బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 08, 2020 , 01:30:37

అప్రమత్తం

అప్రమత్తం

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: వేసవి వచ్చిందంటే నల్లమల అటవీప్రాంతం తరుచుగా కార్చిచ్చుకు గురవుతుంది. దీంతో అడవిలోని చెట్లు, గడ్డి కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. నలమల అడవిలో వివిధ కారణాల మూలంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించడంతో పా టు అనుకోని సందర్భాలలో జరిగిన కార్చిచ్చులను నివారించడం, మంటలు అదుపులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో తరుచుగా జరిగిన కార్చిచ్చుకు కొంత నష్టం వాటిల్లినా గత ఏడాదిలో ఫిబ్రవరి, మార్చినెలలో జరిగిన అగ్ని ప్రమాదాలకు పోల్చుకుంటే ఈసారి తగ్గింది. గత ఏడాదిలో 373 ప్రమాదాలు సంభవిస్తే ఈ ఏడాది ఈరోజు నాటికి 48అగ్ని ప్రమాదాలు మాత్రమే జరిగాయి. యాత్రికులు, ప్రయాణికులు అడవిలో వంటలు చేసుకొని నిప్పు ఆర్పకుండా వెళ్లిపోవడం, బీడీలు, సిగరేట్లు తాగి అడవిలో పడేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అడవిలో ప్రాంతం ఎక్కడా పొగతాగకూడదని, వంటలు చేసుకోరాదని నిషేధం విధించారు. ఒక్కోసారి వేసవిలో రాలిపడిన చెట్ల ఆకులు రాళ్లు, బండల నుంచి వేసవి తీవ్రతకు కూడా మంటలు వ్యాపిస్తాయి. కార్చిచ్చు కారణంగా నల్లమల అడవికి తీవ్ర నష్టం జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరుగకుండా నివారించడంతో పాటు ప్రమాదాలు సంభవించిన వెంటనే అక్కడే మంటల ఆర్పివేసేందుకు తీసుకునే చర్యలు, జాగ్రత్తలపై అటవీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి అప్రమత్తం చేసి కావాల్సిన పరికరాలు అందజేసింది. అట్టి పరికరాలు అచ్చంపేట డివిజన్‌ కార్యాలయం నందు శనివారం జిల్లా అటవీశాఖ అధికారి జోజి సంబంధిత అధికారులు,సిబ్బందికి అందజేశారు. 

అగ్ని ప్రమాదాల నివారణకు పరికరాలు

నల్లమల అటవీ ప్రాంతంలో తరుచుగా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం రూ.3.50 లక్షల విలువ గల వివిధ రకాల పరికరాలు అందజేసింది. బూట్లు, చేతులకు ఉపయోగించే గ్లౌజులు, హెల్మెట్లు, ఫైర్‌ రాకర్స్‌, ఫైర్‌ బీటర్స్‌, ఫైర్‌ కట్టర్స్‌, బ్లోయర్స్‌, టార్చ్‌లైట్స్‌ అందజేశారు. సిబ్బందికి బ్యాగులు, వాటర్‌ బాటిల్స్‌, కత్తులు, కొలతల టేపు తదితర వాటిని అందజేశారు. వేసవిలో రోడ్లపైన, బండరాళ్లపై రాలిపడిన ఆకులను బ్లోయర్‌ ద్వారా శుభ్రం చేస్తారు. అగ్ని ప్రమాదం జరుగుతున్న స్థలంలో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ రాకర్స్‌ ఉపయోగిస్తారు. చెట్ల ఆకుపైన మంటలు వ్యాపించి ఉంటే అట్టి చెట్ల కొమ్మలు, ఆకులు తొలగించేందుకు ఫైర్‌ కట్టర్‌ను వాడతారు. చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, తలపై హెల్మెట్‌ ధరించడం వల్ల కొంత మేరకు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మంటలు వ్యాప్తి చెందిన స్థలానికి కొంత లోపలికి వెళ్లి మంటలు ఆర్పేందుకు ఉపయోగపడతాయి. 

5ప్రత్యేకంగా బృందాలు 

వేసవిలో అగ్ని ప్రమాదాల నుంచి అడవిని కాపాడుకునేందుకు అయిదు క్విక్‌ రెస్పాన్స్‌ టీం (బృందాలు) ఏర్పాటు చేశారు.  ఒక్కో బృందంలో అయిదుగురు అధికారులు, సిబ్బంది ఉంటారు. వారికి ఒక వాహనం ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌, మే వరకు మాత్రమే ఈ టీం సభ్యులు పనిచేయాల్సి ఉన్నది. మన్ననూర్‌లో 4 బృందాలు, అచ్చంపేటలో ఒక బృందం అప్రమత్తంగా ఉంటుంది. అధికారులు ముందుగానే ఫైర్‌లైన్లు ఏర్పాటు చేశారు.  

24గంటల్లో సమాచారం..

నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడ ఫైర్‌ జరిగిన వెంటనే హైదరాబాద్‌లోని ప్రధానకార్యాలయానికి శాటిలైట్‌ ద్వారా రెడ్‌ సిగ్నిల్‌ చూపిస్తుంది. ఎక్కడ ఫైర్‌ జరుగుతున్నదో వెంటనే ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ నుంచి జీపీఎస్‌ ద్వారా అచ్చంపేట కార్యాలయానికి లొకేషన్‌ వచ్చేస్తుంది. క్విక్‌  రెస్పాన్స్‌ బృందాలు లోకేషన్‌ ఆధారంగా అక్కడికి వెళ్లి మంటలు అదుపులోకి తెస్తారు. పూర్తి వివరాలు 24గంటల్లో హైదరాబాద్‌ కార్యాలయానికి నివేదిక పంపించాల్సి ఉంటుంది. 


logo