గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 03:58:15

నివేదికల్లో వాస్తవాలు ప్రతిబింబించాలి

నివేదికల్లో వాస్తవాలు ప్రతిబింబించాలి

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: పట్టణాలను బాగుచేసేందుకు సీఎం కేసీఆర్‌ ధృఢసంకల్పంతో ఉన్నారని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మున్సిపాలిటీ వార్డుల ఇన్‌చార్జి అధికారులతో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుంచి అధికారులు వార్డుల్లో గుర్తించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇంటింటిని సందర్శించినప్పుడు వారి ఇంటి ఆర్థిక పరిస్థితులతోపాటు ఎదుర్కొంటున్న వార్డు సమస్యలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోవాలన్నారు. గతంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు రాలేదని, నిధుల మంజూరుకు అధికారులు తమతమ వార్డులలో ఇస్తున్న నివేదికలు పూర్తిస్థాయిలో వాస్తవికతను కల్గి ఉండాలన్నారు. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాలు, పల్లెల్లో చదువుకోలేని వారు ఉండకుండా అందరికీ విద్య అందించేందుకు అవసరమైన సర్వే చేసుకుంటూ ముందుకు సాగాలని తెలియజేశారు. గ్రీన్‌ప్లాంట్‌ కోసం ప్రతి వార్డుకు ఇద్దరు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. స్పెషల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన వార్డుల సమగ్ర నివేదికలు పక్కాగ ఉండాలని తెలితపారు. పట్టణంలో మొత్తం 14 జేసీబీలను అందుబాటులోకి తీసుకుని అవసరమైన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో అనువైన మొక్కలను నాటేందుకు సమగ్రంగా వివరాలు సేకరించాలని, వారికి అవసరమైన మొక్కలను మనం అందించేందుకు చర్యలు తీసుకుందామన్నారు. పట్టణ ప్రగతి పక్కాగా ఉండేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ కేంద్రంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు రోడ్డు మధ్యలో ఉన్నాయని, రోడ్డు మధ్యంలో నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో యాదయ్య, డిప్యూటీ సీఈవో మొగులప్ప, విద్యుత్‌ శాఖ ఈఎస్‌ బిక్షపతి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ నర్సింగరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటరమణ, మైనార్టీ సంక్షేమాధికారి శంకరాచారి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. అలాగే విద్యుత్‌ శాఖ అధికారులు బిల్లులు చెల్లించలేదని కారణం చూపుతూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యార్థుల వసతి గృహాలకు కరెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో కట్‌ చేయకూడదని విద్యుత్‌ శాఖ ఈఎస్‌ బిక్షపతిని ఆదేశించారు.  బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


logo