శనివారం 11 జూలై 2020
Nagarkurnool - May 25, 2020 , 02:36:35

పరుగెడితే పతకమే

పరుగెడితే పతకమే

జాతీయస్థాయిలో నల్లమల విద్యార్థి సత్తా

సౌత్‌జోన్‌ పరుగు పందెంలో గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌

రాష్ట్రస్థాయిలో 100, జాతీయస్థాయిలో 54 పతకాలు

ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు

అచ్చంపేట రూరల్‌: ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ.. పరుగుపందెంలో.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నల్లమల విద్యార్థి రమేశ్‌చంద్ర.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అటవీప్రాంతమైన అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌కు చెందిన రమావత్‌ లక్ష్మీబాయి, రాములు దంపతులకు రమేశ్‌చంద్ర నాలుగో సంతానం.. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి కనబర్చడంతో తల్లిదండ్రులు పోత్సహించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖమ్మం జిల్లా భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో.., పదో తరగతి మన్ననూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశాడు. చిన్న నాటి నుంచి క్రీడలపై ఆసక్తి కలిగిన విద్యార్థి 2011లో లాంగ్‌ జంప్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి కేరీర్‌ ప్రారంభించాడు. నల్లమల ప్రాంతంలోని మారుమూల గిరిజనతండాలో పేద కుటుంబంలో జన్మించి రాష్ట్ర, జాతీయస్థాయిలో సత్తా చాటుతున్న గిరిజన క్రీడాకారుడు రమేశ్‌చంద్రను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.  

అథ్లెట్స్‌లో సాధించిన పతకాలు

  • 2012 కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి 6 కి.మీ.ల పరుగుపందెంలో 3వ స్థానం, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతలో నిర్వహించిన 5 కి.మీ.ల పరుగు పందెంలో 16వ స్థానంలో నిలిచాడు. 
  • 2013 జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన అండర్‌-19 స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 5 కి.మీ.ల పరుగు పందెంలో 8వ స్థానంలో నిలిచాడు. 
  • 2014 హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించిన సౌత్‌జోన్‌ జాతీయస్థాయి 3 కి.మీ.ల పరుగు పందెంలో 4వ స్థానం. 
  • 2015 విజయవాడలో నిర్వహించిన జూనియర్‌ నేషనల్స్‌ 3 కి.మీ.ల పరుగు పందెంలో 9వ స్థానం. 
  • 2016 కరీంనగర్‌లో నిర్వహించిన సౌత్‌జోన్‌ 5 కి.మీ.ల పరుగు పెందెంలో గోల్డ్‌మెడల్‌, 10 కి.మీ.ల పరుగు పందెంలో వెండి పతకం, ప్రశంసాపత్రాలను సైతం కైవసం చేసుకుని మంత్రి ఈటెల రాజేందర్‌తో చెక్కు అందుకున్నాడు. 
  • 2017 ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహించిన మారథాన్‌ 21కి.మీ.ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి అప్పటి సీఎం చంద్రబాబుతో చెక్కు అందుకున్నాడు. 
  •  2019 జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించిన సీనియర్‌ నేషనల్స్‌ 3 కి.మీ.ల పరుగు పందెంలో 10వ స్థానంలో నిలిచాడు. ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2019 మారథాన్‌ క్రీడల సందర్భంగా చెక్కును అందజేసి అభినందించారు. 

ప్రోత్సహిస్తే సత్తా చాటుతా..

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆర్థికసాయం చేసి ప్రోత్సహిస్తే క్రీడా రంగంలో మరింత ప్రతిభ చాటుతా. నేటికీ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 6గంటల పాటు పరుగు పందెం సాధన చేస్తున్నాను. స్పోర్ట్స్‌ కోటలో ప్రభుత్వ ఉద్యోగం సాధంచడమే లక్ష్యం. 

- రమావత్‌ రమేశ్‌చంద్ర, అథ్లెటిక్‌ జాతీయ క్రీడాకారుడు, మన్ననూర్‌


logo