సోమవారం 25 మే 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:37:18

అలవి కాని దోపిడీ!

అలవి కాని దోపిడీ!

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ/పెంట్లవెల్లి:  మత్స్యసంపదను కొల్లగొడుతున్న వైనంపై ‘అలివిగాని వల’ శీర్షికన నమస్తేతెలంగాణ దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు అనూహ్య స్పందన లభిస్తున్నది. మూడు రోజులుగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ప్రాంతంలోని కృష్ణానదీతీరంలో అధికారులు దాడులు నిర్వహిస్తూ అలివి వలలను స్వాధీనం చేసుకుంటున్నారు. మత్స్యశాఖ ఫీల్డ్‌మెన్‌ అంజయ్య, సిబ్బంది రామదాస్‌, సైదులు, మాతృ తదితరులు సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొల్లాపూర్‌ మండలం సోమశిల, అమరగిరి, కోతిగుండు, ఎర్రగుట్టలు, పాతబొల్లారం, చీమలతిప్ప వరకు కృష్ణానదిపై ప్రత్యేకంగా మరబోటులో గాలింపు చర్యలను చేపట్టారు. అయితే నది మార్గమధ్యంలో కోతిగుండు ప్రదేశంలో గాలింపు బృందాన్ని చూసిన  ఓ ఆంధ్రాజాలరి నాటుపడవలో దాచిన అలివివలను వదిలి పరారైయ్యాడని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రాధారోహిణి తెలిపారు. సదరు వలను స్వాధీనం చేసుకొని కొల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పోలీసులు ఈ సంఘటన పై కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మురళీగౌడ్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో జాలరి మృతి

నాగరకర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామం కృష్ణానది ఒడ్డున ఓ జాలరి అనుమానాస్పద  స్థితిలో మృతిచెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మంచాలకట్ట గ్రామం సమీపంలోని కృష్ణానది తీరం ఒడ్డున శవం కొట్టుకొచ్చిందంటూ మత్య్సకారులు పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతని శరీరంపై చొక్కాలేదు, నలుపు రంగు పాయింట్‌ ధరించి ఉన్నారని పూర్తి ఆధారాలు తెలిసాకే పోస్ట్‌ మార్టం నిర్వహిస్తామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. అయితే కృష్ణానదితీరం గ్రామాలైన మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల్లో నెల రోజుల కిందట ఓ ఆంధ్రాజాలరి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన మరువక ముందే మరో జాలరి మృతిచెందడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఆధారాలు జలసమాధి..?

కృష్ణానది తీర గ్రామాలైన జటప్రోల్‌, మంచాలకట్ట, వెంకల్‌, మల్లేశ్వరం గ్రామాల్లో 40రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆంధ్రా మత్స్యకారులు మృతి చెందడం పట్ల స్థానికుల్లో అనుమానం మొదలైంది. శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌లో కృష్ణాతీరం వెంట ఉన్న ఆంధ్రా దళారుల అలివి వలల దందాకు అమాయక మత్య్సకారులు బలి అవుతున్నారని  స్థానికులు చర్చించుకుంటున్నారు. అమాయక ఆంధ్రా జాలర్లను సారాకు బానిసలను చేసి  శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేసి వారితో అర్ధరాత్రిళ్లు నిషేధిత వలలను వినియోగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతి యేడాది ఐదారుగురు ఆంధ్రా మత్య్సకారులు కృష్ణానదితీరంలో ప్రాణాలు వదులుతున్నట్లు సమాచారం. అయితే వాటిలో మృతులను గుర్తించిన వారికి మాత్రమే మృతదేహాలను  చేరవేస్తారు. లేకుంటే కృష్ణానదీతీంలోనే పూడ్చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాలర్ల కుటుంబాలకు దళారులు అంతో ఇంతో డబ్బును ముట్టచెబుతున్నారు. జనవరి 30న  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గరుడబిల్లి మండలం, బొండపల్లి గ్రామానికి చెందిన పిల్ల అప్పారావు(63) అనుమానాస్పదకంగా కృష్ణానదిలో మృతి చెందారు. కాని అధికారులు, ఆంధ్రాదళారులు కమ్మక్కై వారికుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం అందించి మృతదేహాన్ని అప్పజెప్పకుండా కుళ్లిపోయిందంటూ కొల్లాపూర్‌ ప్రాంతంలోనే ఎవ్వరికి తెలియకుండా పూడ్చిశారు. దీంతో కుటుంబ సభ్యులు రోధించి చేసేది ఏమిలేక ఆంధ్రాదళారులు ఇచ్చిన డబ్బుతో వెనుతిరిగిన పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం తమకేమి పట్టన్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.అమాయక జాలర్లను తీసుకొచ్చి నెలల తరబడి వారితో పని అలివి వలలతో చేపలు పట్టిస్తూ సొమ్ముచేసుకుంటున్న ఆంధ్రా దళారుల ఆటకట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. 


logo