బుధవారం 27 మే 2020
Nagarkurnool - May 24, 2020 , 02:34:06

కరోనా కలవరం

కరోనా కలవరం

రామచంద్రాపురంలో వ్యక్తికి కరోనా పాజిటివ్‌

 యాద్గిర్‌లో ఒక్క రోజే 72,   రాయిచూర్‌లో 39 కేసులు

 కర్ణాటకలోని గ్రీన్‌ జోన్లలో  పెరిగిన కేసులు

 అప్రమత్తమైన నారాయణపేట,  జోగుళాబ గద్వాల జిల్లాలు

 వివరాల సేకరణలో అధికారులు

 భౌతిక దూరం పాటించాలి : డీఎంహెచ్‌వో 

  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ 

  మహబూబ్‌నగర్‌ ప్రతినిధి : తెలంగాణ సరిహద్దులోని కర్ణాటకలోని రాయిచూర్‌, యాద్గిర్‌ జిల్లాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్కరోజే యాద్గిర్‌ జిల్లాలో 72, రాయిచూర్‌ జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాలో 50 రోజులకుపైగా పాజిటివ్‌ కేసులే లేవు. 6 రోజుల కిందట తొలి కేసు నమోదైంది. ఇప్పటికే 65 కేసులు నమోదయ్యాయి. ఇక యాద్గీర్‌ జిల్లాలో శుక్రవారం 15 కేసు లు.. శనివారం 72 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది. మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయిన తర్వాత తెలంగాణ నుంచి కర్ణాటక వైపు వాహనాలు రాకుండా అక్కడి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి వలస కూలీలు ఒక్కసారిగా కర్ణాటకకు రావడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అక్కడి అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచారు. ఇప్పుడు వీటి ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. 

అప్రమత్తంగా అధికారులు

  రెండు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ జిల్లాలకు సరిహద్దున ఉన్న జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల యంత్రా ంగం కూడా అప్రమత్తమైంది. కర్ణాటకతో ఉన్న సరిహద్దు చెక్‌పోస్టులను మూసేశారు. అక్కడి నుంచి తెలంగాణలోకి రాకపోకలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా రాయిచూర్‌ నుంచి యాద్గిర్‌కు, గుల్బర్గా వెళ్లేందుకు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ తరుణంలో రాయిచూర్‌-గూడెబల్లూరు- గుల్బర్గా మార్గంలో కర్ణాటక నుంచి రాకపోకలు లేకుండా అధికారులు చెక్‌పోస్టులు మూసేశారు. గ్రీన్‌ జోన్‌లో ఉన్న నారాయణపేట జిల్లాలోకి కొ త్త వారు వస్తే వెంటనే తెలిసిపోతుందని కలెక్టర్‌ హరిచందన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్‌ కమిటీలు కొత్త వాళ్లు ఎవరైనా వస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలిపేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. ప్రజలకు కరోనాపై పూర్తి అవగాహన కల్పించామని కొత్త వాళ్లు వస్తే వెంటనే తమకు సమాచారం వస్తుందన్నారు. ఇన్నాళ్లు ఏపీలోని కర్నూల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగి గద్వాల జిల్లాను ఆందోళనకు గురి చేయగా.. ఇప్పుడు కర్ణాటక రూపంలో ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చారకొండ : నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలో కరోనా కలకలం రేగింది. మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన 55 ఏండ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సదరు వ్యక్తి ఈనెల 13న నల్గొండ జిల్లా డిండి మండలం రామంతాపురంలో జరిగిన తన బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం 17న సంప్రదాయం ప్రకారం దంపతులు వడి బియ్యం పోసుకొని రామచంద్రాపురానికి చేరుకున్నాడు. 18న బంధువులకు విందు భోజనం పెట్టాడు. తర్వాత 20వ అనారోగ్యానికి గురికావడంతో కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా అక్కడ వైద్యులు టీబీ ఉందని, కరోనా లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ దవాఖానకు రెఫర్‌ చేశారు. అక్కడకు వెళ్లగా వైద్యులు కింగ్‌కోఠి దవాఖానకు వెళ్లాలని సూచించగా 22న దవాఖానకు వెళ్లాడు. అతని నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. కాగా శనివారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, తాసిల్దార్‌ నాగమణి, పంచాయతీ అధికారి నారాయణ, సీఐ నాగరాజు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కంటైన్‌మెంట్‌ గ్రామంగా ప్రకటించిన్నట్లు అధికారులు తెలిపారు. 


logo