గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:34:42

ఆంధ్రా దళారులు పరార్‌

ఆంధ్రా దళారులు పరార్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కొల్లాపూర్‌ నమస్తే తెలంగాణ/పెంట్లవెల్లి: అలివి గాని వల పేరిట ఈ నెల 5న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి దాడులు చేయడంతో చేపల మాఫియాకు దిక్కుతోచడం లేదు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం వరకు కృష్ణానది బ్యాక్‌ వాటర్‌లో కొనసాగుతున్న అక్రమ దందాకు బ్రేకులు పడుతున్నాయి. అధికారుల దాడులపై స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు దాడులు చేసేందుకు వస్తున్నారనే సమాచారం ముందే అక్రమార్కులకు చేరుతుండటంతో వారు అలివి వలలతో పరార్‌ అవుతున్నారు. మత్స్యశాఖలోని కొందరు చేపల మాఫియాకు సహకరిస్తుండటంతో ఇన్నాళ్లు వారి దందా కొనసాగింది. ఇప్పుడు దాడుల సమయంలోనూ కొందరి సహకారంతోనే ముందస్తుగా తప్పించుకుంటున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అలివి వలలపై వనపర్తి జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం చిన్నంబావి మండల కేంద్రంలో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసింది. నేడు కొల్లాపూర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా సీఎంవో స్థాయి నుంచి ఆదేశాలు రావడంతోనే అధికారులు పరుగులు పెడుతున్నారని తెలుస్తోంది. 

అలివి వలలతో పరార్‌

అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారంతో చేపల మాఫియా జాగ్రత్త పడుతోంది. లక్షల విలువైన అలివి వలలు అధికారులకు దొరికితే కష్టమని భావించిన అక్రమార్కులు జాగ్రత్తగా ఏరు దాటుతున్నారు. పుట్టీల్లో నది ఆవల ఒడ్డున రాయలసీమ వైపు పరారవుతున్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా అధికారులు నదీతీరాన అలివి వలలను స్వాధీనం చేసుకునేందుకు దాడులు నిర్వహించారు. కానీ ఒక్క అలివి వల లభించలేదు. అప్పటికే చేపల మాఫియా సమాచారం ఇవ్వడంతో తట్టా బుట్టా సర్దుకుని నది ఆవల ఒడ్డుకు పారిపోయారు. చాలాకాలంగా మత్స్య శాఖలో క్షేత్ర సిబ్బంది పాతుకుపోయి చేపల మాఫియాతో జతకడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంటి దొంగలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు మత్స్యకారులు సూచిస్తున్నారు. 

నేడు కొల్లాపూర్‌లో సమావేశం

అలివి వలల నిషేధానికి నడుం బిగించిన ప్రభుత్వ యంత్రాంగం శుక్రవారం వనపర్తి ఆర్డీవో చంద్రారెడ్డి, డీఎస్పీ కిరణ్‌కుమార్‌, మత్స్యశాఖ ఏడీ రహమాన్‌ మత్స్యకారులతో సమావేశం అయ్యారు. మత్స్యకారులకు అలివి వలల నిషేధంపై వివరించారు. అలివి వలలు ఎవరైనా వినియోగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. మరోవైపు మత్స్యకారులెవరైనా అలివి వలలతో వేటకెళ్తే వారి లైసెన్స్‌ రద్దు చేస్తామని తెలియజేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తరఫున కొల్లాపూర్‌లో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలోనూ ఇదే అంశంపై స్థానిక మత్స్యకారులకు అవగాహన కల్పించనున్నారు. 

ఉన్నతాధికారుల సీరియస్‌

మత్స్యశాఖ కమిషనర్‌ నుంచి ఇతర అధికారులు రాజధాని నుంచి అలివి వలల అంశంపై నిత్యం సమీక్షిస్తున్నారు. అలివి వలల మాఫియాను తరిమికొట్టాలని హెచ్చరిస్తున్నారు. సిబ్బంది ప్రమేయం ఉందని తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు దొరికిన అలివి వలలను అక్కడికక్కడే నాశనం చేస్తే సమస్యే ఉండదని మత్స్యకారులు కోరుతున్నారు. రూ. లక్షల విలువ చేసే అలివి వలలను అక్కడే కాల్చి నాశనం చేస్తే దళారులు, మాఫియా భయపడి ఈ వ్యాపారాన్ని పూర్తిగా వదిలివేసేందుకు అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు సూచిస్తున్నారు. 


logo