శనివారం 15 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 14, 2020 , 02:13:34

ఉన్నత చదువులు చదివి... ఉపాధి వైపు అడుగులు

ఉన్నత చదువులు చదివి... ఉపాధి వైపు అడుగులు

అచ్చంపేట: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. విందులు, వినోదాలు, ఇండ్లల్లో పేపర్‌ ప్లేట్ల వినియోగం బాగా పెరిగింది. తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆదాయం ఉండడంతో ఆసక్తి ఉన్న వారు ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇంట్లో ఉండి తయారు చేసి స్థానికంగానే మార్కెటింగ్‌ చేసుకుంటూ కుటుంబానికి ఆదనపు ఆదాయం సమకూర్చేందుకు ఈ మార్గంలోకి వస్తున్నారు. ఈ రంగంలోనే బల్మూర్‌ మండలం బాణాలకు చెందిన లావణ్య, శంకర్‌ దంపతులు ఉపాధి పొందుతున్నారు. లావణ్య ఎంఏ, బీఎడ్‌, శంకర్‌ డిగ్రీ వరకు చదివారు. ఇద్దరికీ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది. శంకర్‌ పెయింటింగ్‌ పనిచేస్తూ అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లావణ్య ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనేక పోటీ పరీక్షలు రాసింది. కానీ, ఉద్యోగం రాలేదు. కుటుంబం పోషణ భారంగా మారింది. వివాహమై ఆరేండ్లు గడిచినా పిల్లలు వద్దనుకున్నారు. పేదరికంతో తామే బతకడం కష్టంగా ఉంది. పిల్లలను ఎలా పోషించాలని వద్దనుకున్నారు. 

ఈ క్రమంలో భర్తకు తోడుగా ఏదైనా పనిచేయాలని ఆలోచించింది. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే పేపర్‌ ప్లేట్ల తయారీపై ఆసక్తి కలిగింది. దీంతో ఆలోచించి భర్తతో చర్చించి నిర్ణయం తీసుకున్నది. తెలిసిన వారితో అఫ్పు చేసి అతికష్టం మీద తయారీ యంత్రాన్ని తెచ్చారు. అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోడకు అనుకొని ఉప్పునుంతలకు వెళ్లే మార్గంలో డబ్బా ఏర్పాటు చేసి చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్లేట్లు తయారు చేయడం ఎలాంటి శిక్షణ లేకుండా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని లావణ్య పేర్కొన్నది. అయితే ప్లేట్స్‌ తయారు చేసింది. కానీ, మార్కెటింగ్‌ సమస్యగా మారింది. తానే దుకాణాలకు తిరుగుతూ వ్యాపారస్తులను కలిస్తే తక్కువ రేటుకు అడుగుతున్నారని పేర్కొన్నది. దీంతో తానే రిటైల్‌గా తన దుకాణం వద్దే అమ్ముకుంటున్నట్లు చెప్పింది. తయారీ యంత్రం, మెటీరియల్‌, డబ్బాకు మొత్తం కలిపి రూ. 2లక్షలు ఖర్చయింది. ప్లేట్ల తయారీ, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకున్నా పేదరికం నుంచి బయటపడాలంటే ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తన భర్తను ఒప్పించి ఈ రంగంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నది.  

కష్టపడి ప్రారంభించా..

కుటుంబ జీవనం కోసం ఏదైనా చేయాలని ప్లేట్ల తయారీ వైపు వచ్చాను. అప్పుచేసి యంత్రాన్ని తెచ్చాను. ఎలాంటి శిక్షణ లేకుండా యూట్యూబ్‌ ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను. ప్రస్తుతం బాగానే ఉంది. ప్లేట్లు తయారు చేస్తూనే లాసెట్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. అయితే లాసెట్‌ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తీసుకోలేదు. తన భర్త ప్రోత్సాహంతో చదువుఆపలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం. పోటీ ప్రపంచంలో మార్కెటింగ్‌ చేయడం కష్టమైనప్పటికీ నిలదొక్కుకుంటాను. ఖాళీగా ఉన్న సమయంలో పుస్తకాలు చదువుతుంటాను. ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నది. - లావణ్య, బాణాల, బల్మూర్‌ మండలంlogo