ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 25, 2020 , 00:55:36

ఏసీబీ వలలో డీటీ

ఏసీబీ వలలో డీటీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: తనకు సంబంధం లేకున్నా భూ సమస్యను పరిష్కరిస్తానని రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా డిప్యూటీ తాసిల్దార్‌ జయలక్ష్మి బాగోతం నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం బయటపడింది. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ తెలిపిన మేరకు.. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన బృంగి తిరుపతయ్య అనే వృద్ధుడు సర్వేనెంబర్‌ 15 నుంచి 2.25 ఎకరాలు, 14 సర్వే నెంబర్‌ నుంచి 30 గుంటల భూమిని తన మనుమరాళ్లు, మనువడైన విలయ, విప్లవ, వికాస్‌లకు 1996లో రిజిస్టర్‌ చేశాడు. వారు తమ భూమిని అదే గ్రామానికి చెందిన దోమ వెంకటయ్య అనే రైతుకు 2016లో విక్రయించారు. ఆ తర్వాత వెంకటయ్య భూమి ఆన్‌లైన్‌కోసం తిమ్మాజిపేట తాసిల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం బెంజర్ల గ్రామానికి చెందిన మల్లేష్‌ అనే వ్యక్తి 2006లో మా తాత నాకు అమ్మిన భూమిని వేరొకరికి ఆన్‌లైన్‌ చేయవద్దని ఆర్డీవో, కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మల్లేష్‌, దోమ వెంకటయ్య మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 


ఒక ఏడాది ఒకరు పంట వేయగా మరో ఏడాది ఇంకొకరు భూమి సాగుచేస్తూ తరచూ ఘర్షణ పడుతుండేవారన్నారు. ఈ క్రమంలో దాడులు సైతం చేసుకొని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారన్నారు. దీంతో కోర్టు కేసులు సైతం జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌కోసం బాధితుడు దోమ వెంకటయ్య ఆర్డీవో కోర్టులోనూ, కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు సైతం దరఖాస్తు పెట్టుకున్నాడన్నారు. ఇదే విషయమై ఆర్డీవో కోర్టులో కేసు మార్చి 21 వాయిదా కూడా ఉన్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి సెక్షన్‌లో కార్యాలయం బయట జయలక్ష్మి అనే అధికారిని సంప్రదించి తమ సమస్య ఉందని పరిష్కరించాలని విన్నవించారు. దీంతో ఆమె భరోసా ఇస్తూ మీ సమస్య తీరుస్తానని అందుకు తనకు లంచంగా రూ.13 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని వెంకటయ్య బతిమిలాడగా చివరకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె తెలిపింది. 


ఒకేసారి ఇవ్వకపోయినా వాయిదాల ప్రకారంగా ఇవ్వండని సలహా ఇవ్వడంతో బాధితుడు ఒప్పుకొన్నాడు. మొదటి విడతగా రూ. లక్ష  తీసుకురమ్మని జయలక్ష్మి చెప్పడంతో సోమవారం తెస్తానని చెప్పి వెంకటయ్య మహబూబ్‌నగర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. సోమవారం ఉదయం రూ.లక్ష సిద్ధం చేసుకొని మహబూబ్‌నగర్‌కు రాగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌కు వచ్చారు. 4.30 గంటల ప్రాంతంలో జయలక్ష్మికి డబ్బులు ఇవ్వగా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆమెను పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్‌ వివరాలు వెల్లడించారు. విచారణ జరిపిన తర్వాత స్పెషల్‌ కోర్టుకు కేసును అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. అదేవిధంగా జయలక్ష్మి నివసించే మహబూబ్‌నగర్‌లోని ఇంట్లో కూడా సోదాలు చేసేందుకు నిజామాబాద్‌ ఏసీబీ ఎస్సై శివకుమార్‌ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఏసీబీ తనిఖీలో తమతోపాటు శంకర్‌రెడ్డి, భరత్‌కుమార్‌లు ఉన్నట్లు తెలిపారు. 


logo