శనివారం 30 మే 2020
Nagarkurnool - Mar 08, 2020 , 01:33:06

మహిళా మణులు

మహిళా మణులు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన యాదేశ్వరి మండలంలోని యూపీఎస్‌ బొక్కలోనిపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 1987లో ఆమె టీటీసీ చదువుతున్న రోజుల్లో ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి చూపు దెబ్బతిన్నది. వారం రోజుల పాటు చీకట్లో బతికింది. అప్పుడు అంధులు పడే కష్టమేంటో అర్థమైంది. చికిత్స అనంతరం చూపు తిరిగి వచ్చింది. అయితే ఈ ప్రమాదం ఆమెలో అనేక ఆలోచనలను రేకెత్తించింది. వారం రోజులు చూపు పోతేనే ఇన్ని కష్టాలు పడితే.. జీవితాంతం చూపు లేని వారి పరిస్థితి ఏంటని ఆలోచించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేసింది. తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినా ఆలోచన మాత్రం అంధులపైనే ఉండిపోయింది. ఉద్యోగం చేస్తూనే 1995లో టీసీవీహెచ్‌ (ట్రెయినీ సర్టిఫికెట్‌ ఫర్‌ విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌) డిప్లమో కోర్సు చేసింది. తర్వాత సచ్చిదానంద స్వామి అందించిన స్ఫూర్తితో బ్రెయిలీ లిపిలో పుస్తకాలు రాసేందుకు సొంతంగా బ్రెయిలీ ప్రింటింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేసింది. పుస్తకాలు ప్రచురించేందుకు అవసరమైన ప్రత్యేక బ్రెయిలీ పేపర్‌ తీసుకువచ్చి పుస్తకాలు అచ్చువేసింది. 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని పుస్తకాలు ప్రింట్‌ వేసి అంధ విద్యార్థులకు ఉచితంగా అందించింది. ఇప్పటివరకు వివిధ భాషల్లో 600 వరకు బ్రెయిలీ పుస్తకాలు రచించింది యాదేశ్వరి. భారతం, రామాయణ, భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌, తెలంగాణ పోరాట వీరుల చరిత్ర, వొడవని ముచ్చట, లూయీ బ్రెయిలీ జీవిత చరిత్రతో పాటు అనేక పుస్తకాలు ఆమె రచించింది. గతంలో బ్రెయిలీలో పంచాంగం ఎవరూ రాయలేదు. ఆ కొరత కూడా తీర్చింది యాదేశ్వరి. సిలబస్‌ మారిన వెంటనే పదో తరగతి విద్యార్థుల కోసం మారిన సిలబస్‌ ప్రకారం మళ్లీ బ్రెయిలీలిపిలో వారికి పుస్తకాలు అందుబాటులో ఉంచింది. స్కూల్‌కు వెళ్లి పాఠాలు బోధించి ఇంటికి వస్తే అలిసిపోయే పరిస్థితి ఉన్నా ఆమె మాత్రం అంధుల కోసం పుస్తకాలు రాసేందుకు కృషి చేస్తోంది. సీఎం కేసీఆర్‌ చేసిన చండీయాగం విశేషాలను సైతం బ్రెయిలీ లిపి రూపంలోకి తీసుకువచ్చింది. భవిష్యత్‌లో ఇతిహాసాలు, వేదాలను సైతం అంధ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 


మరిన్ని బ్రెయిలీ లిపి పుస్తకాలు రాస్తాను

మహిళలకు సాధికారత, సమానత్వం, స్వేచ్ఛకావాలి. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రిజర్వేషన్లు ఉంటున్నాయి కానీ నడిపిస్తున్నది మాత్రం వారి బంధువులే. సాటి మనిషిని మనిషిగా చూడటం అవసరం. మహిళలు సైతం ఓ అందమైన ప్రపంచం కోరుకుంటారు. దాన్ని ఇచ్చే బాధ్యత అందరిదీ. సమానత్వంపై ఉపన్యాసాలు కాదు ఆచరణ ముఖ్యం. ఇక నేను అందించే బ్రెయిలీ లిపి పుస్తకాల సేవకు ప్రభుత్వం సహకారం కావాలి. అంధ విద్యార్థుల కోసం మరిన్ని పుస్తకాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తా. బ్రెయిలీ లిపి ప్రింటర్‌ తరచూ రిపేరు అవుతోంది. ప్రభుత్వం సహకరిస్తే మరింత మెరుగైన సేవ అందిస్తాను. 

- యాదేశ్వరి, బ్రెయిలీ లిపి రచయిత్రి, మహబూబ్‌నగర్‌ 


సామాజిక సేవ.. ఆమె తోవ

 పదేండ్ల ప్రాయంలోనే జోగినీ వ్యవస్థను వ్యతిరేకించిన హాజమ్మ.. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అయిష్టంగానే జోగినీగా మారాల్సి వచ్చింది. అయితే ఆమె సంఘర్షణ మాత్రం ఆగిపోలేదు. ఒక వైపు బాధలను, అవమానాలను అనుభవిస్తూనే పోరాటానికి మార్గాలను అన్వేషించింది. చివరికి ఆ పోరాటం ఆమె పెండ్లితోనే ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రానికి చెందిన తాయప్ప, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. హాజమ్మ అక్క వికలాంగురాలు కావడంతో ఆరో తరగతిలో చదువు మానిపించి జోగినీగా మార్చారు. ఆ తర్వాత గ్రామమంతా అరిష్టం అంటున్నా అది మూఢనమ్మకమే అంటూ ఆమె కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. అక్కడి నుండి జోగినీ వ్యవస్థ నిర్మూలనకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది జోగినీలకు పెళ్లిళ్లు జరిపించిన హాజమ్మ దర్భన్‌, జెనీవా నెదర్లాండ్‌లో జరిగిన అనేక మహిళా సదస్సులకు భారత ప్రతినిధిగా హాజరై అంతర్జాతీయ వేదికలపై జోగినీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన గళం వినిపించింది. ఈ సామాజిక దురాచారానికి తనలా మరొకరు బలి కాకూడదనే సమోన్నత లక్ష్యంతో నేటికీ మొక్కువోని ధైర్యంతో పోరాడుతోంది. యువతులను జోగినీలుగా మార్చినా, బాల్య వివాహాలు జరిపినా, ఆడ పిల్లలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అండగా నిలుస్తోంది. చదువుకునే జోగినీ పిల్లలకు పాఠశాలల్లో తండ్రుల పేర్లకు బదులుగా తల్లి పేరును చేర్చేందుకు ఆమె చేసిన పోరాట కృషి ఫలితమే. ఈ ఘనత ఆమెకే దక్కింది.


జోగినీ వ్యవస్థ నిర్మూలించాలి

సమాజంలో జోగినీ వ్యవస్థ సమూలంగా నిర్మూలించాలన్నదే లక్ష్యం. ప్రతి జోగినీ కుటుంబానికి ప్రభుత్వం మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలి. జోగినీల పిల్లలకు ఉచిత కార్పొరేట్‌ విద్య అందించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

- హాజమ్మ, మహిళా సామాజిక కార్యకర్త 


వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి హరికథ భాగవతారిణి

ఆమె వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి హరికథలు చెప్పడం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ హరికథలకు గుర్తింపు తెచ్చిన ఘనత పద్మాలయ ఆచార్యది. ఆమె నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో తెలుగు ఉపాధ్యాయురాలిగా వృత్తిని కొనసాగిస్తూ కవయిత్రి, గాయని, నాట్య కళాకారిణిగా ఎన్నో ప్రశంసలు పొందుతున్నారు. మొదటి నుంచి హరికథ చెప్పడం ఇష్టపడిన పద్మాలయ ఆచార్య కాలక్రమేణా కవయిత్రి, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రవృత్తిపై దృష్టి సారించి గాయిని, నాట్య కళాకారిణిగా రాణిస్తున్నారు. హరికథలో ఆమెకు పెట్టిందే పేరుగా ముద్ర వేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఉగాది పురస్కారాన్ని అందించి సత్కరించింది. సీఎం కేసీఆర్‌, అప్పటి స్పీకర్‌ చక్రపాణితోపాటు పలువురు ప్రముఖులు ఆమెను సన్మానించారు. ఇప్పటివరకు 32 పురస్కారాలు అందుకున్నారు. నవ్వుల నావ, ఉరుకుంద వీరన్న చరిత్ర, పాలమూరు జిల్లా హరికథలు, ఉప్పరిపల్లి అమ్మవార్ల దివ్యచరిత్ర, సోమశిల కీర్తనలు, పసిడి మొగ్గలు, హరికథ-ఆవిర్భావం, వివేకానంద, రాధికారాధనం సమీక్ష, బాబోయ్‌ ఫోన్‌ హాస్యకథ వంటి నాటికలు, బాలగేయాలు, యానగుంది మాణికేశ్వరిమాత దివ్యచరిత్ర, పరమానందయ్య శిష్యుల కథలు రాసి ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించారు. ఇంకా మైసమ్మ లీలలు, బడితనిఖీ, స్వచ్ఛభారత్‌, హెల్మెట్‌, ఇంటర్వ్యూ, డబ్బు వంటి టెలీఫిలీమ్స్‌ సీడీలు విడుదల చేయడం జరిగింది. వీటి ద్వారా పద్మాలయ ఆచార్య మరిం త గుర్తింపు పొందారని చెప్పవచ్చు. వీటితోపాటు రచించి.. గానం చేసిన సీడీలు 12, ఏడు ప్రత్యేక కార్యక్రమాలను ఛానళ్ల ద్వారా ప్రదర్శించడం జరిగింది. గతేడాది ప్రపంచ తెలుగు మహిళా సదస్సులో మహిళా శిరోమణి పురస్కారం అందుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 6వేలకుపైగా కళా ప్రదర్శనలు చేసి హరికథకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత పద్మాలయ ఆచార్యకే దక్కింది.


logo