గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 02, 2020 , 23:48:23

ఆత్మరక్షణే ఆలంబనగా

ఆత్మరక్షణే ఆలంబనగా

నవాబ్‌పేట: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేసి.. వారికి వారు ఆత్మరక్షణ కల్పించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. సమాజంలోని కొంతమంది ఆకతాయిల వేధింపులు, అఘాయిత్యాలను సైతం ఎదుర్కొనే విధంగా.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థినులకు ప్రత్యేకంగా కరాటే, జూడోలాంటి సాహస క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. నవాబ్‌పేట మండలంలోని ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షకులను నియమించి అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్తే.. 

  ..బాలికల్లో ఆత్మైస్థెర్యం నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బాలికలకు కరాటే శిక్షణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే మొదటి విడుత కింద మండల కేంద్రంలోని కేజీబీవీ, మరికల్‌, యన్మన్‌గండ్ల, కొల్లూర్‌, లింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షకులను ఏర్పాటు చేసి వారికి  గౌరవవేతనం ఇస్తూ తరగతులు చేపడుతున్నారు. డిసెంబర్‌ నెలలో ప్రారంభమైన శిక్షణ తరగతులు మూడు నెలల పాటు కొనసాగుతాయి. ప్రతి వారంలో రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించేలా అక్కడి పాఠశాల హెచ్‌ఎంలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి బుధ, గురు వారాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆపద కాలంలో అమ్మాయిలు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా కరాటే, జూడో, నాన్‌చాక్‌ తదితర సాహసోపేతమైన క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. నవాబ్‌పేట కేజీబీవీలో 400మంది, మరికల్‌ పాఠశాలలో 200మంది, యన్మన్‌గండ్ల పాఠశాలలో 150మంది, కొల్లూర్‌ పాఠశాలలో 115 మంది, లింగంపల్లి పాఠశాలలో 70మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. నవాబ్‌పేట కేజీబీవీ, యన్మన్‌గండ్ల, మరికల్‌ పాఠశాలల విద్యార్థులకు చెన్నయ్య అనే సీనియర్‌ కరాటే మాస్టర్‌ శిక్షణ ఇస్తుండగా.. కొల్లూర్‌, లింగంపల్లి విద్యార్థినులకు బాల్‌రాజ్‌ అనే కరాటే మాస్టర్‌ శిక్షణ ఇస్తున్నారు. గతంలో కంటే ఈ ఏడాది విద్యార్థినులు కరాటే నేర్చుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలికల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు కరాటే నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.  ప్రతి వారంలో బుధ, గురు వారాల్లో తరగతులు చేపడుతున్నారు. బాలికలకు కరాటేలో మెళకువలు నేర్పి మార్చి 15వ తేదీ నాటికి కోర్సు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


logo