సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:31:43

మార్చి 31వరకే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌

మార్చి 31వరకే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ / వనపర్తి క్రీడలు : బీఎస్‌-4 ఇంజన్‌ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. వాహనాల వల్ల వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు మోటారు వాహనాల కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం బీఎస్‌-6 వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు బీఎస్‌-3, బీఎస్‌-4లాంటి బైక్‌, ఆటో లేదా కార్లు ఉంటే ఈనెలాఖరుతో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఆర్టీఏ అధికారుల అంచనా మేరకు ఇలాంటి పాత వాహనాలు 5వేల వరకు ఉన్నాయి. ఈ వాహనదారులకు ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే వాహనాల డీలర్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. ఇక ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా వాహనాల రిజిస్ట్రేషన్లపై సూచిస్తున్నారు. బీఎస్‌-6(భారత్‌ స్టేజ్‌) ఇంజన్‌ వాహనాల వల్ల 68శాతం కాలుష్యం తగ్గుతుంది. బీఎస్‌-4వాహనాలతో పోలిస్తే ఇది చాలా మేలైంది. ఇలా వాహనాలు కొన్న ప్రజలతో పాటుగా డీలర్లకు సైతం ఆర్టీఏ అధికారులు కొత్తగా బీఎస్‌-4 వాహనాలు అమ్మరాదని ఆదేశించడం జరిగింది. ఇలాంటి పాత బీఎస్‌-4 ఇంజన్‌ వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఉన్నా ఏప్రిల్‌ 1నుంచి శాశ్వతంగా కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. బీఎస్‌-4 ఇంజన్‌ వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌లాంటి విషవాయువులను అధికంగా వెలువరిస్తాయి. మన దేశంలో 25శాతం వాహనాల వల్ల కాలుష్యం వెలువడుతుంది. 


నేరుగా బీఎస్‌-6 వాహనాలు

బీఎస్‌ ప్రక్రియ 2003నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి బీఎస్‌-2,3,4దశల్లో ఉన్నాయి. అయితే కాలుష్యం పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వం బీఎస్‌-5 కాకుండా నేరుగా అదే బీఎస్‌-6ఇంజన్‌ ప్రమాణాలకు చేరేలా ఏడాదిన్నర క్రితమే వాహనాల కంపెనీలకు, పెట్రోలియం కంపెనీలకు సూచించింది. బీఎస్‌-4, బీఎస్‌-6 వాహనాలకు వాడే పెట్రోల్‌, డీజిల్‌లో తేడా ఉంటుంది. అందువల్ల పెట్రోలియం కంపెనీలు కూడా బీఎస్‌-6ప్రమాణాలు కలిగిన పెట్రోల్‌, డీజిల్‌ను మాత్రమే విక్రయిస్తాయి. దీంతో ప్రస్తుతం బీఎస్‌-4 వాహనాలకు ఆయా కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇస్తూ అమ్మకాలు చేపడుతున్నాయి. తక్కువ కాలం వ్యవధి ఉండటంతో సాధ్యమైనన్ని ఎక్కువ వాహనాలను విక్రయాలు చేసేలా ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే బీఎస్‌-6 వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బీఎస్‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్లు ఈనెలాఖరుకు చేయించుకోకుంటే ఏప్రిల్‌ 1నుంచి ఆ వాహనాలపై దాదాపు నిషేధం విధించినట్లే అవుతుంది. అలా రిజిస్టర్‌ కాని బీఎస్‌-4 వాహనాలను అధికారులు సీజ్‌ చేయడం జరుగుతుంది. ఇందులో అధికంగా 80శాతంకుపైగా ద్విచక్ర వాహనాలే ఉన్నట్లుగా అధికారుల అంచనా. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉండటంతో అధికారులు ఆర్టీఏ ఏజెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద కాలుష్యాన్ని తగ్గించే బీఎస్‌-6 ఇంజన్‌ వాహనాలకు మాత్రమే ఏప్రిల్‌-1నుంచి రిజిస్ట్రేషన్లు కానున్నాయి. 


logo