బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 06, 2020 , 00:03:18

అధ్యక్ష

అధ్యక్ష

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై ఉమ్మడి పాలమూరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లోనూ పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించే సర్కారు ఈసారి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రధాన ఆదెరువుగా మారిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తారని రైతులు, అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు గుండెకాయగా భావిస్తున్న జూరాల పునరుజ్జీవ ప్రాజెక్టుకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. రన్నింగ్‌ (ఆన్‌గోయింగ్‌) ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ఎత్తిపోతల తదితర పథకాలకు తగినన్ని నిధులు ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఈసారి భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులకు అవసరమైన మేర అధికారులు తమ అంచనాలను ప్రతిపాదనల రూపంలో సర్కారుకు సమర్పించారు. అయితే పాలమూరు-రంగారెడ్డికి ప్రభుత్వం ఊహించని విధంగా కేటాయింపులు చేస్తుందని భావిస్తున్నారు.


నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ప్రతి బడ్జెట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో అనే అంశంపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయనే ఆశ పాలమూరు ప్రజల్లో కలుగుతున్నది. అన్ని ఎన్నికలు ముగిసిన తరుణంలో పాలమూరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చూపిస్తుందని భావిస్తున్నారు. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులైన కేఎల్‌ఐ, నెట్టంపాడు, భీమా, ఆర్డీఎస్‌, తదితర ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో రూ. 12వందల కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు యారు చేసి పంపించారు. ఈ మేరకు సర్కారు బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల్లో చిన్నా చితకా పనులు మినహా మిగతా పనులు పూర్తయ్యాయి. కాల్వల లైనింగ్‌, డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్‌ ఛానెళ్ల నిర్మాణం తదితర పనులు త్వరగా పూర్తిచేస్తే చివరి ఆయకట్టు వరకు సులభంగా సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు చాలా ప్రాజెక్టుల కింద వాగులు, వంకల ద్వారా వెళ్లే నీటిని మళ్లించేందుకు చెక్‌ డ్యాంలు ఏర్పాటు చేశారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని గుర్తించారు. ఇలాంటి వాటికి సైతం నిధులు వస్తే ఆయకట్టు మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. logo