మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Apr 13, 2020 , 03:08:03

లక్ష మాస్కులు.. పదివేల పీపీఈ కిట్లు

లక్ష మాస్కులు.. పదివేల పీపీఈ కిట్లు

  • గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తయారీ 
  • లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మహిళలకూ ఉపాధి
  • కరోనాపై పోరుకు మేము సైతం అంటూ ముందుకు..

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు మాస్కులు లేనిది బయటకు రాని పరిస్థితి. ప్రత్యేక వైద్యులు, పోలీసులు, సిబ్బంది అయితే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (PPE)లు ధరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్‌ బాగా పెరగడంతో మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ మహిళలకు ఉపాధి కల్పిస్తూ..గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తయారీ చేయిస్తున్నారు. ఇప్పటికే మాస్కులు సిద్ధం కాగా పీపీఈల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు.

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీగా మాస్కులు, పీపీఈలు తయారు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వెంటనే స్పందించింది. లక్ష మాస్కులు, పది వేల పీపీఈలు తయారు చేసేందుకు రంగంలోకి దిగింది. ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమిషన్‌ డబ్బులతో మాస్కుల తయారీ ప్రారంభించి, లక్ష మాస్కుల లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నది. వీటిని అన్ని శాఖలకు, అవసరం అయిన వారికి విక్రయించారు.  మెడికేటెడ్‌ క్లాత్‌తో తయారు చేసిన ఈ మాస్కులు తిరిగి వినియోగించేందుకు సైతం వీలుగా ఉండటంతో వీటికి డిమాండ్‌ ఏర్పడింది. 10వేల పీపీఈలు తయారీ లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. 

డిమాండ్‌కు తగ్గట్లుగా తయారీ..

కరోనా మహమ్మారి విజృంభించడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే అదే కరోనా వారికి ఉపాధి కల్పిస్తున్నది. కరోనాపై పోరుకు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి రావడంతో వాటికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. వీటితోపాటు వైద్యులు, సిబ్బంది ప్రత్యేకమైన పీపీఈలు ధరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్కులు తయారు చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళా సంఘాలకే పీపీఈలను సైతం తయారు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 

మహిళలకు ఉపాధి

మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఒక్కో మాస్కును రూ.15కు విక్రయిస్తున్నారు. పీపీఈ కిట్లకు ఇంకా ధర నిర్ణయించలేదు. అయితే సుమారు రూ. 2వేలకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉన్నది. ఒక్కో మాస్కు కుట్టినందుకు మహిళలకు రూ.5 లభిస్తున్నాయి. ఒక్కో మహిళ దాదాపు రోజుకు సుమారు 100 మాస్కులు కుడుతున్నారు. ఒక్క పీపీఈని కుట్టినందుకు రూ.150 నుంచి రూ. 180 వరకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఆదివారం నుంచి పీపీఈల కుట్టు పని ప్రారంభం అయ్యింది. ఆదివారం 45పీపీఈలు సిద్ధం చేశారు. పీపీఈ యూనిట్‌లో గౌను, ప్యాంటు, కాళ్లకు షూ, రెండు మాస్కులు, టోపీ ఉంటాయి. మహిళా సమాఖ్య కొనుగోలు చేసే 1 కేజీ మెడికేటెడ్‌ క్లాత్‌కు రూ. 300 ఖర్చు అవుతుంది. ఒక పీపీఈ కుట్టేందుకు సుమారు 4 మీటర్ల క్లాత్‌ అవసరం ఉంటుంది. జిల్లాలో 10వేల పీపీఈలు లక్ష్యం కాగా... వీటిని కుట్టడం ద్వారా నేరుగా మహిళలకు రూ.17లక్షలకు పైగా లభిస్తాయి. సుమారు 100 మంది మహిళలు పీపీఈలను కుట్టే పనిలో ఉన్నారు. ఇక లక్ష మాస్కులు కుట్టడం వల్ల దాదాపు 200కు పైగా మహిళలకు రూ.5 లక్షల వరకు లభిస్తాయి. మాస్కులు, పీపీఈలు తయారు చేసేందుకు బాలానగర్‌ మండల కేంద్రంలో ఉన్న ఓ ఫార్మా కంపెనీ వద్ద మెడికేటెడ్‌ క్లాత్‌ను రూ. 300కు కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం బండమీదపల్లి వద్ద ఉన్న జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద దాదాపు 25 కుట్టు మిషన్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తూనే ఉంటాయి. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అక్కడ కుట్టు పని చేసే మహిళలను ప్రత్యేకంగా కార్లు ఏర్పాటు చేసి తీసుకువస్తున్నారు. వారికి మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్‌ సైతం ఉచితంగానే అందిస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల మాస్కులు తయారు చేసి విక్రయించారు. కరోనా నేపథ్యంలో ఖాళీగా ఉన్న సుమారు 200కు పైగా మహిళలకు ఉపాధి లభించడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. 

స్థానికంగానే ఉపాధి

గతనెల 28 నుంచి మాస్కులు తయారు చేస్తున్నాం. ఇప్పటికే లక్ష మాస్కుల టార్గెట్‌ను పూర్తి చేశాం. ఒక్కో మాస్కు రూ.15 చొప్పున విక్రయిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన కమిషన్‌ నుంచి రూ.4 లక్షలు వెచ్చించి మాస్కుల తయారీ చేపట్టాం. ప్రస్తుతం 10వేల పీపీఈల తయారీకి సైతం మాకు అవకాశం లభించింది. బండమీదపల్లి వద్ద ఉన్న జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో సుమారు 100 మంది వరకు వచ్చి పని చేస్తున్నారు. 

- నాగమల్లిక, డీపీఎం, డీఆర్డీఏ మహబూబ్‌నగర్‌

రోజుకు రూ.500 లభిస్తున్నాయి

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ పనులు లేవు. ఈ తరుణంలో మాస్కులు కుట్టే పని వల్ల మాకు ఉపాధి లభిస్తున్నది. ఒక మాస్కుకు రూ. 5 ఇస్తున్నారు. రోజుకు 100 మాస్కులు కుడుతున్నాం. అందుకు మాకు రూ. 500 వరకు లభిస్తున్నాయి. మమ్మల్ని ఇంటి నుంచి కార్లో తీసుకువచ్చి ఇక్కడే భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రికి, కలెక్టర్‌కు, డీఆర్డీఏ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. 

- రమ్య, టైలర్‌, పెద్దదర్పల్లి, హన్వాడ మండలం 

మాస్కులు లభించక తీవ్ర ఇబ్బందులుండేవి..

కరోనా ప్రభావంతో మార్కెట్లో మాస్కులు లభించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. వెంటనే స్వయం సహాయక సంఘాలను రంగంలోకి దింపాం. డీఆర్డీవో వెంకట్‌రెడ్డి, అదనపు పీడీ శారద, డీపీఎం నాగమల్లికను పురమాయించి మాస్కులు, పీపీఈలు తయారు చేసేందుకు ఏర్పాటు చేశాం. ఆదివారం మేం నిర్దేశించుకున్న లక్ష మాస్కుల మార్కును అందుకున్నాం. పబ్లిక్‌ హెల్త్‌ పీవో ఉమా పీపీఈ కిట్ల తయారీ ఎలా ఉండాలో మహిళలకు వివరించారు. మహిళా సంఘాలకు ఎప్పటికీ స్వయం ఉపాధి అందించేలా మాస్కులు, పీపీఈ కిట్ల తయారీ యూనిట్‌ను నడిపించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ తయారు చేసి హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాలకు వీటిని విక్రయించాలని మంత్రి సూచించారు. 

- వెంకట్రావు, కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌ logo