గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 14, 2020 , 01:56:15

సింగవట్నం సిగలో పర్యాటక సింగారం

సింగవట్నం సిగలో పర్యాటక సింగారం

కందనూలుకు పర్యాటకశోభ సంతరించుకుంటున్నది. కొల్లాపూర్‌ మండలంలోని సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాద క్షేత్రంగా విరాజిల్లుతున్నది. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచని ప్రాంతం స్వరాష్ట్రంలో నూతన సొబగులు దిద్దుకుంటున్నది. రూ.8కోట్లతో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నది. ఆలయ సమీపంలోని శ్రీవారి సముద్రం కట్టపై రేలింగ్‌, ఓపెన్‌ బోటింగ్‌, కాటేజీల నిర్మాణంతోపాటు రెస్టారెంట్‌ ఏర్పాటు చేయడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. - కొల్లాపూర్‌ 

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం భక్తులతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్నది.. మరో వైపు ఆలయ పరిసరాల్లో ప్రకృతి అందాలకు తోడుగా తెలంగాణ ప్రభుత్వం చొరవతో తెలంగాణ టూరిజం శాఖ రూ.8కోట్లతో పర్యాటకంగా అన్ని హంగులతో నిర్మాణాలు పూర్తిచేసి పర్యాటకులకు వినియోగంలోకి తీసుకొచ్చింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సొంత గ్రామం కావడంతో ఈ ఏడాది మొదట్లోనే లాంఛనంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా కాటేజీలు, బోటింగ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. అయితే మూడేండ్ల క్రితం సింగవట్నంలో అన్ని హంగులతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు అప్పట్లో రూ. 8కోట్ల నిధులను మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పర్యాటక నిర్మాణాలను సాగదీయడంతో ఎమ్మెల్యే బీరం చొరవతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు.

ఆహ్లాదకర వాతావరణంలో.. 

సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి తూర్పున కిలో మీటరు దూరంలో ఎత్తైనా రత్నగిరి కొండపై రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది. ఈ రెండు ఆలయాల మధ్య సురభిరాజుల కాలంలో నిర్మించిన శ్రీవారిసముద్రం చెరువు నియోజకవర్గంలోనే అతి పెద్దది. ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీటితో ఈ చెరువు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఈ చెరువు కట్టపై పర్యాటకుల విడిది కోసం ఐదు కాటేజీలు, రెస్టారెంట్‌, గదులు, కట్ట పొడవునా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కట్టకు ఇరువైపులా రేలింగ్‌, కట్టపైన గ్రాస్‌, ఫుట్‌పాత్‌ టైల్స్‌ నిర్మించారు. కట్ట మధ్యలో పర్యాటకులు కూర్చోవడానికి సిమెంట్‌ దిమ్మెలతో పాటు వివిధ రకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు. కాటేజీలకు వెనుకాల పర్యాటకులు వీక్షించేందుకు ప్రత్యేకంగా ఓపెన్‌ థియేటర్‌ నిర్మించారు. అక్కడే వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. కట్టపై నిలబడి ఎటు చూసిన కనుచూపు మేరలో నది నీటి అలలు పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తాయి. 50మంది పర్యాటకులు శ్రీవారిసముద్రం చెరువు నీటిలో విహరించేందుకు వీలుగా ఓపెన్‌ బోటింగ్‌ ఏర్పాటు చేశారు. లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి, ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు విడిది కోసం దాతల విరాళాలతో ఆలయం వెనుకాల మూడంతస్తుల భవనంలో గదులను నిర్మించారు. సింగవట్నం ఆలయాన్ని అన్ని హంగులతో పునర్‌ నిర్మించేందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇదివరకే సీఎం కేసీఆర్‌ కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు ఉంచారు. భవిషత్‌లో సింగవట్నం మరింత అభివృద్ధి చెందనున్నదని స్థానికులు అంటున్నారు. 


రూపురేఖలు మారిపోయాయి

తెలంగాణ టూరిజం శాఖ ద్వారా మంజూరైన నిధులతో సింగవట్నం గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కాటేజీలు, ఆహ్లాదపరిచే వివిధ పూలమొక్కలు, లైటింగ్‌, శ్రీవారి సముద్రంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌లో విహరించే పర్యాటకులు ఎంతగానో అనుభూతి పొందుతున్నారు. పర్యాటలకు ఈ ప్రాంతం ఎంతో చూడదగినది. భవిష్యత్‌లో పర్యాటకరంగంగా మరింత అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే బీరం కృషి చేయాలి. - చింతకుంట ఎల్లయ్య, సింగవట్నంlogo