శనివారం 08 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 09, 2020 , 06:25:33

తీర్థప్రసాదాలు లేకుండా..గంట మోగకుండా.. దర్శన భాగ్యం

తీర్థప్రసాదాలు లేకుండా..గంట మోగకుండా.. దర్శన భాగ్యం

  • తెరుచుకున్న ఆలయాలు
  • భౌతిక దూరం పాటిస్తూ.. శానిటైజేషన్‌ చేస్తూ..
  • షాపింగ్‌ మాల్స్‌,  హోటళ్ల్లూ ఓపెన్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు సోమవారం తెరుచుకున్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన ఆలయాలు ప్రత్యేక పూజలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. జోగుళాంబ, ఉమామహేశ్వరం, సోమశిల, సింగోటం లక్ష్మీనారసింహస్వామి, మన్యంకొండ, కురుమూర్తి, జములమ్మ, శ్రీరంగపురం రంగనాయకస్వామి తదితర ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. మసీదులు, చర్చిల్లో సైతం వేకువజామునుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. కరోనా వైరస్‌ దృష్ట్యా అధికారులు ఆలయాల వద్ద ప్రతేక చర్యలు చేపట్టారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు, శానిటైజేషన్‌ చేస్తూ..భౌతిక దూరం పాటించేలా భక్తులను ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు సైతం సోమవారం నుంచి తెరుచుకోవడంతో అక్కడక్కడ రద్దీ కనిపించింది. 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/అచ్చంపేట రూరల్‌/శ్రీశైలం/కొల్లాపూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో శానిటైజేషన్‌ చేశారు. క్యూలైన్‌లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో..

సోమవారం తెల్లవారుజామున వేదపండితులు శాస్ర్తోక్తంగా శ్రీశైల ఆలయ సంప్రోక్షణ చేసిన అనంతరం ఈవో రామారావు కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్ల ను దర్శించుకున్నారు. దేవస్థాన ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ముందు గా టైం స్లాట్‌ ప్రకారం దర్శనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించి శానిటేషన్‌ చేసుకున్న తరువాతే క్యూ లైన్లలో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. శరీర ఉష్ణోగ్రతను గుర్తించేందుకు థర్మల్‌ గన్‌ ఉపయుక్తంగా ఉందని ఆలయ సిబ్బంది అంటున్నారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించి దీపార్చన గావించారు. గంటకు 300 మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు.

సోమశిల..సింగోటంలో..

సింగవట్నం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంతోపాటు సోమశిలలోని లలితాంబికా సోమేశ్వరస్వామి ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్‌ దృష్ట్యా ఆలయాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరించి వచ్చే వారినే ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు ఆలయ ఉద్యోగి పరందామరెడ్డి తెలిపారు.

ఉమామహేశ్వరంలో..

శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో ఉమామేశ్వరుడికి సోమవారం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చైర్మన్‌ సుధాకర్‌, కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్‌రావు భక్తుల ప్రవేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు చేతుల్లో శానిటైజర్‌ వేస్తూ క్యూలైన్‌లో భౌతిక దూరం పాటించేలా సర్కిళ్లను ఏర్పాటు చేశారు. 

జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయకమిటీ అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బందితో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, సాయిబాబ, తదితర ఆలయాల్లో నిబంధనలు లోబడే పూజలు జరుగుతాయని ఆలయాల పూజారులు పేర్కొన్నారు. ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇచ్చే అవకాశం లేదని, భౌతిక దూరంలో దర్శనం చేసుకోవాలని సూచించారు.logo