మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - May 27, 2020 , 02:00:39

వన్యప్రాణుల దాహం తీరింది

వన్యప్రాణుల దాహం తీరింది

 నల్లమలలోని నాలుగు రేంజ్‌ల పరిధిలో 300 సాసరుపిట్ల ఏర్పాటు

 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

 అడవుల్లోకి ప్రజలు వెళితే చర్యలు : ప్రభాకర్‌, అమ్రాబాద్‌ రేంజ్‌ అధికారి

అమ్రాబాద్‌: ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరో వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు మిషన్‌ భగీరథ, బోర్ల నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నారు.. అటవీ ప్రాంతమైన నల్లమల అడవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ఫారెస్ట్‌ అధికారులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 300లకు పైగా సాసరుపిట్లు ఏర్పాటు చేశారు. సహజసిద్ధమైన నీటి కుంటలు, సెలిమెలు అడుగంటి పోవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తూ కరెంటు తీగలు, వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండ అటవీవాఖ అధికారులు అడవుల్లో వన్యప్రాణుల కోసం అవసరమైన చోట సాసరుపిట్లు ఏర్పాటు చేశారు. ఇదివరకు ఉన్నవాటికి కూడా మరమ్మతులు చేసి నీటిని నింపుతున్నారు. నల్లమలలో 18 నుంచి 20 పెద్దపులులు, వందకు పైగా చిరుతలు, 500లకు పైగా ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి కుక్కలు, రేసులు, నక్కలు తదితర జంతువులు ఉన్నాయి. 50కి పైగా సహజసిద్దమైన నీటి కుంటలు, 80కి పైగా చెక్‌డ్యాంలు ఉండగా చాలా వాటిలో వేసవి రావడంతో నీరు ఎండిపోయింది. సాధారణంగా జంతువులు ఆహార అన్వేషణలో భాగంగా నిత్యం నాలుగు కిలోమీటర్లు ప్రయాణాలు సాగిస్తాయి. అటవీశాఖ అధికారులు అడవిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా వాటి కదలికలకు అనుగుణంగా సాసరుపిట్లను ఏర్పాటు చేసి, వాటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని నాలుగు రేంజ్‌లలో పాతవి, కొత్తగా ఏర్పాటుచేసిన మొత్తం 300లకు పైగా సాసరుపిట్ల ద్వారా వన్యప్రాణుల దాహార్తిని తీర్చుతున్నారు. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడంలేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 

అడవిలోకి వెళ్లడం నిషేధం 

నల్లమల అటవీ పరిసర ప్రాంతాల ప్రజలు అనవసరంగా అడవుల్లోకి వెళ్లడం నిషేదం. వన్యప్రాణులు సాసరుపిట్లలో నీరు తాగేందుకు రావడం జరుగుతుంది. ప్రజలు అటువైపు వెళ్తే వాటికి విఘాతం కలిగి భయంతో పరుగులు తీస్తాయి. అన్ని గ్రామాలు, చెంచు గూడెంలలో అవగాహన కల్పించాము. అనుమతులు లేకుండా అడవిలోకి వెళ్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అడవుల, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

- ప్రభాకర్‌, అమ్రాబాద్‌ రేంజ్‌ అధికారి


logo