బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 01, 2020 , 00:14:49

ఇక ఫుల్‌ ఫిట్‌

ఇక ఫుల్‌ ఫిట్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు శారీరక మానసికోల్లాసం కోసం విద్యార్థులు వ్యాయామం చేసేలా కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక తరగతులు చేయించాలని నిర్ణయించింది. దీంతో ఈకార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విద్యాశాఖలో పూర్తిస్థాయిలో అమలు పరచాలన్న ఆదేశాలు జారీ చేయడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన వ్యాయామ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనతోపాటు విద్యార్థులు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో రోజువారి వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చించి కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే బాలిక రక్షణకోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బాల్యానికి పునాదులు పడే పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావిభారత పౌరులు బలహీనంగా తయారవుతున్నారని గమనించిన కేంద్ర ప్రభుత్వం చదువుతోపాటు శారీక, మానసికోల్లాసానికి ఫిట్‌ ఇండియా కార్యక్రమం ద్వారా ‘ఫిట్‌ ఇండియా’ స్కూల్‌ తీసుకువచ్చింది.  ప్రతి పాఠశాలలో విద్యార్థులు వ్యాయామం చేయాలని, అందుకు అనుసరించాల్సిన విధి విధానాలను విడుదల చేసింది. ప్రతి పాఠశాలలో సోమవారం నుంచి మొదటి శనివారం వరకు నిత్యం చేయాల్సిన కార్యక్రమాల వివరాలను వివరించింది. 


సోమవారం : వ్యాయామంతోపాటు యోగా చేయాల్సి ఉంటుంది. శారీరక ధృడత్వంకోసం అనుసరించాల్సిన విధి విధానాలు, శరీరం సౌష్టవంగా ఉంటేనే మనస్సు పూర్తిస్థాయిలో పనిచేస్తుందనే సంకేతాలతో నిఫుణుల ప్రసంగాలు వినిపించాలి. మంచి పోషకారంతో ఆరోగ్యంగా ఉంటారనేది విద్యార్థులకు నిపుణులతో అవగాహన కల్పించాలి. 

మంగళవారం: పాఠశాల ప్రారంభానికి ముందు ప్రార్థన సమయంలో కొద్దిసేపు కచ్చితంగా కాళ్ళు, చేతులు ఆడించే వ్యాయామం చేయించాలి. పాఠశాలల పని వేళల్లో సమయం ఏర్పాటు చేసుకొని శరీరానికి శ్రమ కలిగించే ఆటలు, క్రీడలతో మానసిక ఆరోగ్యంగ ఎలా సాధ్యమవుతుందో వివరించే అతిథితో ప్రసంగాలు ఇప్పించాలి. 

బుధవారం: పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఖేలో ఇండియా యాప్‌ను ఫోన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థులకు శారీరక దారుఢ్యాన్ని అనుశీలన చేసేలా సిద్ధం చేయాలి. వయస్సుకు తగ్గట్టుగా శరీరాకృతితో మంచి ఆరోగ్య సౌభాగ్యంపై ఆకర్షిణీయమైన గోడ పత్రికల తయారీలో విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించాలి. 

గురువారం: మనిషి శరీరంలో అన్ని అవయవాల్లో చురుకుదనం పెంచేందుకు నృత్యం, ఏరోబిక్స్‌ ఆత్మరక్షణ విద్యలు చేయించాయి. ముఖ్యంగా యోగాసనాలు, స్కిప్పింగ్‌, తోటపని ఈ విషయాలపై ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించాలి. వ్యాసరచన, గేయాల రచనా ఆలాపనలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. 


శుక్రవారం: విద్యార్థులకు సాధారణ శరీర ఆకృతిపై ఆటలు, వ్యాయామంపై క్విజ్‌ పోటీలు నిర్వహించాలి. వివిధ పాఠశాలలు అనుసరిస్తున్న కొత్త రకం వ్యాయామ కార్యక్రమాల గురించిన సమాచారం సేకరించి తమ పాఠశాలలో అమలకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 

శనివారం: నిపుణులు సూచించిన వ్యాయామాలు, ఆటలతోపాటు స్థానికంగా బహుళ ప్రచారం పొందిన ఆటలు అభ్యాసనం చేయించాలి. కబడ్డీ, బొంగరాలు తిప్పడం, దొంగ పోలీస్‌ ఆటలు, కప్పగంతులాట, నడవడంలో పోటీలు, పరుగుపందెం, పాఠాలు చదవడం వంటివి చేయించాలి.  ఈవిధానం వల్ల కంటికి వ్యాయామం కలిగించినట్లవుతుందనేది నిపుణనుల ఉద్దేశ్యం. 


అన్ని పాఠశాలల్లో అమలు..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఫిట్‌ ఇండియా కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కొనసాగింప చేస్తున్నాం. ప్రతి పాఠశాల ఆన్‌లైన్‌ ద్వారా నమోదు పూర్తైంది. ప్రతిరోజు విద్యార్థుల శారీర దారుఢ్యం కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నెలరోజులపాటు అమలు జరుపుతున్న ఫిట్‌ ఇండియా కార్యక్రమం అన్ని పాఠశాలల్లో కొనసాగుతుంది.

- డీఈవో గోవిందరాజులు logo