శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Mar 09, 2020 , 01:06:55

రైతు సంక్షేమానికి పెద్దపీట

రైతు సంక్షేమానికి పెద్దపీట

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధుల కేటాయింపులపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి రంగానికి సైతం ప్రాధాన్యం ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేసేందుకు సర్కారు సిద్ధమైంది. నీటి పారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. సంక్షేమ రంగానికి సైతం పెద్ద పీట వేశారు. ఇటీవలే ఎన్నికలు ముగిసిన మున్సిపాలిటీలకు సైతం భారీగా నిధులు కేటాయించారు. ఆర్టీసీని ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్లుగానే ఎవరూ ఊహించని విధంగా నిధులు కేటాయించడం విశేషం. గృహ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తంగా అన్ని రంగాలపై కేసీఆర్‌ సర్కారు తనదైన ముద్ర వేస్తూ బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. రైతు సంక్షేమం, పింఛన్లకు కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన మేర నిధులు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రైతు రుణ మాఫీకి కేటాయింపులు

ఆచరణ సాధ్యమైన వాటినే ఎన్నికల్లో హామీలుగా ఇస్తామని.. హామీ ఇచ్చామంటే చేస్తామని గతం నుంచే సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి హామీల్లో రైతు రుణ మాఫీ ఒకటి. రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు గత ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు కేటాయించారు. రుణమాఫీ కోసం రూ. 6వేల కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్‌లో ప్రస్తుతం రూ. 25వేల లోపు రుణమాఫీ చేయాల్సిన రైతులకు నేరుగా చెక్కులు అందిస్తూ వారిని రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్‌లో రూ. 6225కోట్లను ప్రతిపాదించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5లక్షలకు పైగా రైతులకు సంబంధించి రూ. 25వేల లోపు రుణాలు చెల్లించాల్సిన వారి జాబితాను అధికారులు తయారు చేసి త్వరలోనే వారికి చెల్లించనున్నారు. గతంలోనే రూ. లక్ష లోపు రుణ మాఫీకి నాలుగు విడతలుగా రుణ మాఫీ చేయనున్నారు. సీఎం హామీ ఇచ్చిన మేరకు రైతు రుణ మాఫీకి సంబంధించి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడంపై ఉమ్మడి పాలమూరు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు, విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు, పాడి రైతు ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు కేటాయించడంపైనా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. విద్యుత్‌శాఖకు రూ.10416 కోట్లు కేటాయించడం వల్ల రైతులకు ఉచితంగా ఇస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ పక్కాగా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడిందని భావిస్తున్నారు. 

పాలమూరు ప్రగతి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టనున్నది. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇదే అంశాన్ని ప్రస్తావించడం శుభసూచకంగా చెప్పవచ్చు. దక్షిణ తెలంగాణ కరువు కాటకాలను దూరం చేసే ప్రాజెక్టుగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరింత వేగవంతం చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. గత బడ్జెట్‌లో పాలమూరు ఎత్తిపోతలకు రూ. 531.13 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్‌లో రూ. 386.98 కోట్లు కేటాయించింది. అయితే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ. 10వేల కోట్లు కేటాయించి ఆ నిధులతో హైడ్రో ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏదుల రిజర్వాయర్‌ పనులు దాదాపు పూర్తవ్వడం, నార్లాపూర్‌, కరివెన, వట్టెం పనులు సైతం 60 నుంచి 75 శాతం వరకు చేరుకునడంతో ప్రధానంగా హైడ్రో ఎలక్ట్రికల్‌ పనుల పైనే దృష్టి సారించనున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్‌, భీమా, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు రూ. 81.37కోట్లు కేటాయించారు. భీమాకు రూ. 18.99కోట్లు, నెట్టెంపాడుకు రూ. 17.37కోట్లు, సంగంబండకు రూ. 18.07కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ. 17.65కోట్లు కేటాయించిన జాబితాలో ఉన్నాయి. 

పెంచిన మేరకు ‘రైతుబంధు’

ఏడాదికి రెండుసార్లు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు పథకాన్ని సర్కారు అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 8లక్షల మందికి రైతు బంధు పథకం వర్తిస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 14వేల కోట్లు ఇందుకు కేటాయించారు. రైతుబీమా పథకానికి సైతం ఈ బడ్జెట్‌లో రూ. 1141కోట్లు కేటాయించారు. ఎల్‌ఐసీ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకం వల్ల రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. 

వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు

 ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సైతం భారీగా నిధులు కేటాయించడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. పాడి రైతు ప్రోత్సాహం కోసం రూ. 100కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1586.38 కోట్లు కేటాయించింది.  వ్యవసాయంపై ఆధారపడే రైతన్న అనుకోని కారణాలతో పంటలు రాక ఇబ్బంది పడే సందర్భాల్లో అనుబంధ రంగాలు ఆదుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ కేటాయింపులపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టీసీ ఉద్యోగులకు అండగా..

ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ బడ్జెట్‌ వెన్నుదన్నుగా నిలుస్తోందని చెప్పాలి. రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌ కేటాయించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీరుతాయని భావిస్తున్నారు. దశలవారీగా ఆర్టీసీకి పునర్‌వైభవం తీసుకువస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ అన్నట్లుగానే భారీగా నిధులు కేటాయించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5వేల ఎకరాల పరిధిలో.. 

రైతులు పరస్పరం చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5వేల ఎకరాలకు ఓ రైతు వేదిక నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 12లక్షలు కేటాయించింది. బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించడం విశేషం. రైతు వేదికల ద్వారా రైతుల మధ్య సమన్వయంతో పంటల మార్పిడి విధానం, మార్కెటింగ్‌ వంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడుతుంది. రైతులను అధికారులు కలిసేందుకు సైతం మంచి వేదిక లభిస్తుంది. రైతు వేదికలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంక్షేమమే ఎజెండా...

ఆసరా పింఛన్లకు రూ. 11,758కోట్లు, వెనుకబడిన తరగతుల కోసం రూ. 4356.82కోట్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 1200కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ. 1518కోట్లు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీల ప్రగతి నిధికి రూ. 16534.97కోట్లు, ఎస్టీల ప్రగతి నిధికి రూ. 9771.27 కోట్లు కేటాయించడం విశేషం. వైద్య, ఆరోగ్య రంగానికి సైతం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగినంతగా కేటాయించారు. గృహ నిర్మాణాలకు రూ. 11917కోట్లు కేటాయించారు. 

పురపాలికలకు వెన్నుదన్నుగా..

ఇటీవలే రాష్ట్రంలో కొత్త పురపాలక పాలకవర్గాలు పదవిలోకి వచ్చాయి. ఇటీవలే 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగింది. పట్టణాలను సమూలంగా మారుస్తూ అభివృద్ధి పథాన తీసుకుపోయేందుకు ఉద్ధేశించిన కొత్త పురపాలక చట్టంతో అద్భుతాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మున్సిపాలిటీలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మున్సిపాలిటీలకు రూ. 14,809కోట్లు కేటాయించడంపై పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo