శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 03, 2020 , 00:01:04

చెత్తతో ఆదాయం

చెత్తతో ఆదాయం

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల్లో తొలి ప్రాధాన్యతగా చెత్త లేకుండా చేసేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని 86వార్డుల్లో చెత్తను తొలగించే చర్యలు చేపడుతున్నారు. కాగా పట్టణాలను సిరిసిల్ల తరహాలో పారిశుధ్య హితంగా మార్చేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

తడి..పొడి చెత్త వేర్వేరుగా సేకరణ

పట్టణాల్లో ప్రజలు తమ ఇండ్లల్లో ఉన్న చెత్తను ఇంటి బయట, రోడ్లపై, కాలనీల్లోని ఖాళీ స్థలాలు, ఖాళీ ప్లాట్లల్లో పారవేస్తున్నారు. ఇందులో తడి, పొడి చెత్తలు ఉంటున్నాయి. ఇండ్లల్లో, హోటళ్లలో, చికెన్‌ దుకాణాల్లాంటి చోట్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలు, పాడైన కూరగాయలు, కుల్లిన మాంసం తడి చెత్త కిందకు రానుండగా ఇంట్లో శుభ్రం చేయగా వచ్చే కుళ్లు, కాగితాలు, చెట్లు, మొక్కల ఆకులు, ఖాళీ డబ్బాలు, ఇతరాలు పొడి చెత్త కిందకు వస్తాయి. ఇలాంటి చెత్తను ప్రజలు ఇండ్ల మధ్యన పారవేస్తుండటంతో కాలనీల పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. 

ఈచెత్తతో ప్రజలకు కలుగుతున్న అనారోగ్యాలతో సగటున నెలకు ఓ కుటుంబం రూ.400నుంచి రు.500వరకు ఖర్చు చేస్తున్నట్లుగా ఓ అంచనా. దీంతో చెత్త నిర్వహణపై మంత్రి కేటీఆర్‌ అధికారులకు ప్రత్యేక లక్ష్యం నిర్దేశించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా ఆదేశించారు. ప్రజలకు మున్సిపాలిటీల నుంచి రెండు బుట్టలను ఇంటింటికీ అందజేస్తారు. ఈ చెత్తను పట్టణాల్లో ఎక్కడపడితే అక్కడ శివారు ప్రాంతాల్లో వేయకుండా డంపింగ్‌ యార్డులకు తరలించనున్నారు. ఇందులో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేరుస్తారు. 

ప్రత్యేక డంపింగ్‌ యార్డులు

మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయబోతున్నారు. నాగర్‌కర్నూల్‌ చందాయపల్లి శివారులో ఓ స్థలం ఉండగా ప్రజల కోరిక మేరకు ఇతర స్థలాన్ని అన్వేషించనున్నారు. కల్వకుర్తిలో ఇప్పటికే డంపింగ్‌ యార్డు ఉంది. అచ్చంపేట, కొల్లాపూర్‌లోనూ డంపింగ్‌ యార్డుకు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. ఇలా ఇండ్లు, దుకాణాల నుంచి తరలించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా ప్రతీరోజు ఈ డంపింగ్‌ యార్డులకు తరలించి తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులను తయారు చేయనున్నారు. ఈ ఎరువుల వల్ల మున్సిపాల్టీల్లో వన నర్సరీల నిర్వహణకు ఈ సేంద్రియ ఎరువు ఉపయోగపడుతుంది. 

రీసైక్లింగ్‌తో ఆదాయం

పొడిచెత్తనూ రీసైక్లింగ్‌ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం మున్సిపాలిటీల్లో డ్రై రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఈ పద్ధతి ద్వారా మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.3లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలా చెత్త సేకరణతో పట్టణాలను పారిశుధ్యంగా మార్చడంతో పాటుగా మున్సిపాలిటీలకు ఆదాయ వనరుగా మార్చాలన్న మంత్రి లక్ష్యాన్ని అమలు చేసేలా మున్సిపాల్టీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పట్టణ ప్రగతిలో చెత్త సేకరణపై ప్రజలకు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించే చర్యలను ఉన్నతాధికారులు తీసుకొంటున్నారు. కౌన్సిలర్లను సిరిసిల్లకు త్వరలోనే తీసుకెళ్లనున్నారు. ఈనెల 4వ తేదీతో పట్టణ ప్రగతి పది రోజుల కార్యాచరణ పూర్తైన తర్వాత చెత్త నిర్వహణపై కఠినంగా వ్యవహరించనున్నారు. ప్రజలతో పాటు వ్యాపారులు రోడ్లపై చెత్త వేస్తే రూ.500నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించనున్నారు. దీనికోసం ఇప్పటికే పట్టణాల్లో వేసిన కమిటీల్లోని శానిటేషన్‌ కమిటీలను వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఇలా రాబోయే కాలంలో పట్టణ ప్రగతి ద్వారా చెత్త వల్ల ప్రజలకు కలిగే అనారోగ్యాలను దూరం చేయడంతో పాటుగా క్లీన్‌ పట్టణాలుగా మార్చేందుకు చేపట్టనున్న చెత్త శుద్ధ్దిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పారిశుధ్య పట్టణం కోసం ..

పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు ప్రజలకు అనారోగ్యాలను దూరం చేసేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి ద్వారా చెత్త సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి తడి చెత్తతో కంపోస్టు ఎరువులు, పొడి చెత్తను డ్రై రిసోర్స్‌ సెంటర్‌కు తరలించే చర్యలు చేపడతారు. ఇలా సిరిసిల్లలో నెలకు రూ.3లక్షల వరకు వస్తున్నట్లుగా ఇక్కడి మున్సిపాలిటీల్లో కూడా ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం. పట్టమ ప్రగతి తర్వాత చెత్త సేకరణను వంద శాతం చేపట్టి క్లీన్‌ పట్టణాలుగా మార్చేలా ముందుకు సాగుతాం.


- మనూచౌదరి, అడిషనల్‌ కలెక్టర్‌


logo