బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 08, 2020 , 04:14:34

వనపర్తి జిల్లాలో 262 నర్సరీలు

వనపర్తి జిల్లాలో 262 నర్సరీలు

  • అడవుల పెంపునకు ప్రాధాన్యం
  • మంకీ ఫుడ్‌ కోర్టులకు స్థలాన్వేషణ
  • 20నుంచి ఆరో విడుత హరితహారం

వనపర్తి రూరల్‌ : మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న పచ్చదనానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వనపర్తి జిల్లాను వనాలపర్తిగా మార్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ఉపాధి పథకం ఆధ్వర్యంలో 253, ఆటవీశాఖ ఆధ్వర్యంలో 9 నర్సరీలను ఏర్పాటు చేశారు. అందులో 60 లక్షలకు పైగా పర్యావరణానికి మేలు చేసే మొక్కలు పెంచుతున్నారు. పాన్‌గల్‌ తదితర అటవీ ప్రాంతాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసేందుకు అటవీ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా భూసేకరణకు సర్వే చేస్తున్నారు.

నీటి వసతి ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి రావి, సీమ తంగెండు, ఉసిరి, చింత, వేప తదితర పండ్ల మొక్కలకు వేదికగా ఉండాలని భావిస్తున్నారు. అడువుల్లో కోతులకు ఆహారం దొరకక పంట పొలాల్లోకి, పట్టణంలోకి వచ్చి బీభత్సం చేస్తున్నందున ఈ పథకం ద్వారా పండ్ల మొక్కలతోపాటు పచ్చదనం ఇచ్చే మొక్కలు నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 5.4 శాతం అడవులు ఉన్నాయి. వనపర్తి, ఖిల్లాఘణపురం ఫారెస్టు రెంజ్‌లో కలిపి 11,600 హెక్టార్లు అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు. ఘణపురం, పెద్దమందడి, పాన్‌గల్‌ శివారులో అడవి ఉంది. ఈ నెల 20న ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

వివిధ రకాల మొక్కలు 

హరితహారం కార్యక్రమంలో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. అందులో జామ, సీతాఫలం, ఉసిరి, మలబారు వేప, నిమ్మ, కానుగ, నేరేడు, వేప, కరివేపాకు, పారిజాతం, తులసి, సపోట, రేగు, చింత, మునగ మొక్కలను అటవీశాఖ నర్సరీల్లో పెంచుతున్నారు. మొత్తం అటవీశాఖ లక్ష్యం 39.65లక్షలు కాగా 60లక్షలకు పైగా మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జిల్లాలోని 255 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 253 నర్సరీల్లో కోటి 81లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు. వీటిలో రైతులకు ఉపయోగపడేలా టేకు మొక్కలు ఉన్నాయి.

మొక్కలు పెంచాలనే లక్ష్యం

జిల్లాలో 253 నర్సరీల్లో మొక్కల పెంపకం జరుగుతుంది. ఆరో విడుతలో 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా మొక్కలు పెంచాం. అన్ని రకాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. నాటిన ప్రతి మొక్క బతికేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ ఉండటంతో మొక్కలకు నీళ్లుపోసేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా పేరును వనాలపర్తిగా మార్చేందుకు అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. 

- గణేశ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, వనపర్తి జిల్లా


logo