బుధవారం 05 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:01:14

పట్నంపోతే కరోనా వచ్చే..

పట్నంపోతే కరోనా వచ్చే..

జిల్లాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌

పాజిటివ్‌ కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్‌ లింక్‌ ఉన్నవే..

వివిధ ఆరోగ్య సమస్యలతో పట్నం దవాఖానల తలుపుతడుతున్న బాధితులు

అక్కడ చికిత్స పొందుతుండగానే వైరస్‌ సోకుతున్న వైనం

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు

ఉప్పునుంతలకు చెందిన 55 రోజుల బాలుడు..అభంగాపూర్‌కు చెందిన 6 నెలల చిన్నారి...వనపర్తిలో పని చేసే ఓ యువకుడు.. సీసీ కుంట మండలానికి చెందిన ఓ గర్భిణి..హన్వాడ మండలానికి చెందిన 25ఏళ్ల యువకుడు..వీరంతా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లడంతో అక్కడ కరోనా వైరస్‌ సోకింది. రాష్ట్ర రాజధానిలోలో విధులు నిర్వర్తించే ఓ పోలీస్‌, హోం గార్డు, జర్నలిస్ట్‌ ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు మహమ్మారి. ఒకటా.. రెండా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు సగానికిపైగా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌తో లింక్‌ ఉన్నవే. ఈక్రమంలో అత్యవసరం అయితే..ప్రాణాల మీదికి వస్తే తప్ప..పట్నం వెళ్లవద్దంటున్నారు వైద్యులు, నిపుణులు. నగరంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


మహబూబ్‌నగర్‌ ప్రతినిధి: మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్లొచ్చాడు. నాలుగైదు రోజులకు ఆయనకు జ్వరం, జలుబు, గొంతు నొప్పి వచ్చింది.. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులు వచ్చాక చూస్తే ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. 

సీసీకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి డెలివరీ కోసం పాలమూరు దవాఖానకు వచ్చింది. ప్రసవానంతరం బిడ్డ చనిపోయింది. ఆమె అనారోగ్యం బారిన పడటంతో చికిత్సకు హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. 

హన్వాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏండ్ల యువకుడు క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్తే హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న ఆ యువకుని నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారు. తర్వాత ఆ యువకుడు ఇంటికి వచ్చాడు. ఫలితాలు వచ్చాక సదరు యువకుడికి పాజిటివ్‌ అని తేలింది. 

మహబూబ్‌నగర్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంటాడు. నిత్యం హైదరాబాద్‌కు వెళ్లొస్తుంటాడు.  ఆ వ్యక్తికి సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. 

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మర్లుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా వైరస్‌ బారిన పడ్డాడు. 

ఉప్పునుంతల మండలానికి చెందిన 55రోజుల బాలుడు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తే అక్కడి దవాఖానలో వైరస్‌ సోకింది. తర్వాత ఆ చిన్నారి మృతి చెందాడు. 

విదేశాల నుంచి వస్తున్న వారి టెంపరేచర్‌ చెక్‌ చేసేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న ఓ వైద్య ఉద్యోగికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా సోకింది. ఆయన తల్లికి వచ్చింది.

మహబూబ్‌నగర్‌ రవీంద్రనగర్‌కు చెందిన మహిళా క్యాన్సర్‌ రోగిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కరోనా బారిన పడ్డారు.  

నారాయణపేట అభంగాపూర్‌కు చెందిన ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత లక్షణాలు ఉండటంతో గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. తర్వాత శిశువు మృత్యువాత పడింది.  

బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన ఓ యువకుడు వనపర్తి జిల్లా తాడిపర్తిలో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించగా.. చికిత్స అందిస్తున్న క్రమంలో కరోనా సోకిందని వైద్యులు తెలిపారు.  

పాలమూరుకు చెందిన ఓ వృద్ధురాలు చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో చేరారు. ఆమె వెంట వెళ్లిన కుమారుడు, భర్త కరోనా బారిన పడ్డారు. 

    ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే తేలింది ఒక్కటే.. హైదరాబాద్‌ కేంద్రంగా కరోనా వైరస్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎక్కువగా సోకుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌ కేంద్రంగానే వైరస్‌ వచ్చింది. ముఖ్యంగా దవాఖానాలకు వెళ్లిన వారిలోనే పాజిటివ్‌ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప.. హైదరాబాద్‌లోని దవాఖానలకు పోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యం కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెబుతున్నారు. చాలామంది వారి బంధువులు, మిత్రులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో వైరస్‌ బారిన పడుతున్నారు. మరికొందరు చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లి కరోనా కాటుకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే మహబూబ్‌ నగర్‌లో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయితే.. అన్ని కేసులూ హైదరాబాద్‌ కేంద్రంగానే కావడం గమనార్హం. చిన్న చిన్న సమస్యలకు సైతం జనరల్‌ దవాఖానకు వస్తున్న రోగులు ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికి వైరస్‌ ఉందో తెలుసుకునే అవకాశమే లేదు. అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడే వైద్యం పొందడం ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు. 

ఉమ్మడి జిల్లాలో యాక్టివ్‌ కేసులు

జిల్లా కేసులు

మహబూబ్‌నగర్‌    45

నాగర్‌కర్నూల్‌            07

వనపర్తి                        05

జోగుళాంబ గద్వాల        01

నారాయణపేట            01

మొత్తం                        59

లాక్‌డౌన్‌ తర్వాత పెరిగిన కేసులు

లాక్‌డౌన్‌కు ముందు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ తర్వాత 45 కేసులు నమోదు కావడం విశేషం. ఈ కేసుల్లోనూ ఎక్కువగా హైదరాబాద్‌ కేంద్రంగానే వస్తున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో ప్రజలు పలుచోట్ల భౌతిక దూరం పాటించడంలో విఫలమవుతున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపంగా మారుతున్నది. ప్రజలు మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


పాలమూరులో పెరుగుతున్న కేసులు

 నలుగురికి కరోనా

మహబూబ్‌నగర్‌ క్రైం: లాక్‌డౌన్‌ సడలింపుతో పాలమూరులో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. శనివారం జిల్లాలో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్‌ శశికాంత్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బీకేరెడ్డి కాలనీలో నివాసముంటున్న ఓ హోంగార్డు హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద  విధులు నిర్వహిస్తుండగా హోంగార్డుకు పాజిటివ్‌ వచ్చిం ది. మర్లులో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు వెళ్తే అక్కడ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దివిటిపల్లిలో నివాసముంటూ హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ఏర్పాటు చేశారు.

చిన్నచింతకుంట మండలంలో ఒకరికి..

చిన్నచింతకుంట : మండలంలోని లాల్‌కోటకు చెందిన 20 ఏండ్ల మహిళలకు పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన మహిళ నెలరోజుల కిందట కాన్పు కోసం తల్లిగారి గ్రామమైన లాల్‌కోటకు వచ్చింది. వారంరోజుల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా దవాఖానకు డెలివరికి వచ్చింది. ప్రసవానంతరం బిడ్డ చనిపోయింది. దీంతో  ఆమె అనారోగ్యం బారిన పడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న తరుణంలో ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతున్నది. శనివారం సర్పంచ్‌ సంధ్యరత్నం, తాసిల్దార్‌ స్వర్ణరాజు, ఎంపీడీవో ఫయాజొద్దీన్‌, డాక్టర్‌ బలరాం, వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి కుటుంబ సభ్యులకు పలు సలహాలు ఇచ్చారు. గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


చిన్న సమస్యలకు రావొద్దు

సాధారణ ఆరోగ్య సమస్యలకు స్థానికంగా ఉండే పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా దవాఖానల్లోని వైద్యులతో చూపించుకుంటే సరిపోతుంది. మెరుగైన వైద్యం కావాలంటే స్థానిక వైద్యులు జనరల్‌ దవాఖానకు రెఫర్‌ చేస్తారు. ప్రతి చిన్న సమస్యకూ జనరల్‌ దవాఖానకు రావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్నది. ఈ తరుణంలో సాధ్యమైనంత వరకు భౌతికదూరం పాటించాలి. అవసరమైతే తప్ప హైదరాబాద్‌ దవాఖానలకు వెళ్లకండి. 

- డాక్టర్‌ కృష్ణ, వైద్యాధికారి, మహబూబ్‌నగర్‌ జిల్లా


వైద్యుల త్యాగాలు గుర్తించాలి

ప్రపంచమంతా జనం కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో దవాఖానల్లో వైద్యులు వైద్యం అందించడంలో ముందుంటున్నారు. ఓ మహిళా వైద్యురాలికి వైరస్‌ సోకింది. తర్వాత ఆమె మూడేండ్ల కూతురికి పాజిటివ్‌ వచ్చింది. ఓ స్టాఫ్‌ నర్స్‌, అటెండర్‌కు సోకింది. వైద్యుల త్యాగాలను ప్రజలు గుర్తించాలి. చాలామంది సాధారణ రోగాలకు జనరల్‌ దవాఖానకు వస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రావద్దు. జనరల్‌ దవాఖానకు వచ్చేవారు భౌతిక దూరం పాటించి, మాస్కు ధరించాలి. 

- డాక్టర్‌ రాంకిషన్‌, సూపరింటెండెండ్‌, మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖాన 


logo