గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:25:59

ప్రజల భాగస్వామ్యం తోనే పట్టణాభివృద్ధి

 ప్రజల భాగస్వామ్యం తోనే పట్టణాభివృద్ధి

అచ్చంపేట రూరల్‌: యూపజల భాగస్వామ్యం తోనే పట్టణాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలల్లో అమలు చేస్తున్న పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా గురువారం పట్టణంలోని గోకుల్‌నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలనీల్లో పారిశుధ్యం పనులను వేగవంతం చేసి కాలనీలను సుందరంగా చేసుకోవాలని కోరారు. పట్టణ సమీపంలో  డంపింగ్‌ యార్డు నిర్మాణం, ముళ్ల పొదలు, చెత్త కుప్పల తొలగింపునకు వార్డు కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  మరో 6 నెలల్లో ఇంటింటికీ భగీరథ నల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.15 కోట్లకు టెండర్లు పూర్తయి పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.10 కోట్లు టెండరు దశలో ఉన్నట్లు గుర్తు చేశారు.  కాలనీలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, నెల రోజుల తర్వాత పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.   స్మృతివనం, రైతు బజార్‌ స్థలం, వలపట్ల కాలనీలో పురాతన బావుల ను పరిశీలించారు. చింతల్‌బస్తీ కాలనీలో మురుగు కాల్వలను పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహధారి పక్కన ధనలక్ష్మి దుస్తుల వ్యాపారీతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు. 

పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలి

పట్టణంలో ప్రతి ఇండ్లు, కాలనీల శుభ్రంతో సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మనుచౌదరి కోరారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి పనుల ద్వారా కాలనీలను బాగు చేసుకోవాలన్నారు. డ్రైనేజీల శుభ్రత, డంపింగ్‌యార్డు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలకు ప్రహారీల నిర్మాణం వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, వైస్‌ చైర్మన్‌ విశ్వేశ్వర్‌నాథ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మనోహర్‌, ఆర్డీవో పాండునాయక్‌, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్స్‌ కళమ్మ, లావణ్య, విష్ణుమూర్తి, శివ, బాలరాజు, నిర్మల బాలరాజు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాజేందర్‌, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహాగౌడ్‌, నాయకులు అమీనోద్దిన్‌, రమేశ్‌రావు, ఆంజనేయులు, పర్వతాలు, నరేశ్‌, నిజాం, ఖలీల్‌,   ఉన్నారు.

 గ్రామాల్లో ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలి

గ్రామ పంచాయతీల్లో నీటి సరఫరాకు ట్రాక్టర్ల ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలిశెట్టిపల్లి, కొర్రతండా రెండు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, సర్పంచ్‌ జయరాం, సింగిల్‌విండో చైర్మన్‌ , నర్సయ్య, ఎంపీపీ శాంతాలోక్యానాయక్‌, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహాగౌడ్‌, నాయకులు అమీనోద్దిన్‌, నరేశ్‌ తదితరులు ఉన్నారు.


logo