మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 08, 2020 , 04:31:41

ఇండ్లు కోల్పోయే వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు

ఇండ్లు కోల్పోయే వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు

  • స్వచ్ఛందంగా ముందుకొస్తున్న బాధితులు
  • చొరవ తీసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మూడు  దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వనపర్తి పట్టణవాసుల కల నెరవేరుతున్నది.. అప్పుడూ.. ఇప్పుడంటూ ముప్పై ఏండ్లుగా పట్టణంలో రోడ్ల విస్తరణ చేస్తామని ఊరించారే తప్ప.. అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  ప్రతి అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన హామీగా నిలిచిన రోడ్ల విస్తరణ ఇక వచ్చే ఎన్నికల వరకు అవకాశం లేకుండా పనులు జరుగుతున్నాయి..

- వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం పట్టణవాసులు విసిగిపోయారు. ఇంతకాలానికి ప్రారంభమైన విస్తరణ పనులు పలు ఆటంకాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నది. రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయే బాధితులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముందు నుంచి బాధితులతో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించిన తర్వాతే విస్తరణ పనులు మొదలు పెడుతున్నారు. అయితే, ముందుకొచ్చే వారిని కొందరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ససేమిరా అంటుండటం కొసమెరుపు. ఇటీవల మారెమ్మకుంట ప్రాంతంలో 10 మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి ఇండ్లను కూల్చి వేయించారు. రోడ్ల విస్తరణ పనులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గతంలోనే మంత్రి కేటీఆర్‌ను జిల్లా కేంద్రానికి ఆహ్వానించి రూ.50కోట్లు మంజూరు చేయించారు. ఇందుకు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అవసరమైన చర్యలు చేపడుతుండటంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విస్తరణ పనులు సాగుతున్నాయి. ఇటీవల అప్పాయిపల్లి రోడ్డులోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్ల సహకారంతో పనులు వేగంగా జరిపిస్తున్నారు. సమస్యలొస్తే మంత్రితోపాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి యత్నిస్తుండటంతో పనులు సజావుగా జరుగుతున్నాయి.

నాగవరం రోడ్డు పూర్తి

ముందుగా అధికారులు నాగవరం రోడ్డును పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లను తొలగించి వెడల్పు చేశారు. అయితే, ఇక్కడ నూతనంగా డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యాలతోపాటు బీటీ రోడ్డు వేయించారు. దీంతో ప్రస్తుతం నాగవరం రోడ్డు పూర్తి చేశారు. ఈ రోడ్డు తర్వాత చిట్యాల రోడ్డుపై దృష్టి పెట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లను తొలగించి వేయడంతో ఇతర పనులు కూడా చేస్తున్నారు. రూ.25లక్షలతో డ్రైనేజీ, రూ.10లక్షలతో విద్యుత్‌ పనులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ రోడ్డులోనూ మెజార్టీగా బాధితులు ముందుకొచ్చి వారి ఇండ్లను తొలగించుకుంటున్నారు. దాదాపు 20మంది వరకు అక్కడ స్ఫూర్తిగా నిలిచారు. దీంతో హైదరాబాద్‌ రోడ్డులోనూ పనులు వేగవంతమయ్యాయి. మిగిలిన వారికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు రోడ్ల విస్తరణ చేపట్టకుంటే భవిష్యత్‌లో ఎప్పుడూ జరుగదని పట్టణవాసులు అంటున్నారు.

ఇండ్లు కోల్పోయే వారికి బాసట

రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి భరోసా ఇస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పట్టణ శివారులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి సరిపోకున్నా కొత్తగా మరిన్ని ఇండ్లు చేపట్టాలన్న ప్రయత్నం కొనసాగుతున్నది. ఇందుకు స్థలాలను కూడా గుర్తించారు. విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి తప్పనిసరిగా ప్రభుత్వ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పాయిపల్లి, పెద్దగూడెం రోడ్డులో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిలో అప్పాయిపల్లి రోడ్డులోని నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. రోడ్డు విస్తరణ బాధితులకు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

బాధితులను ఆదుకుంటాం 

రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న బాధితులను అన్ని విదాలా ఆదుకుంటాం. మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ సూచనల మేరకు ఇండ్లు ఎంత పరిమితిలో కోల్పోతున్నారో పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. ఇండ్లు కోల్పోతున్న బాధితులతో మంత్రి ఆదేశాల మేరకు ఇటీవల హైదరాబాద్‌, చిట్యాల, పాన్‌గల్‌, ప్రధాన రహదారి విస్తరణ బాధితులతో మాట్లాడటం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్రూం వచ్చేలా మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 

- గట్టుయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వనపర్తి


logo