శనివారం 30 మే 2020
Nagarkurnool - Mar 06, 2020 , 00:04:30

కరోనాపై పోరు

కరోనాపై పోరు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం సమరం శంఖం పూరించింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు కరోనా అనుమానితులతో పాటుగా మరి కొందరికి చికిత్సలు నిర్వహిస్తున్నారు. చైనాలో ప్రవేశించిన ఈ వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సీఎం కేసీఆర్‌ కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ వైద్యశాఖ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలతో పాటు వైద్య సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. జిల్లా కేంద్రంలోని దవాఖాలో ఐసోలెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పది బెడ్లను కేటాయించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో ఈ కేంద్రం నడవనున్నది. జిల్లా వైద్యశాఖ కరోనాపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసింది. వైద్యశాఖ ద్వారా కరోనాపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. 


ప్రతి పీహెచ్‌సీలోనూ కరోనాపై రూపొందించిన ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేశారు. గ్రామాలోని కూడళ్లలో త్వరలో ప్రచార ప్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఆశ కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే విధానం, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూత్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలోనూ ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతున్నారు. వివిధ కళాశాలలో విద్యార్థులకు కరోనా గురించి తెలియజేస్తున్నారు. కలెక్టర్‌ శ్రీధర్‌ సైతం వైద్యశాఖకు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనాపై ప్రభుత్వం ప్ర త్యేకంగా దృష్టి సారించింది. దీంతో కరోనాపై సోషల్‌ మీడియాలో వదంతులను వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు పుకార్లను నమ్మొద్దని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాస్క్‌లు ధరించవచ్చని తెలిపింది. విద్యార్థులు వాటర్‌ బాటిల్స్‌ తీసుకెళ్లేందుకు అనుమతించనున్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడే విద్యార్థులకు వేరే గదిలో పరీక్షలు నిర్వహించాలని, ఒకవేళ ఇన్విజిలేటర్‌ ఇదే బాధతో ఉంటే మరొకరిని నియమించాలని ఆదేశించింది. 


కరోనాపై జాగ్రత్తలు

కరోనా వస్తే ప్రధానంగా జలుబు, తుమ్ము, దగ్గు లాం టి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు తీవ్రంగా ఉం టే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కరోనా సాధారణ లక్షణాలు. గొంతునొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20శాతం కేసులలో కన్పిస్తాయి. కరోనా లక్షణాలు రెండు నుంచి 14 రోజుల్లో కన్పిస్తాయి. శ్వాసకోశ ద్వారా విద్యార్థులకు సోకుతుంది. దగ్గు లేదా తుమ్ము నుంచి వచ్చే బిందువుల దగ్గర, దగ్గరి పరిచయాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి పరోక్షంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తుండడంతో ప్రజలు తమ స్నేహితులను పలుకరించేందుకు షేక్‌ హ్యాండ్‌లు ఇవ్వరాదు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కూడా స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు టవల్‌ను అడ్డు పెట్టుకోవాలి. కరోనా వైరస్‌ పరిశుభ్రత వల్ల దూరంగా ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చిగా ఉన్న, సగం ఉడికిన మాంసం తినకుం డా ఉండాలి. వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన ప్రజలను కలవకుండా ఉండడం చాలా వరకు మంచిది. సబ్బు నీటితో చేతులను తరచుగా కడుక్కోవాలి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. logo