సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Feb 23, 2020 , 23:57:40

అభివృద్ధే అభిమతం

అభివృద్ధే అభిమతం

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణ ప్రగతి పేరిట సోమవారం నుంచి పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గతంలో పల్లె ప్రగతి పేరిట గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంచే హరితహారం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీల నిర్మాణాల్లాంటి పనులు చేపట్టారు. దీనివల్ల గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం ఇందుకోసం రూ.34కోట్ల నిధులను మంజూరు చేసింది. నిరంతరం చేపట్టే ఈ కార్యక్రమం ఇప్పటికే రెండుసార్లు నిర్వహించారు. తొలి విడతలో నెల రోజులు, ఆ తర్వాత పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు మరో పది రోజుల పాటు పల్లె ప్రగతి జరిగింది. ఇందులో గ్రామాలకు మండలస్థాయి ప్రత్యేక అధికారుల నియామకం జరిగితే వారి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు పల్లెలను అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో మున్సిపాల్టీ కేంద్రాల్లోనూ పట్టణ ప్రగతి చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు మున్సిపల్‌ అధికారులు, ఛైర్మన్లు, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించనున్నారు. తొలిరోజులో భాగంగా సోమవారం వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. దీనివల్ల వార్డుల్లోని సమస్యలను గుర్తించి సాయంత్రం వార్డులో వచ్చే సంవత్సరంతో పాటు రాబోయే ఐదేళ్లపాటు చేపట్టే పనులను గుర్తిస్తారు. దీనికోసం కావాల్సన నిధులపై కూడా అంచనా రూపొందిస్తారు. ఈ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు నివేదించడం జరుగుతుంది. 


అలాగే ప్రజలకు కావాల్సిన మొక్కలను తెప్పించి ఒకరోజు హరితహారం నిర్వహిస్తారు. నాటిన మొక్కల్లో 85శాతం బ్రతికి ఉంచేలా కౌన్సిలర్లకు బాధ్యతలు నిర్దేశిస్తారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా అవగాహన కల్పిస్తారు. అలాగే మురుగు కాల్వలను శుభ్రం చేస్తారు. ఇక ఆస్తిపన్ను చెల్లించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలపై కూడా అవగాహన కల్పిస్తారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు. విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా థర్డ్‌ లైన్‌ను ఏర్పాటు చేసి మున్సిపాల్టీల్లో విద్యుత్‌ ఖర్చులను తగ్గించే చర్యలు చేపడతారు. ప్రతి నెలా మున్సిపాల్టీ ఇకపై తమ విద్యుత్‌ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి వార్డుకు ఓ ఇంఛార్జ్‌ అధికారిని నియమించారు. ఇలా జిల్లాల్లోని 86వార్డుల్లో అధికారులకు బాధ్యతలు కేటాయించారు. పూర్తిస్థాయిలో ఇకపై ఆ అధికారులే వార్డుల పరిపాలనను పర్యవేక్షిస్తారు. అలాగే నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. జనాభాను బట్టి ప్రతి మున్సిపాల్టీకి దాదాపుగా రూ.30లక్షల చొప్పున మంజూరు చేసింది. 


రాబోయే కాలంలో కూడా నిధుల సమస్య లేకుండా ప్రతి నెలా నిధులను మంజూరు చేయనుంది. ప్రజలను భాగం చేసేందుకు ఒక్కో కమిటీలో 15మంది చొప్పున ప్రతి వార్డుకు నాలుగు కమిటీల చొప్పున 60మంది ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఇలా జిల్లాలో 5వేల మంది ప్రజలు పట్టణ ప్రగతిలో పాల్గొంటారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ వార్డు కమిటీలు సమావేశమై సమస్యల పరిష్కారానికి నివేదిస్తాయి. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పట్టణ, పల్లె ప్రగతిల పర్యవేక్షణ జరుగుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులనూ సస్పెండ్‌ చేయనున్నారు. ఇందులో భాగమయ్యేందుకు నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేయనున్నారు. పట్టణ ప్రణాళిక ప్రారంభోత్సవాలతో పాటుగా గ్రామాల్లో పాత సమస్యల పరిష్కారంపై పర్యవేక్షిస్తారు. మొత్తం మీద పల్లె ప్రగతి స్పూర్తిగా పట్టణాలు సైతం సమస్యల పరిష్కారం దిశగా కదులుతున్నాయి. ఇటీవలే కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి ఈ పట్టణ ప్రగతి మంచి చేయూతను ఇవ్వనుండగా ప్రజలు సైతం సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు.


logo