సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 12, 2020 , 09:52:08

జిల్లాలో 170 మంది రక్త నమూనాల సేకరణ

జిల్లాలో 170 మంది రక్త నమూనాల సేకరణ

  • ఆరు ఐసొలేషన్‌ కేంద్రాలు
  • వైద్యుల పర్యవేక్షణలో 18మంది
  • 2వేల పీపీఈ కిట్లు, 500 ఎన్‌-95 మాస్కులు సిద్ధం
  • 10మందికి పాజిటివ్‌, ఐదుగురు మృతి
  • నాగర్‌కర్నూల్‌ డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : మందులేని కరోనా వైరస్‌కు ముందు జాగ్రత్తలే మందు. నిర్లక్ష్యం వహించడంతోనే కొందరు కరోనాకు బలవుతున్నారు. జిల్లాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ తీవ్రతను బట్టి జిల్లాలో ఆరు ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇకపై జిల్లాలోని ఈ కేంద్రాల్లోనే కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించడం జరుగుతుందని.. కరోనా వచ్చిందని ప్రజలు ఆందోళన, భయానికి గురి కావొద్దని నాగర్‌కర్నూల్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుధాకర్‌లాల్‌ తెలిపారు. గురువారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి.?

డీఎంహెచ్‌వో : జిల్లాలో ఇప్పటి వరకు 170కిపైగా అనుమానితుల రక్త నమూనాలు పంపించడం జరిగింది. జిల్లా నుంచి పంపించిన వాటిలో నాలుగు పాజిటివ్‌ కేసులుగా వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన ప్రజలవి కూడా జిల్లా చిరునామా ఆధారంగా ఇక్కడి కేసులుగా పేర్కొన్నారు. దీంతో పదికిపైగా కేసులు పాజిటివ్‌ వచ్చాయి. ఐదుగురు మరణించారు. 

కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

రెండు నెలలుగా ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేశాం. కరపత్రాలు, ఇతర సమావేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తిలో రెడ్‌జోన్లను ఏర్పాటు చేశాం. దాదాపు నెల రోజులు ఒక్క కేసు నమోదు కాలేదు. దీంతో జిల్లా గ్రీన్‌జోన్‌గా కొనసాగుతూ వచ్చింది. ఇక మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, హైపోక్లోరైట్‌తో శానిటైజర్‌  చేయించాం. కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 08540-230201ఏర్పాటు చేశాం. 24గంటల పాటు ఈ టోల్‌ ఫ్రీ ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడంతో పాటు చర్యలు తీసుకుంటాం.

జిల్లాలోనే చికిత్స చేయిస్తున్నారా..?

ఇప్పుడు కరోనా చికిత్సలు జిల్లాలోనే చేస్తున్నాం. దీనికోసం అమ్రాబాద్‌, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తిలో ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాగర్‌కర్నూల్‌లో 16మంది, కల్వకుర్తిలో ఇద్దరు ప్రస్తుతం ఈ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వెంటిలేటర్‌ అవసరం లేకుండా, సాధారణ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు ఇకపై ఈ కేంద్రాల్లోనే చికిత్స అందుతున్నది.

ఐసొలేషన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు ఉన్నాయా.?

ఆరు ఐసోలేషన్‌ కేంద్రాల్లో నిపుణులైన వైద్యులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఈ సిబ్బందికి కావాల్సిన 2వేల పీపీఈ కిట్లు, 500 ఎన్‌-95మాస్కులు కూడా ఉన్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. 24గంటల పాటూ కరోనా రోగులకు చికిత్స అందిస్తాం.

వైరస్‌ వ్యాప్తికి గల కారణాలు?

కరోనా వైరస్‌ ప్రజల చిన్నచిన్న నిర్లక్ష్యాల వల్లే సోకుతున్నది. లాక్‌డౌన్‌ మినహాయింపులతో ప్రజలు జాగ్రత్తలు మరిచిపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్లడం, వస్తుండటం వల్ల లక్షణాలు లేని వ్యక్తుల నుంచి ఒకరి ద్వారా మరొకరికి విస్తరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రజలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. 

ఎప్పటివరకు జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్‌, మందులు కనిపెట్టలేదు. ఇవి వచ్చే వరకు ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలి. కచ్చితంగా బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు, శానిటైజర్‌ ఉపయోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చిన్న పిల్లలు, వృద్ధులను బయటకు వెళ్లనీయొద్దు. ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్‌ను సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దుకాణాలు, బస్సులు, దేవాలయాలు, కార్యాలయాల్లాంటి జన సమూహ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలి.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మీరిచ్చే సలహా..?

దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, టీబీ, షుగర్‌లాంటి వ్యాధులు ఉంటే  బయటకు వెళ్లొద్దు.  నాగర్‌కర్నూల్‌లో కిడ్నీ వ్యాధి సోకిన మహిళ, ఉప్పునుంతలలో డయాబెటీస్‌, వంగూరులో టీబీ ఉన్న వ్యక్తి కరోనాతో మృతి చెందారు. జిల్లాలోనే సాధ్యమైనంత వరకు ఈ వ్యాధులకు చికిత్సలు చేయించుకోవాలి.

రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుంది.?

వానకాలం రావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండటంతోపాటు జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్యాలకు గురవుతారు. ఈ ప్రతి లక్షణాన్ని కరోనాగా భావించొద్దు. సాధారణ పీహెచ్‌సీల్లో సైతం జలుబు, దగ్గు, జ్వరానికి చికిత్సలు తీసుకోవాలి. కరోనా సోకి సాధారణ లక్షణాలు ఉన్న వ్యక్తులు సౌకర్యం ఉంటే సొంతిళ్లల్లోనే చికిత్సలు చేయించుకోవచ్చు. వైద్య శాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఇండ్లల్లో సరైన గదులు లేకుంటే ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుంది. ఇండ్లల్లో ఉండే కరోనా రోగులపై ప్రజలు వ్యతిరేకత చూపొద్దు. 


logo