శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:26:06

ప్రగతి బాటలో..

ప్రగతి బాటలో..

అచ్చంపేట రూరల్‌: పచ్చదనం-పారిశుధ్యమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పల్లె ప్రగతి విజయవంతం ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని అద్భుతమైన సంకేతాలు ఇవ్వడంతో గత నెల 24నుంచి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట మున్సిపాలిటీలోని 20వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు పరుగులు పెడుతున్నాయి. చెత్త కుప్పలు, ముళ్ల పొదల తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, కాలనీలల్లో గుంతలను పూడ్చడం మొదలైన పనులు ముమ్మరంగా సాగాయి. పట్టణంలోని ఇరిగేషన్‌ కార్యాలయం ఆవరణలో కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. శ్మశానవాటికలకు గోడలను నిర్మించేందుకు, చెత్తను నిల్వ చేసేందుకు డంపింగ్‌ యార్డు, సమీపంలో కంపోస్టు యార్డు నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న పాత గోడలు, ఇండ్లు కూల్చేయడం, వంగిన విద్యుత్‌ స్థంభాలు, కిందకు వేలాడుతున్న వైర్లను సరిచేస్తున్నారు. 15 మంది చొప్పున 4 కమిటీల ద్వారా 60 మందితో పనులను గుర్తిస్తూ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో దూరదృష్టితో ముందుకెళ్తున్న రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పథకాలను అమలు చేస్తు దేశానికి ఆదర్శమవుతున్నారు.


logo