మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 15, 2020 , 01:53:34

పసిడి పంటల ఖిల్లా పాలమూరు

పసిడి పంటల ఖిల్లా పాలమూరు

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యవసాయ రంగంలో ఏటా అంతకు మించి ప్రగతి సాధిస్తోన్నది. దీంతో వ్యవసాయ పనులు లేక వలసలు వెళ్లిన ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఇప్పుడు ఈ రంగమే ప్రధానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంజీకేఎల్‌ఐ, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయడంతో నాలుగేండ్లలో సేద్యంలో ఎన్నడూ రానంత దిగుబడి వస్తున్నది. ఫలితంగా రైతులకు ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. ఎండాకాలంలోనూ కాల్వలు, చెరువులు అలుగులు పారడం సాధారణంగా మారింది. వరి, వేరుశనగలాంటి పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతున్నది. గత యాసంగిలో ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలతో 5,94,877ఎకరాల్లో సాగు జరిగింది. ఇందులో అత్యధికంగా 3,57,600ఎకరాల్లో వరి పండింది. ఈ సీజన్‌లో ఎకరానికి 24క్వింటాళ్ల నుంచి 28క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చినట్లుగా అధికారుల అంచనా. 5,32,256 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో వరి రైతులకు రూ.970కోట్ల 69లక్షల ఆదాయం సమకూరింది. 

794 కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వం సింగిల్‌ విండోలు, ఐకేపీ, మెప్మా సంఘాల పరిధిలో 794కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా వచ్చి దేశంలో కొనుగోళ్లు కష్టమైనా సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ప్రతి గ్రామంలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించింది. దీంతో రైతులకు క్వింటాల్‌కు రూ.1,835 చొప్పున గిట్టుబాటు ధర లభించింది. ఈ కేంద్రాలు లేకుంటే బయట రూ.1500నుంచి రూ.1600వరకే అమ్ముకోవాల్సి వచ్చేది. పాలమూరులో ఈ ధరలతో సమీపంలోని ఏపీ, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా కొందరు రైతులు జిల్లాలో తమ ధాన్యం విక్రయించేందుకు రాగా అధికార యంత్రాంగం సరిహద్దుల వద్ద గట్టి చర్యలు తీసుకున్నది. గత నెల 31వ తేదీతో కొనుగోళ్లు ముగిసినా మరో వారం పొడిగించడంతో రైతులందరూ తమ ధాన్యాలను విక్రయించారు. ఈ ధాన్యానికి రెండు, మూడు రోజుల్లోనే రైతులందరికీ డబ్బులను అందజేసింది. దీనివల్ల వరి పండించిన రైతుల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. నీటి ఆధారితమైన వరి పంట గతంలో బీళ్లుగా ఉన్న భూముల్లో నుంచే దాదాపు రూ. వెయ్యి కోట్ల విలువైన పంట దిగుబడిని సాధించడం విశేషం. ఉమ్మడి పాలమూరులో వనపర్తిలో అత్యధికంగా 1.99మెట్రిక్‌ టన్నులు, ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌లో 1.72మెటిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది.  రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారిన నేపథ్యంలో కరువుకు, వలసలకు నిలయమైన పాలమూరులోనూ వరి పంట రైతుల ఇండ్లల్లో సిరులను కురిపిస్తోంది. కృష్ణా జలాల రాకతో గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ పనులు పెరుగడంతో వలసలు దూరమయ్యాయి. మొత్తం మీద పాలమూరు జిల్లా పసిడి పంటల ఖిల్లాగా మారుతున్నది.

గిట్టుబాటు ధర వచ్చింది

యాసంగిలో వరి పంటతో మంచి గిట్టుబాటు ధర వచ్చింది. రెండెకరాల్లో వరి పంట వేశాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం అమ్ముకున్నాను. మా ఊరిలోనే అమ్ముకున్నా. ఎక్కడికీ వెళ్లకుండా.. ఎలాంటి కష్టం లేకుండా అమ్ముకున్నాను. దీంతో రూ.1.10లక్షల వరకు డబ్బులు వచ్చాయి. గిట్టుబాటు ధర కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

- మల్లయ్య, రైతు, యంగంపల్లి, తాడూరు

దిగుబడి పెరిగింది

ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు వల్ల నీళ్లు రావడంతో బోర్లల్లో భూగర్భజలాలు పెరిగి నీళ్లు బాగా వస్తున్నాయి. ఎకరాకు 27క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చింది. నాకున్న మూడెకరాల్లో 81క్వింటాళ్ల ధాన్యం పండింది. ఇంతకు ముందు వరి పంట వేయాలంటే భయం ఉండేది. నీళ్లు వస్తుండటంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.

- వెంకటయ్య, రైతు, యంగంపల్లి, తాడూరు

జిల్లాలో 222 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరిగింది. 29వేలకుపైగా రైతుల నుంచి రూ.300కోట్ల విలువైన వరి ధాన్యం సేకరించాం. ఎంజీకేఎల్‌ఐతో గణనీయమైన దిగుబడి వస్తుంది. రైతులకు రైతుబంధు, విత్తనాలు, ఎరువులు 24గంటల కరెంట్‌ ఇవ్వడంతో వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నది. రాబోయే రోజుల్లో నాగర్‌కర్నూల్‌ రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుంది. - శ్రీధర్‌, కలెక్టర్‌, 



logo