ఆదివారం 31 మే 2020
Nagarkurnool - May 24, 2020 , 02:33:55

సుర్రుమంటోంది..!

సుర్రుమంటోంది..!

రోహిణికి ముందే ఠారెత్తిస్తున్న ఎండలు

వడగాలులతో ప్రజల ఉక్కిరిబిక్కిరి

ఉక్కపోతతో తల్లడిల్లుతున్న జనం

బయటికి రావొద్దంటున్న వైద్యులు

బయటకొస్తే సుర్రుమంటున్నది.. రోహిణికి రెండ్రోజుల ముందే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈశాన్యం నుంచి వీస్తున్న వడగాలులు ప్రజలను ఉక్కపోతకు గురిచేస్తూ తల్లడిల్లేలా చేస్తున్నాయి. వడదెబ్బ సోకే ఆస్కారం ఉన్నందున చిన్నారులు, వృద్ధులు వారం రోజుల పాటు ఇండ్లకే పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు..

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండకాలం కీలక దశకు చేరుకున్నది. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడిమి, ఉక్కపోతకు తల్లడిల్లుతున్నారు. ఉత్తర ఈ శాన్యంవైపు నుంచి వారం రోజుల పాటు వడగాలు లు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇండ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు వేసుకున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించ డం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. యువకులు అక్కడక్కడా చెరువులు, బావుల్లో ఈత కొడుతూ సేదదీరుతున్నారు. తలకు తువ్వాలు, నెత్తిన టోపీలు, గొడుగులతో పనికోసం వచ్చే ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇక ద్విచక్రవాహనదారులు హె ల్మెట్లను ధరిస్తున్నా రు. ఉక్కపోతతో చ ర్మవ్యాధులు వచ్చే అ వకాశం ఉండడంతో పౌడర్లు వాడుతున్నా రు. రోజుకు నాలుగైదుసార్లు స్నానాలు చేస్తూ ఎండవేడిమి ఉంచి ఉపశమనం పొందుతున్నా రు. కేవలం ఉదయం మాత్రమే బయటకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులు, కూరగాయలు కొం టున్నారు. ఫలితంగా మధ్యాహ్నం వేళ పట్టణ కేంద్రాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. దా దాపుగా 45 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌తో కూలర్లు, ఏసీల విక్రయాలూ పడిపోయాయి. సగానికిపైగా వస్తువులు అమ్ముడుపోకుండా దుకాణాల్లో అలంకా ర ప్రాయంగా మారాయి. ఎండ వేడి కారణంగా ఉపాధిహామీ కూలీలు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మాత్రమే పనులు చేస్తున్నారు. ఈ పనుల వద్ద టెంటు లాంటి నీడ సౌకర్యం కల్పిస్తున్నారు. 

ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు

పనుల కోసం బయటికి వస్తున్న ప్రజలు ఎండవేడిమిని తాళలేక కొబ్బరిబొండాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు సేవిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చలివేంద్రాలు, అంబలికేంద్రాలు, చెరుకు రసం బండ్లు ప్రారంభం కాకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ఒక్కో కొబ్బరి బొండాంను రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. పండ్ల రసాలను సైతం గ్లాసుకు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. రూ.20 విలువైన చిన్న కూల్‌డ్రింక్‌ సీసాకు రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు అధిక ధరలైనా శీతల పానీయాలను కొని తాగుతున్నారు. 

వడదెబ్బ లక్షణాలు..

 • ఎండలో తిరిగే ప్రజలు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఫలితంగా శరీరంలో నీటి శాతం, లవణాలను కోల్పోతారు. దీంతో వడదెబ్బకు గురవుతారు.
 • శరీర ఉష్ణోగ్రత దాదాపుగా 104 డిగ్రీల వరకు పెరుగుతుంది. 
 • గుండె, నాడి వేగంగా కొట్టుకుంటాయి.
 • చిరాకు, కంగారుకు గురవుతారు. 
 • అపస్మారక స్థితికి చేరుకుంటారు.
 • తలనొప్పి రావడం, తల తిరగడం, వాంతులు వంటివి వస్తాయి. 
 • హైబీపీ లేదా లోబీపీ వస్తుంది.

ప్రథమ చికిత్స..

 •  వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి.
 •  శరీరాన్ని చల్లని నీటితో తుడవటంతో వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 •  శరీర ఉష్ణోగ్రత తగ్గే వరకూ ఇలా చేయాలి.
 •  చల్లని పానీయాలు తాగించాలి.
 •  సొంత వైద్యం మాత్రం చేయకూడదు, డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం.

నివారణ ఇలా..

 •  ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఇండ్లల్లో నుంచి బయటికి రావాలి.
 •  మధ్యాహ్నం ఇంటికే పరిమితం కావాలి.
 •  అత్యవసరమైతే గొడుగు లేదా తలను, ముఖాన్ని కప్పి ఉంచేలా టోపీలు, టవాల్‌ ధరించాలి.
 •  చల్లని నీళ్ల బాటిళ్లను వెంట పెట్టుకోవాలి.
 •  10 నుంచి 15 నిమిషాలకోసారి నీళ్లను తాగుతూ శరీరం వేడికి గురి కాకుండా చూసుకోవాలి.
 •  తెల్లటి, వదులైన దుస్తులను ధరించాలి

 • బట్టలు కొనేందుకు వచ్చా..

రంజాన్‌ పండుగ ఉన్నందున బట్టలు కొనేందుకు నాగర్‌కర్నూల్‌కు వచ్చా. ఎండలు ఎక్కువగా  ఉన్నాయి. అందుకే గొడుగు తీసుకొని వచ్చాను. ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు. 

- మన్సూర్‌, యాదిరెడ్డిపల్లి, నాగర్‌కర్నూల్‌

ప్రజలు బయటికి రావొద్దు..

ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. ఉదయం 10 గంటల వరకే ప్రజలు తమ పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలి. చల్లని నీళ్లు తరచూ తాగాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దలు రోడ్లపైకి రావొద్దు. వడదెబ్బకు గురైతే కాలయాపన చేయకుండా దవాఖానలకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. 

- సుధాకర్‌లాల్‌, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్‌

విక్రయాలు కాస్త పెరిగాయి.. 

ఎండల వేడిమికి ప్రజలు కూలర్లను విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్‌లో సడలింపులివ్వడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు కూలర్లు కొంటున్నారు. కానీ ఎండకాలం చివరి దశకు రావడంతో లాభాలు అటుంచితే పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కాస్త విక్రయాలు పెరిగాయి. 

- షఫీ, ఎలక్ట్రానిక్‌ వ్యాపారి, నాగర్‌కర్నూల్‌


logo