గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 05, 2020 , 00:35:26

ప్రగతి బాటలో

ప్రగతి బాటలో

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రణాళిక మున్సిపాల్టీల్లో నూతన మార్పులు తీసుకొచ్చింది. పల్లె ప్రగతి స్పూర్తితో గత నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ప్రధానంగా పారిశుధ్యానికి పెద్ద పీట వేయడం జరిగింది. దీంతో ఆయా పట్టణాల్లో చెత్త కుప్పలను తొలగించారు. ఇండ్ల మధ్యన మొలిచిన ముళ్ల చెట్లను సైతం జేసీబీ యంత్రాలను సమకూర్చడంతో పాటుగా కూలీలను సైతం ఏర్పాటు చేసి పనులను నిర్వహించారు. దీనికోసం జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలకు దాదాపుగా రూ.1కోటి వరకు నిధులు వచ్చాయి. పట్టణ ప్రగతి ప్రారంభమైనప్పటి నుంచి చివరి రోజైన బుధవారం వరకు సంబురంగా సాగింది. తొలిరోజు జిల్లాలోని 86వార్డుల్లో ప్రణాళికలు రూపొందించారు. దాని ప్రకారం ఈ పది రోజుల పాటు రోజు ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుతో పాటుగా ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెఢ్డి, జైపాల్‌ యాదవ్‌, ఎంపీ రాములు, ఎంఎల్‌సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి దామోదర్‌ రెడ్డి, కలెక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరిలు ప్రతిరోజూ ఆయా పట్టణాల్లో పర్యటించారు. వార్డుల వారీగా ప్రజలతో సమావేశమయ్యారు. 


ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా పారిశుధ్యానికి ప్రజల నుంచి కావాల్సిన సహకారాన్ని, బాధ్యతను వివరించారు. ఇక పురపాలక మంత్రి కేటీఆర్‌ కల్వకుర్తికి వచ్చి మున్సిపాల్టీల సమస్యల పరిష్కారం, అధికారులు, పాలకులు, ప్రజల భాగస్వామ్యం గురించి తెలియజేశారు. ఇలా చేపట్టిన పట్టణ ప్రగతితో మున్సిపాల్టీల్లోని కాలనీలు పరిశుభ్రంగా మారాయి. చెత్త కుప్పలు, ముళ్ల పొదలు తొలగించబడ్డాయి. అలాగే విద్యుత్‌ సమస్యలను సైతం గుర్తించి థర్డ్‌ వైర్లు ఏర్పాటు చేశారు. కాలనీల్లో మొక్కలను సైతం నాటారు. ఇక చెత్తలు వేసేందుకు కావాల్సన బుట్టల గురించి వివరాలు సేకరించారు. ఇలా నాలుగు మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ పదిరోజుల్లో కార్యాచరణ రూపొందించారు. నిరంతరం జరిగే ఈ పట్టణ ప్రగతిలో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులపై ఆయా మున్సిపాల్టీల కమీషనర్లు జిల్లా కలెక్టర్లకు నివేదించారు. అలాగే రాబోయే కాలంలో చేపట్టాల్సిన పనులపై కూడా అంచనాలు రూపొందించారు. ఈ నివేదికల ప్రకారంగా మున్సిపాల్టీల బడ్జెట్‌ను కలెక్టర్‌ ఆధ్వర్యంలో రూపొందించనున్నారు. పల్లె ప్రగతి మాదిరిగా వార్డుల్లో జరిగిన ఈ పట్టణ ప్రగతి ప్రజల్లో అభివృద్ధిపై కొత్త ఆశలను చిగురింపజేసింది. 


గత కొన్నేళ్లుగా ఉన్న దుస్థితి ఒక్కసారిగా మారడంతో పట్టణ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఒక్క రోజులోనే ఆయా వార్డులు, కాలనీల రూపురేఖలు మారడంతో పట్టణ ప్రగతి పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఆయా మున్సిపాల్టీ పాలకవర్గాలకు సైతం ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతితో జరిగిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం జరగడం విశేషం. రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆస్తి పన్ను వసూళ్లు, తడి,పొడి చెత్త సేకరణ, మొక్కల సంరక్షణ, పారిశుధ్య సహకార చర్యలను చేపట్టనున్నారు. అలాగే నూతన చట్టం గురించి సైతం ప్రజలకు వివరించడం జరిగింది. ఇలా మున్సిపాల్టీల్లో ఈ పది రోజుల పట్టణ ప్రగతి పురపాలిక చట్టంపై అవగాహన కల్పించడంతో పాటుగా పట్టణాల అభివృద్ధి కోసం చేపట్టే చర్యలు, తమ బాధ్యతపై అవగాహన కల్పించింది.logo