బుధవారం 05 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 12, 2020 , 09:48:09

హరితమయం.. కల్వకుర్తి ఆర్టీసీ డిపో

హరితమయం..  కల్వకుర్తి ఆర్టీసీ డిపో

అతిథులు, దాతలతో  మొక్కలు నాటే కార్యక్రమం

నాటిన మొక్కలను  సంరక్షిస్తున్న సిబ్బంది

ఆలోచింపజేసేలా కొటేషన్‌ బోర్డులు

కల్వకుర్తి రూరల్‌ : కల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌ ఆర్టీసీ డిపో ప్రాంగణం పచ్చదనంతో దర్శనమిస్తున్నది. ఎక్కడ చూసినా పెద్ద చెట్లు కనిపిస్తాయి. హరితహారంలో భాగంగా నాటిన వివిధ రకాల మొక్కలు, అలంకరణ మొక్కలు, పూల మొక్కలు మరింత శోభ చేకూరుస్తున్నాయి. డిపోలో పనిచేసే ఉద్యోగులు మొక్కలను నాటారు. డ్యూటీ ఎక్కే సమయంలో, దిగే సమయంలో వాటికి నీటిని అందించడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. డిపోలో ఏటా నిర్వహించే ఆయా కార్యక్రమాలకు విచ్చేసే అతిథులతో, డిపో పరిశీలనకు వచ్చే ఉన్నతాధికారులతో డిపో ఆవరణలో మొక్కలను నాటించి మొక్కల వద్ద వారి పేర్లతో బోర్డులను ఏర్పాటు చేసి వాటికి నిత్యం నీరందిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా మొక్కలను తీసుకురావడంతో పాటుగా వాటికి పూల కుండీలను ఏర్పాటు చేసి సంరక్షిస్తుండడంతో డిపో ప్రాంగణానికి కళ సంతరించుకుంటోం ది. అంతేగాకుండా డిపో ప్రారంభంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి చల్లటి నీడనిస్తున్నాయి. బయట ఎండ ప్రభావం ఎంత ఉన్నప్పటికీ డిపోలోకి వచ్చిన వెంటనే ఆ చల్లటి గాలులు ప్రతి ఒక్కరిని మైమరిచేలా చేస్తున్నాయి. ఇందన పొదపులో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడంతో పాటుగా హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ ఆదర్శ డిపోగా తీర్చేందుకు డీఎం సుధాకర్‌ ఆధ్వర్యంలో డిపో ఉద్యోగులు కృషి చేస్తున్నారు. 

అతిథులు, దాతలతో మొక్కలు

కల్వకుర్తి డిపోలో ఏటా నిర్వహించే హరితహారం, రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఏటా వంద నుంచి రెండు వందల వరకు మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్నారు. కార్యక్రమాలకు వచ్చే స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారులు, రవాణాశాఖ అధికారులు ఎవరొచ్చినా వారి చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలను నాటింపజేసి వాటికి ట్రీగార్డులు, నాటిన వారి పేర్లను తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేసి వాటికి నిత్యం నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. బస్టాండ్‌ ఆవరణలో అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆసక్తి గల దాతల సహకారంతో మొక్కలు నాటించి వాటిని మూగజీవాలు పాడు చేయకుండా ఉండేందుకు దాతలతో ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. మొక్కలను నాటి సంరక్షిస్తున్న దాతల పేర్లను బోర్డులను ఏర్పాటు చేసి మరింత మంది దాతలు మందుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.

ఆలోచింపజేసేలా బోర్డులు

ఆర్టీసీ డిపో ప్రాంగణం, బస్టాండ్‌ ఆవరణలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటుపడేవిధంగా మొక్కలను నాటిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు. అమ్మ ప్రేమనిస్తుంది.. చెట్టు నీడనిస్తుంది.., చెట్లు మన చుట్టూ ఉన్న నేస్తాలు.. పచ్చదనం మన ప్రగతికి సంకేతాలు అంటూ ఇలా ప్రకృతి పరిరక్షణకు పాటుపడేవిధంగా ఏర్పాటు చేశారు. కొటేషన్లను చదివిన ఉద్యోగులు ఎవరైనా అక్కడ కొంత సమయం ఆగి మొక్కలకు తమవంతు బాధ్యతగా నీటిని అందిస్తూ కాపాడుతున్నారు. అంతేగాకుండా పచ్చదనంపై మరింత ఆసక్తి ఉన్న ఉద్యోగులు తమ సొంతఖర్చుతో మొక్కలను వాటికి తొట్లను ఏర్పాటు చేసి రంగులను వేయించారు. ఉద్యోగుల స్టాఫ్‌ నంబర్లను పూల తొట్లపై (కుండీలపై) డీఎం సుధాకర్‌ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు తెచ్చి పెట్టిన మొక్కలను, అతిథులు, ఉన్నతాధికారులతో నాటించిన మొక్కలను సంరక్షిస్తున్నారు. కల్వకుర్తి ఆర్టీసీ ఉద్యోగులు అటు ఇంధనాన్ని పొదుపు చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ ఆదర్శనీయంగా.. హరిత డిపోగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. 

బాధ్యతగా  సంరక్షిస్తున్నారు

కల్వకుర్తి ఆర్టీసీ డిపోను ఆదర్శ, గ్రీనరీ డిపోగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఉద్యోగులు డిపోలో తమ సొంత ఖర్చులతో అలంకరణ, పూల మొక్కలను ఏర్పాటు చేశారు. వాటికి నిత్యం బాధ్యతగా నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. డిపో ప్రాంగణం, బస్టాండ్‌ ఆవరణలో దాతల సహకారంతో మరిన్ని మొక్కలు నాటి బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. బస్టాండ్‌, డిపోలో మొక్కలు బాగా పెరగడం వల్ల కొత్తందం వచ్చినట్లుగా ఉంది. హరితహారంలో భాగంగా బస్టాండ్‌ పరిసరాలలో ఈ సారి మరిన్ని మొక్కలు నాటి సంరక్షిస్తాం. 

- సుధాకర్‌, డీఎం,  కల్వకుర్తి ఆర్టీసీ డిపో


logo