గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:34:38

నీటి వృథాకు ‘చెక్‌'

నీటి వృథాకు ‘చెక్‌'

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం దుందుభీ వాగు పరిరక్షణకు చర్యలు చేపట్టింది. నీటి వనరుల లభ్యతను పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలో పారే నీటితో అతి పెద్ద వాగు అయిన దుందుభీని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట ప్రాంతాల్లో దుందుభి వాగుపై భారీ చెక్‌ డ్యాంలను నిర్మించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం వాగు పరిసర గ్రామాల్లో నీటి వనరులు అధికంగా ఉన్నాయి. ఈ వాగు నుంచి వంగూరు, ఉప్పునుంతలలాంటి పలు చోట్ల ఇసుక రీచ్‌లు ఉండగా అక్రమంగా తవ్వకాలు సైతం జరుగుతున్నాయి. ఎంతో పురాతనమైన ఈ వాగు పరివాహకంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. తిమ్మాజిపేట మండల నేరెళ్లపల్లి నుంచి నల్గొండ డిండి ప్రాజెక్టు వరకు ఈ వాగు పరివాహకం ఉంది. గతంలో వర్షాల సమయంలోనే వాగు ప్రవహించనుండగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గత నాలుగేళ్ల నుంచి వాగులోకి నీటిని మళ్లిస్తున్నారు. నేరెళ్లపల్లి నుంచి మొదలు ఉప్పునుంతల వరకు ఎంజీకేఎల్‌ఐ ద్వారా వచ్చే నీళ్లు చెరువులను నింపి వాగులోకి చేరవేస్తున్నారు. దీనివల్ల గత మూడు,నాలుగేళ్ల నుంచి వాగు ప్రతి సీజన్‌లోనూ నీళ్లతో అలరారుతోంది. భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇలా వాగులోకి నీళ్లను మళ్లిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎంజీకేఎల్‌ఐ నుంచి నీళ్లు భారీగా వస్తుండటంతో రాబోయే కాలంలో వాగులో నీటి నిల్వలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 14చోట్ల భారీ చెక్‌ డ్యాంలను నిర్మించేందుకు పూనుకొంది. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలాంటి ప్రజాప్రతినిధులు సైతం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం సాగునీటి శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి సర్వే చేపట్టి ప్రతిపాదనలు సేకరించింది. ఇలా దాదాపుగా రూ.100కోట్లకుపైగా నిధులతో చెక్‌ డ్యాంల నిర్మాణానికి నివేదికలు పంపించారు.ఇందులో భాగంగా ప్రభుత్వం రూ.58కోట్లతో 9చోట్ల చెక్‌ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం విశేషం. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట నియోజకవర్గాల్లోని దుందుభి పరివాహకంలో ఈ చెక్‌ డ్యాంలు నిర్మాణం కానున్నాయి. కాగా మరో 5చెక్‌ డ్యాంలకు కూడా అదనంగా రూ. 30కోట్ల వరకు నిధులు మంజూరయ్యే అవకాశముందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల దుందుభీ వాగు నీటితో కళకళలాడనుంది. ఎంజీకేఎల్‌ఐతో పాటు వర్షాకాలంలో కురిసే నీళ్లు వాగు గుండా ప్రవహిస్తూ డిండి రిజర్వాయర్‌కు చేరుకొంటున్నాయి. ఎక్కడా నీటి నిల్వకు అడ్డుకట్టలు లేవు. దీనివల్ల నీళ్లు జిల్లా నుంచి వృధాగా వెళ్తున్నాయి. ఈ చెక్‌ డ్యాంలు నిర్మిస్తే నీటి నిల్వలు పెరుగుతాయి. కల్వకుర్తి  మండలం గుండూరు, వేపూర్‌, వంగూరు మండలం జాజాల, ఉల్పర, డిండిచింతపల్లి, తాడూరు మండలం మేడిపూర్‌, ఆకునెల్లికుదురు, పాపగల్‌, సిర్సవాడ ప్రాంతాల్లో చెక్‌ డ్యాంలకు ఈ నిధులు మంజూరు అయ్యాయి. అలాగే తిమ్మాజిపేట మండలేం నేరెళ్లపల్లి, గోవిందాయపల్లి, ఏటిధర్‌పల్లి, పొల్మూర్‌, నడిగడ్డలాంటి చోట్ల కూడా చెక్‌ డ్యాంలకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. ఇలా దాదాపుగా రూ.100కోట్ల వరకు నిధులతో దుందుభీ వాగుపై నిర్మించనున్న భారీ చెక్‌ డ్యాంలు భవిష్యత్‌లో నీటి నిల్వలను పెంచనున్నాయి. ఇప్పటికే ఎంజీకేఎల్‌ఐ వల్ల భూగర్భ జలాలు పెరగడంతో సాగు, తాగునీటి సమస్య దూరమైంది. ఈ వాగుపై చెక్‌ డ్యాంలు కూడా పూర్తైతే జిల్లా నీటి వనరుల లభ్యతలో మరో మెట్టు ఎక్కనుంది. 


logo