడు ఒడిశాలోని చక్రకూటం అనే ప్రాంతాన్ని జయించి తిరిగొస్తున్న సమయంలో ఎత్తపి గ్రామాన్ని పాలనా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామం కింద సుమారు 1160 గ్రామాలను అనుసంధానం చేసుకొని ఆదర్శవంతమైన పాలన అందించారని చరిత్ర చెబుతున్నది. నాటి ఎత్తపి.. నేడు ఎత్తం.

- కోడేరు


నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఎత్తం గ్రామానికి వెయ్యేండ్ల చరిత్ర ఉన్నది. క్రీ.శ 1042 నాటికే శాసనాలలో ఎత్తం చరిత్ర నిక్షిప్తమై ఉన్నదని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఎత్తం గ్రామాన్ని పూర్వం ఎత్తపి అని పిలిచేవారు. క్రీ.శ 1042 ప్రాంతంలో సుమారు 1160 గ్రామాలు ఎత్తపి పాలన కింద ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తున్నది. మూడే సోమేశ్వరుడి కుమారుడైన కుమారతైలవుడు కర్ణాటకకు చెందిన కల్యాణి కాటకాన్ని 11వ  శతాబ్దంలో పరిపాలించే వారు. ఒడిశాలోని చక్రకూటం అనే ప్రాంతాన్ని జయించడానికి ఎత్తపి నుంచి సోమశీల మీదుగా ఆయన ఒడిశాకు వెళ్లారు. అక్కడ శత్రువులను జయించి విజయోత్సవాలు జరుపుకుంటూ ఎత్తపి కేంద్రానికి తిరిగి వచ్చారు. అనంతరం కుమారతైలవుడు అగస్తేశ్వరం (నేటి మల్లేశ్వరం) దత్తత తీసుకొని ఎత్తపి ప్రధాన కేంద్రంగా ఏర్పరుచుకొని 1160 గ్రామాలను అనుసంధానంగా ఉండేలా శాసనం చేశారు. దీంతో ఎత్తపికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. 11వ శతాబ్దంలో ఇదే ప్రాంతంలో అప్పటి కలువలకోలు (నేటి కల్వకోలు) కేంద్రంగా పరిపాలిస్తున్న కందూరు చోళులు కూడా ఎత్తపి పాలనా విధానాన్ని ప్రశంసించి వారు కూడా ఇదే తరహా పాలనను కలువలకోలులో ప్రవేశపెట్టారు. 17వ శతాబ్దంలో ఓరుగళ్లు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి కుమారతైలవుడు వెళ్లాడు. అప్పటినుంచి ఉన్న ఎత్తపి చరిత్ర క్రీ.శ 1123 అనంతరం కనుమరుగైంది. దీంతో ఎత్తపి నుంచి ఎత్తంగా మారిందని పురావస్తుశాఖ పేర్కొంటున్నది. అనంతరం ఎత్తం, కల్వకోలు, తిర్నాంపల్లి, గ్రామాలు హైదరాబాద్‌ నవాబు నిజాం ఆధీనంలోకి వచ్చాయి. జయలక్ష్మారెడ్డి అనే సంస్థానాధీశుడు ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న కల్వకోలులో నందికోటను నిర్మించి ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. మిగతా తెలంగాణ సంస్థానాధీశులకు వైరంగా ఉండటంతో వారు ఇతన్ని హతమార్చారు.  ఇదే అదునుగా తీసుకొని పాన్‌గల్‌ ఖిల్లాను ఏలుతున్న అల్లావుద్దీన్‌ ఎత్తం కల్వకోలును స్వాధీనం చేసుకొని తన మిత్రుడైన కరణం నారాయణరావుకు ఈ ప్రాంతాన్ని భుక్తిగా ఇచ్చి సత్కరించారు. ఇతడు గొప్ప రామభక్తుడు కావటంతో ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న అతి ఎత్తైన గట్టు శిఖరంపై శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఎత్తం గ్రామానికి చెందిన పెద్ద వెంకట్‌రావు ఎత్తం, కల్వకోలు, తిర్నాంపల్లికి సంస్థానాధీశులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎత్తం గ్రామంలో ఆనాటి రాజరిక పాలనకు నిదర్శనంగా కోటబురుజు, పెద్దబంగ్లా, శాసనాలు చెక్కిన రాళ్లు ఆనవాళ్లుగా ఉన్నాయి. 


logo