సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 10, 2020 , 05:08:15

ఐసోలేషన్‌ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్‌

ఐసోలేషన్‌ కేంద్రాల్లో ట్రీట్‌మెంట్‌

  • జలుబు, దగ్గు, జ్వరాలకు పీహెచ్‌సీల్లో పరీక్షలు
  •  వెంటిలేటర్ల స్థాయి రోగులు గాంధీకి..
  •  సాధారణ లక్షణాలుంటే ఐసోలేషన్‌కు..
  • సౌకర్యముంటే సొంత నివాసాల్లోనే..
  • ఆదేశాలు జారీ చేసిన వైద్య శాఖ

కొవిడ్‌ -19 చికిత్స ఇక జిల్లాల్లోనే జరగనున్నది. లాక్‌డౌన్‌ సడలింపులతో ఇటీవల కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారికే హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్‌ దవాఖానల్లో చికిత్సలు అందించ నున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో పెరిగిన రోగులకు అనుగుణంగా, కరోనా స్థాయిని బట్టి జిల్లాల్లోనే వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాల్లోనూ ట్రీట్‌మెంట్‌ అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది.

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 (కరోనా) చికిత్స ఇక జిల్లాల్లోనే చేయనున్నారు. మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు కరోనా వ్యాప్తి తీవ్రత తెలిసి వచ్చింది. నోటి, ముక్కు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోంది. ఉమ్మడి పాలమూరులో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో గద్వాలలో కేసులు తీవ్రంగా పెరిగాయి. అప్పటివరకు వనపర్తి, నారాయణపేటలో ఒక్క కేసు నమోదు కాలేదు. దీంతో రెండు కేసులతో కలిపి మూడు జిల్లాలు గ్రీన్‌జోన్‌లో కొనసాగాయి. ఇక మహబూబ్‌నగర్‌ ఆరెంజ్‌ జోన్‌లో గత నెలాఖరు వరకు ఉన్నది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇవ్వడంతో ఇటీవల కేసులు పెరుగుతున్నాయి.

కరోనా మరణాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. నారాయణపేటలో, ఉప్పునుంతలలో ఇద్దరు చిన్నారులు, ఉప్పునుంతల(మర్రిపల్లి), బల్మూర్‌(వీరంరాజుపల్లి) మండలాల్లో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఇలా కరోనా వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిమ్స్‌ దవాఖానను కరోనా దవాఖానగా మార్చింది. 14-29 రోజుల వ్యవధుల్లో వ్యక్తుల వయస్సు, ఆరోగ్యాలను బట్టి కరోనా లక్షణాలు వెలువడుతున్నాయి. పదేండ్లలోపు చిన్నారులు, 60 ఏండ్లు దాటిన వృద్ధులతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యువకులు, ఇమ్యూనిటీ పవర్‌ ఉన్న వ్యక్తులు కరోనా చికిత్సతో కోలుకుంటున్నారు. సాధారణ జలుబు మాదిరిగానే ఉండటంతో గాంధీ దవాఖానలో చికిత్స తర్వాత కోలుకుంటున్నారు.

ఎక్కువమందికి సాధారణ లక్షణాలతో గాంధీలోనే చికిత్స నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలోని కరోనా రోగులందరినీ అక్కడికే రెఫర్‌ చేస్తున్నారు. దీంతో గాంధీ దవాఖానలో సామర్థ్యానికి మించి రోగులు చేరుతున్నారు. ఇక కరోనాపై ప్రజల్లో అవగాహన, ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిన నేపథ్యంలో సాధారణ లక్షణాలు ఉన్న రోగులకు జిల్లాల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లోనే చికిత్స నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. 

11 ఐసొలేషన్‌ కేంద్రాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, అమ్రాబాద్‌, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు, జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో వార్డులో దాదాపు 30 బెడ్లు ఏర్పాటు చేస్తారు. కరోనా సాధారణ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఆ రోగులకు ఈ కేంద్రాల్లోనే ఇకపై చికిత్సలు అందించనున్నారు. తీవ్రమైన శ్వాస సమస్యలు ఉంటే హైదరాబాద్‌కు తరలిస్తారు. ప్రస్తుతం సాధారణ లక్షణాలకు సైతం జిల్లా దవాఖానలు, ఇతర గుర్తింపు పొందిన దవాఖానలకు బదులు స్థానిక పీహెచ్‌సీల్లోనే పరీక్షలు చేసేలా వైద్యశాఖ నిర్ణయించింది.

దీంతో జలుబు, దగ్గు, జ్వరం వస్తే ప్రజలు పీహెచ్‌సీల్లోనే పరీక్షలు చేయించుకోవచ్చు. దీనికి తోడు సాధారణ లక్షణాలున్న రోగులు తమ సొంత నివాసాల్లో ప్రత్యేక గదులు ఉంటే అందులోనే ఉండి చికిత్స చేయించుకునే అవకాశాలనూ వైద్యారోగ్య శాఖ కల్పిస్తున్నది. ఇండ్లల్లో సౌకర్యాలు లేని ప్రజలకు జిల్లాల్లోని ఈ ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉంచుతారు. ఈ నేపథ్యంలో కరోనా కిట్లు, మందులను సమకూర్చనున్నది. ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు రాగా అధికారిక ఉత్తర్వుల కోసం వైద్యారోగ్య శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. దీంతో కరోనా వచ్చినా సాధారణ లక్షణాలున్న రోగులకు జిల్లాల్లోనే చికిత్సలు అందనున్నాయి.

సాధారణ లక్షణాలుంటే జిల్లాలోనే.. 

కరోనా సాధారణ లక్షణాలుంటే జిల్లాలోని ఐసొలేషన్‌ కేంద్రంలోనే చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. వైద్యారోగ్య శాఖ చేసిన ప్రకటనకు సంబంధించి అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి వెంటిలేటర్‌ అవసరమున్న రోగులను మాత్రం హైదరాబాద్‌కు తరలించడం జరుగుతుంది. జిల్లాలో ఐదు ఐసొలేషన్‌ కేంద్రాలు ఉన్నాయి. గాంధీ దవాఖానలో పెరిగిన ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కుల్లాంటి ఇతర వైద్య పరికరాలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. ఉత్తర్వులు అందాక పూర్తిస్థాయిలో ఐసొలేషన్‌ కేంద్రాల నిర్వహణ చేపడుతాం.

- సుధాకర్‌లాల్‌, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్‌


logo