గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 26, 2020 , 01:42:05

‘సహకారం’ ఏకగ్రీవం

‘సహకారం’ ఏకగ్రీవం

  మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : వార్‌ వన్‌ సైడే అని మరోసారి స్పష్టమైంది. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార ఎన్నికల చరిత్రలో తొలిసారి అన్ని స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రతిపక్షాల నుంచి కనీసం ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ డీసీసీబీ పరిధిలోని 87 సహకార సంఘాలను కైవసం చేసుకొని గులాబీ పార్టీ మంగళవారం జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో జిల్లా సహకార సంఘాల డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. 

డీసీసీబీలో 15 ఏకగ్రీవం

  డీసీసీబీ పరిధిలోని 20 డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లను ఆహ్వానించగా.. 15 స్థానాలు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఏ-కేటగిరీలో 16 స్థానాలుంటే అందులో రిజర్వ్‌ చేయబడిన ఎస్సీ 3, ఎస్టీ 1 స్థానానికి అభ్యర్థులు లేరు. మిగతా 12 స్థానాలకుగాను 10 జనరల్‌, 2 బీసీ స్థానాలకు సరిగ్గా సరిపోయేలా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లన్నీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక బీ-కేటగిరీలో మాత్రం ఎస్టీ అభ్యర్థి అందుబాటులో లేకపోవడంతో నామినేషనే దాఖలు కాలేదు. ఎస్టీ ఒక్క స్థానానికి ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవం అయ్యింది. బీసీ రిజర్వేషన్‌ కేటగిరీలో ముగ్గురు నామినేషన్లు వేయగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. కే.ఎస్‌. లక్ష్మినారాయణ ఏకగ్రీవంగా గెలిచారు. ఇక జనరల్‌ కేటగిరీలో రెండు నామినేషన్లు రాగా ఎం. నర్సప్ప ఉపసంహరించుకోవడంతో నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 20 డైరెక్టర్‌ స్థానాలకు గాను 5 స్థానాలకు రిజర్వేషన్‌ అభ్యర్థులు అందుబాటులో లేక నామినేషన్లు రాలేదు. ఏ-కేటగిరీలో ఎస్సీ 3, ఎస్టీ 1, బీ-కేటగిరీలో ఎస్సీ 1 అభ్యర్థులు లేకపోవడంతో డీసీసీబీ పరిధిలో 5 స్థానాలకు నామినేషన్లే రాలేదు. బీ-కేటగిరీలో ఎస్సీ రిజర్వేషన్‌ అయిన ఓ డైరెక్టర్‌ స్థానానికి అభ్యర్థులెవరూ లేరు. 

డీసీఎంస్‌ పరిధిలో 7 స్థానాలు ఏకగ్రీవం

  డీసీఎంఎస్‌ పరిధిలో 10 స్థానాలకుగాను ఏ -కేటగిరీకి 6 స్థానాలు కేటాయించారు. బీ-కేటగిరీకి 4 స్థానాలు కేటాయించారు. కోరం లేని పరిస్థితి వచ్చిన నేపథ్యంలో నిబంధనల మేరకు గోపాల్‌పేట, వనపర్తి పీఏసీఎస్‌ చైర్మన్లు పాలకవర్గంలో తీర్మానం చేసి తమ తరఫున ఇద్దరు ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులను డీసీఎంస్‌ సభ్యులుగా నామినేట్‌ చేశారు. వనపర్తి నుంచి కొమ్ము బాలయ్య, గోపాల్‌పేట నుంచి పాత్లావత్‌ హార్యా నాయక్‌లు జాక్‌పాట్‌ కొట్టేశారు. సహకార చట్టంలోని నిబంధన సెక్షన్‌ 30(2)1X తెలంగాణ కో ఆపరేటీవ్‌ సొసైటీ 1962 చట్టం ప్రకారం పీఏసీఎస్‌ పాలకవర్గం తీర్మానం ద్వారా తమ ప్రతినిధిగా సంఘంలోని సభ్యున్ని జిల్లా సహకార సంఘానికి తమ ప్రతినిధిగా పంపించేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ నిబంధన మేరకు డీసీఎంస్‌లో ఆ సొసైటీల చైర్మన్లకు సభ్యత్వం పోయి వారి ప్రతినిధికి లభిస్తుందని ఎన్నికల అధికారి శ్రీరామ్‌ తెలిపారు. కోరం లేని సందర్భంలో ఈ నిబంధన వినియోగించుకునేందుకు అవకాశం ఉందని ఆయనన్నారు. ఏ-కేటగిరీకి సంబంధించి ఉన్న 6 స్థానాలకు అంతే సంఖ్యలో నామినేషన్లు రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బీ-కేటగిరీలో బీసీ అభ్యర్థి ఒకరు ఏకగ్రీవమయ్యారు. ఎస్సీ1, జనరల్‌ ఇద్దరు అభ్యర్థులు లేక ఎన్నిక జరగలేదు. మొత్తంగా డీసీఎంస్‌ పరిధిలో 3 డైరెక్టర్‌ స్థానాల ఎన్నికలు అభ్యర్థులు లేక వాయిదా పడ్డాయి. ఈనెల 29న డీసీసీబీ, డీసీఎంస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు పదవులు సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే కైవసం చేసుకోనున్నారు. అయితే అభ్యర్థులెవరనే సస్పెన్షన్‌ కొనసాగుతోంది.


logo