గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 18, 2020 , 03:57:57

రైతుబంధుకు గ్రీన్‌సిగ్నల్‌

రైతుబంధుకు గ్రీన్‌సిగ్నల్‌

 • నేరుగా రైతుల ఖాతాల్లోకే నిధులు
 • జనవరి 23వరకు నమోదైన రైతులకే వర్తింపు
 • మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
 • కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం
 • ఉమ్మడి జిల్లాలో 8లక్షల మంది రైతులకు లబ్ధి

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: రైతుబంధుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వ్యవసాయ సీజన్‌ ఆరంభం కావడంతో మరో వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం అందించనున్నది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తేల్చేస్తూ ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా రైతులందరికీ అందించేలా సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా 8లక్షల మంది వరకు రైతులకు సాయం అందనున్నది.

ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయడంతో వ్యవసాయ, బ్యాంకింగ్‌ అధికారులు సన్నద్ధత చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 మే నెలలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 2018లో ఎకరాకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగి పంటలకు ఒక్కో రైతుకు రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది. ఆ తర్వాత పెరిగిన ఖర్చుల ఆధారంగా ఎకరాకు రూ.5వేల చొప్పున పెంచి 2019లో రెండు పంటలకు రూ.10వేల చొప్పున అందించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 8లక్షల మంది రైతులు ఈ సాయాన్ని పొందుతున్నారు. ఇటీవల సేకరించిన లెక్కల ప్రకారం గతేడాది వరకు 7,68,360మంది రైతులు ఉండగా కొత్తగా 62,725మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు.

జనవరి 23వ తేదీ నాటికి సీసీఎల్‌ఏ వద్ద నమోదైన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా కొత్త నిబంధనలు ఉండటంతో ఆ దిశగా అర్హుల సంఖ్యలో మార్పులు వచ్చే అవకాశమున్నది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 5.62లక్షల ఎకరాలకు గానూ రూ.281కోట్లు వచ్చే అవకాశమున్నది. నారాయణపేటలో 4.64లక్షల ఎకరాలకు గానూ రూ.232కోట్లు, గద్వాలలో 3.40లక్షల ఎకరాలకు రూ.170కోట్లు, మహబూబ్‌నగర్‌లో 3.21లక్షల ఎకరాలకు గానూ రూ.170కోట్లు, వనపర్తిలో అత్యల్పంగా 2.25లక్షల ఎకరాలకు గానూ రూ.117కోట్ల వరకు వచ్చే అవకాశమున్నది.

ఇలా 19.24లక్షల ఎకరాలకు గానూ దాదాపుగా వెయ్యి కోట్ల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయాలని అధికారులకు ఆదేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏటా వానకాలం, యాసంగిలో ఈ డబ్బులు జమ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఏడాదిలో ఒక్కసారి నమోదైన రైతులకే రెండు విడుతలుగా ఈ సాయం అందనున్నది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ కొత్త విధానం అవలంబించనున్నారు. రైతుబంధు విడుదల చేయడంతో రైతులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో రైతుల వివరాలు  

జిల్లా పేరు రైతులు సాగు అంచనా(ఎకరాల్లో)

నాగర్‌కర్నూల్‌ 1,26,549  5,62,299

నారాయణపేట 1,38,267 4,64,440

జోగుళాంబ గద్వాల 2,58,901 3,40,677 

మహబూబ్‌నగర్‌ 1,76,474 3,21,512

వనపర్తి 1,30,894  2,35,250

మొత్తం 8,31,085  19,24,178

ఇవీ మార్గదర్శకాలు..

 1. ఈ ఏడాది జనవరి 23నాటికి సీసీఎల్‌ఏ వద్ద నమోదైన నివేదిక ప్రకారమే రైతులకు రైతుబంధు. 
 2. ఈ సంవత్సరంలో ఖరారైన రైతులకు వచ్చే యాసంగిలో పెట్టుబడి సాయం అందనున్నది.
 3. కొత్తగా నమోదైన రైతులకు వచ్చే సంవత్సరం రైతుబంధు ఇవ్వనున్నారు.
 4. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకూ పెట్టుబడి సాయం.
 5. ఆధార్‌ కార్డు ఆధారంగా రైతుల భూములు ఎక్కడ ఉన్నా పథకం వర్తింపు.
 6. ఈ కుబేర్‌ ద్వారా రైతుల ఖాతాల్లోకే నేరుగా జమ.
 7. రైతుబంధు వద్దనుకునే రైతులు గివిట్‌అప్‌ దరఖాస్తును ఏఈవో, ఏవోలకు అందజేయాలి.
 8. చిన్నకారు రైతుల నుంచి ప్రారంభం.
 9. ప్రతి సీజన్‌కు ముందు భూముల అమ్మకాలు, కొనుగోళ్లను పర్యవేక్షిస్తారు.


logo