శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:28:38

పచ్చదనానికి ప్రాధాన్యం

పచ్చదనానికి ప్రాధాన్యం

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తోంది. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా 33శాతం అడవులను సాధించేందుకు హరితహారం పథకం అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో జిల్లాలో కోటికిపైగా మొక్కలను నాటుతోంది. ఇది ఇలా ఉంటే గత అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసేందుకు పల్లె,పట్టణ ప్రగతి కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని 453గ్రామ పంచాయతీల్లో గత అక్టోబర్‌లో దాదాపుగా 13లక్షల మొక్కలు నాటారు. ప్రధానంగా గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటారు. ఇక ప్రతి గ్రామ పంచాయతీలో వన నర్సరీలను తీసుకొచ్చారు. ఇందులో ఆయా గ్రామాల్లో వచ్చే వర్షాకాలంలో నాటే మొక్కలకు సంబంధించి విత్తనాలను అందజేసి ఏపుగా పెరిగి నాటేందుకు అనువుగా పెంచడం ఈ నర్సరీల బాధ్యత. నర్సరీలను నిర్వహించడం గ్రామాల సర్పంచ్‌, కార్యదర్శులకు కేటాయించడం జరిగింది.  ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నర్సరీల ద్వారా మొక్కల పెంపకం చర్యలను చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మున్సిపాల్టీల్లో అమలవుతున్న పట్టణ ప్రగతిలోనూ మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మొక్కల పెంపగానికి రెండో స్థానం కల్పించింది. ఇందులో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను అధికారులతో పాటుగా సైతం స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లకు అప్పగించడం గమనార్హం. నాటిన మొక్కల్లో 85శాతం బ్రతకకుంటే అధికారులపై చర్యలతో పాటుగా ప్రజాప్రతినిధులను సైతం సస్పెండ్‌ చేసే అధికారం ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించింది. దీంతో మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం తెలుస్తోంది. మొక్కలకు నీళ్లు అందించేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లతో పాటుగా నీటి ట్యాంకర్లను సైతం ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం. వన నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఇటీవలే జిల్లాలోని తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌, కోడేరు, వెల్దండ, లింగాల, తాడూరు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురికి మెమోలు అందజేశారు. ప్రజలు కోరుకున్న పండ్లు, పూల మొక్కలను ఇంటింటి సర్వే ద్వారా తెలుసుకొంటున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ప్రజలు కోరిన మొక్కలను అందించాలని పుర, పల్లె అధికారులకు ఆదేశించడం గమనార్హం. ఇలా మొక్కలను అన్ని గ్రామాల్లో పెంచేందుకు ప్రతి పంచాయతీ హరిత ప్రణాళికను తయారు చేసుకొనేలా నూతన చట్టంలో రూపొందించారు. పది శాతం బడ్జెట్‌ను గ్రీన్‌ బడ్జెట్‌ పేరిట కేటాయించిన నిధులను మొక్కల పెంపకానికి కేటాయించాల్సి ఉంటుంది.  వార్డు కమిటీలను  ఏర్పాటు చేసి పరిరక్షణ బాధ్యతల్లో భాగం చేయనున్నారు. ఇలా మొక్కల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నర్సరీల్లో మొక్కల ఉత్పత్తి నుంచి నాటడంతో పాటుగా మొక్కలు వృక్షాలుగా ఎదిగే వరకూ పరిరక్షణ, సంరక్షణలాంటి చర్యలపై ప్రభుత్వం పంచాయతీలు, పురపాలికలకు మార్గనిర్దేశనం జారీ చేసింది. పట్టణాల్లో ప్రస్తుతం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజలకు ఏయే రకాల మొక్కలు, ఎన్నెన్ని కావాలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ పది రోజుల్లో ఒకరోజు మొక్కలు నాటడం జరుగుతుంది. ఆ తర్వాత వర్షాకాలంలో ఎప్పటిలాగే హరితహారం చేపడతారు. గ్రామాల్లోనూ ఇప్పటి వరకు నాటిన మొక్కలను వందశాతం సంరక్షించేలా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దీంతో ఈనెల 29వ తేదీలోపు ఆ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇలా రాబోయే కాలంలో పట్టణాలు, పల్లెల్లో పాతకాలం నాటి పచ్చదనం తిరిగి సంతరించుకోనుంది.


logo