శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Apr 06, 2020 , 01:23:31

ఐక్యతా జ్యోతి

ఐక్యతా జ్యోతి

  • ప్రధాని మోదీ పిలుపు, సీఎం కేసీఆర్‌ సంఘీభావానికి స్పందించిన పాలమూరు
  • ఉమ్మడి జిల్లాలో దివ్వెలు, కొవ్వొత్తులు, టార్చి, సెల్‌ లైట్ల కాంతులు
  • 9 నిమిషాల పాటు ప్రజల సంఘీభావం

ఉమ్మడి జిల్లాలోని ప్రతి గడపా కాంతులీనింది.. కరోనా చీకటిని జయిస్తూ.. కనిపించని భూతాన్ని పారదోలడానికి జాతి సమిష్టి చైతన్యదీప్తులను వెలిగించింది.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవించి ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాలపాటు దివ్వెల కాంతుల్లో ఐక్యత చాటుకున్నారు.. 

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా పోరులో దేశమంతా కులమతాలకతీతంగా ఐక్యంగా ఉందని చాటేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా దీపాలు వెలిగించారు. కష్టకాలంలో ఒకరికి ఒకరం తోడున్నామనే సంఘీభావాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ప్రధాని పిలుపునకు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇళ్లలో లైట్లు ఆపి కుటుంబ సభ్యులతో సహా ఆరుబయటకు వచ్చి దీపాలు వెలిగించారు. ఇంటి మిద్దెల పైనా దీప కాంతులు వెలిగాయి. కొందరు దీపాలు వెలిగించారు. మరికొందరు కొవ్వొత్తులతో తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఇంకొందరు టార్చిలైట్‌, సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురును ఆకాశం వైపు చూపిస్తూ తమ ఐక్యతను చాటారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాల వెలుతురులే కనిపించాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఏప్రిల్‌ 15 వరకు లాక్‌ డౌన్‌ ముగిసే పరిస్థితి రావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.


logo