శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:12:41

భక్తజన శ్రీగిరి

 భక్తజన శ్రీగిరి

శ్రీశైలం : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి  భక్తులు వేలాదిగా తరలి రావడంతో సోమవారం క్షేత్రంలో సందడి నెలకొంది.  ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కికిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానాలు చేసుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులుదీరారు. అధిక సంఖ్యలో దంపతులు సామూహిక అభిషేకాలతోపాటు వృద్ధ మల్లిఖార్జున  స్వామివారికి బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు.  క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహా ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. శ్రీశైల భ్రమరాంబ,మల్లికార్జున స్వామి అమ్మవార్లకు  సాయంత్రం సహస్త్ర దీపార్చన వైభవంగా జరిగింది. మేళతాళాలతో వైభవంగా సాగిన వెండి రథోత్సవంలో  భక్తులు   పాల్గొనే అవకాశాన్ని కల్పించినట్లు దేవస్ధాన కార్యనిర్వాహణాధికారి కె ఎస్‌ రామారావు తెలిపారు. పాల్గుణ మాస శుద్ధ పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు సేవలు నిర్వహించినట్లు తెలిపారు.భ్రమరాంబ అమ్మవారికి ఊయల సేవ, పల్లకీసేవ ఘనంగా నిర్వహించారు.

గో సంరక్షణ  నిధికి లక్ష విరాళం

 శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధికి హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ వర్మ అనురాధ దంపతులు (ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ హైకోర్టు ఎక్స్‌ జీపి) కుమార్తె సాయిసుదీప్తిలు లక్ష ఎనిమిదివేలు విరాళంగా ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆలయ కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావుకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు.


logo