బుధవారం 27 మే 2020
Nagarkurnool - Feb 25, 2020 , 00:49:03

ప్రగతికి బాటలు..

ప్రగతికి బాటలు..

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పట్టణ ప్రగతి ప్రారంభమైంది. రాబోయే పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సోమవారం అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మునిసిపాల్టి పరిధిలోని 86 వార్డులలో సమావేశాలు నిర్వహించారు. అచ్చంపేటలోని 20 వార్డులలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్‌లోని 18వ వార్డులో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీధర్‌, కొల్లాపూర్‌ నాల్గవ వార్డులో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం పట్టణ ప్రగతిని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యానికి తీసుకునే చర్యల గురించి వివరిస్తూ చెత్తను రోడ్లపై వేయరాదని, ప్లాస్టిక్‌ కవర్లు వాడరాదని కోరారు. పరిసరాలు బాగుంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటుకోవాలని, వారికి కావాల్సిన మొక్కల గురించి వివరాలు సేకరించారు. అంతకముందు సమావేశాల్లో వార్డుల వారీగా ఉన్న సమస్యలను వార్డు కమిటీల సమక్షంలో చర్చించారు. అలాగే రాబోయే ఏడాదిలో, ఐదేళ్లలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కావాల్సిన నిధులకు అంచనాలు తయారు చేస్తున్నారు. 


మన పట్టణాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం..

పట్టణ ప్రగతిలో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో జరిగిన సమావేశాల్లో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు మాట్లాడుతూ.. వార్డు కమిటీల ఆధ్వర్యంలో మూడు నెలలకు ఒకసారి సమావేశాలు కావాలి. అందులో వచ్చిన సమస్యలను కార్పొరేటర్‌, కౌన్సిలరు, కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లాలి. పారిశుధ్య పనుల నిర్వాహణను పర్యవేక్షణ చేయడం, హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటించాలి. మొక్కలు బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పార్కులు, ఆట స్థలాలు రక్షించాలి. మార్కెట్‌ స్థలాలు, ప్రజా మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలి. నగర,పురపాలికలకు వార్డుల్లోని ప్రజలు పనులన్ని చెల్లించే విధంగా అవగాహన కల్పిస్తూ అధికారులకు సహకారం అందించాలి. అనధికారిక నిర్మాణాలు, ఆక్రమణలు జరుగుతుంటే అధికారుల దృష్టికి తేవాలి. ప్లాస్టిక్‌ పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. కళలు, క్రీడలు, ఆటలను ప్రోత్సహించాలి. పట్టణ ప్రగతి ద్వారా అబివృద్ధికి ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలి. శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు రూపొందించేందుకు పక్కా ప్రణాళికల రూపొందించాలి. అందుకు కావాల్సిన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి. ప్రతివార్డులో కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు సమావేశాలు నిర్వహించుకొని వార్డులో కావాల్సిన పనులపై చర్చించి వార్డులను అభివృద్ధి పర్చుకోవాలి. 


logo