గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Feb 21, 2020 , 02:20:52

హర..హర.. మహాదేవ

హర..హర.. మహాదేవ

మాఘమాసం బహుళ చతుర్ధశి ఆరుద్ర నక్షత్రంలో మహాశివుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఈ రోజున శివరాత్రి పర్వదినాన్ని భక్తులు జరుపుతూ వస్తున్నారు.

  • శివదీక్షతో మోక్షప్రదాయకం
  • నేడు మహాశివాత్రి వేడుకలు
  • ముస్తాబైన శివాలయాలు

మాఘమాసం బహుళ చతుర్ధశి ఆరుద్ర నక్షత్రంలో మహాశివుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.  ప్రతి ఏడాది ఈ రోజున శివరాత్రి పర్వదినాన్ని భక్తులు జరుపుతూ వస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలోని అన్ని దినాలలో పగటిపూటనే పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజున మాత్రం వేకువ జామున నుంచి మరునాడు వేకువజామున వరకు పూజలు చేస్తారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్ష చేపట్టి, రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేస్తారు. శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో శివనామస్మరణతో మారుమోగుతాయి. ప్రముఖ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం అత్యంత కమనీయంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల ప్రత్యేకతలపై కథనం.

- వనపర్తి సాంస్కృతికం


గోష్పాద క్షేత్రం బాలబ్రహ్మేశ్వరాలయం

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : బ్రహ్మత్వాన్ని కోల్పోయిన చతుర్ముఖుడు పరమేశ్వరుడికోసం తుంగభద్ర తీరాన తపమాచరిస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు హేమలాపురిలో ఉద్భవించేందుకు సిద్ధమవుతాడు. దానిని అడ్డుకొనేందుకు ప్రమథగణాల్లో ఒకరైన నందీశ్వరుడు తన పాదాన్ని అడ్డుగా పెడుతాడని, అయినా పక్క నుంచి రసాత్మక లింగం ఉద్భవించిందని ప్రతీతి. బ్రహ్మ పరమశివుడి కోసం తపమాచరించిన ప్రాంతం కావడంతో దీనిని నవబ్రహ్మ క్షేత్రం అని, కోటిలింగాల క్షేత్రం అని కూడా పిలుస్తారు. బ్రహ్మ తపస్సుతో ఉద్భవించినందున బాలబ్రహ్మేశ్వరుడిగా పరమశివుడు పూజలందుకుంటున్నాడు. 

మహాశివరాత్రి వేళ : మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్‌ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, భస్మార్చనలు నిర్వహిస్తారు. 

ఎలా వెళ్లాలి : ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్‌ క్షేత్రానికి వెళ్లేందుకు బస్సు, రైలు మార్గాలున్నాయి. కర్నూలు- హైదరాబాద్‌ హైవేపై అలంపూర్‌ చౌరస్తా స్టేజీ వద్ద నుంచి ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో చేరుకోవచ్చు. రైలు ప్రయాణికులు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్టేజీ వద్ద నుంచి ఆలయానికి చేరవచ్చు. 


శ్రీరామ ప్రతిష్ఠిత సైకత లింగం

రాజోళి : చుట్టూ తుంగభద్ర నది, అందమైన ప్రకృతి, నది మధ్యలో వెలసింది రాంపాడు శివాలయం. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నదీ ఆలయం. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ దైనందిన జీవనంలో భాగంగా పూజ కోసం ఇక్కడ సైకత(ఇసుక) లింగాన్ని తయారు చేసి ప్రతిష్టించాడనే పురాణగాథ ప్రాచుర్యంలో ఉన్నది. శ్రీరాముడు ప్రతిష్ఠించినందునే దీనిని రాంపాడు శివాలయంగా పిలుస్తారు. పక్షవాతం వచ్చిన రోగులు ఇక్కడి స్వామిని దర్శించుకొని మండలంపాటు పూజిస్తే నయమవుతుందని ప్రగాఢ విశ్వాసం.

ఎలా వెళ్లాలి: అలంపూర్‌ చౌరస్తా నుంచి శాంతినగర్‌ కు బస్సు సౌకర్యాలు కలవు. అక్కడి నుండి రాజోళి వరకు ఆటోలు, బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు వెళ్తాయి. రాజోళి నుంచి నదీతీరం ఆటోల్లో, నది మధ్యలో ఉన్న ఆలయానికి పుట్టిలపై వెళ్లి దర్శించుకోచ్చు.  

ప్రత్యేక పూజలు : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. మహిమాన్వితం అడివేశ్వరాలయం

రాజోళి: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రంలో కొలువైన భ్రమరాంబ సమేత అడివేశ్వరాలయం మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతున్నది. శివరాత్రి రోజు స్వామివారి బ్రహోత్మవాలు ప్రారంభమవుతాయి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఈ శివుడు పేరు గాంచాడు.

  ప్రత్యేకతలు : మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ నెల 24న రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. రైతుసంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తారు. 

ఎలా వెళ్లాలి: అలంపూర్‌ చౌరస్తా నుంచి శాంతినగర్‌ కు బస్సు సౌకర్యం ఉన్నది. అక్కడి నుంచి రాజోళి మండల కేంద్రానికి బస్సులు, ఆటోల్లో చేరుకోవచ్చు.  


కొంగుబంగారం.. కోటిలింగేశ్వరుడు

కొత్తకోట: మండలంలోని కానాయిపల్లి స్టేజీ వద్ద ఉన్న కోటిలింగేశ్వరాలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ప్రత్యేక పూజలు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి కోటిలింగేశ్వరాయంలో అభిషేకాలు, అర్చనలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.రాత్రి 12.00 గంటలకు లింగోద్భవ సమయంలో నిశీపూజకు ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు అగ్నిగుండాలు నిర్వహిస్తారు. 

ఎలా వెళ్లాలి: కొత్తకోట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో, వనపర్తి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కోటిలింగేశ్వరాలయం ఉన్నది. ఇక్కడికి బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. 


పూడురులో మల్లికార్జునుడు

గద్వాల టౌన్‌ : గద్వాల సంస్థానాధీశుల కాలంనాటిది పూడురులోని మల్లికార్జునుడి క్షేత్రం. పూడూరు గ్రామాన్ని గతంలోపుండ్రపురమని పిలిచేవారని ప్రతీతి. ఈ గ్రామంలో మల్లికార్జునుడు, వీరభద్రుడు, చెన్నకేశవస్వామి ఆలయాలు కొలువై ఉన్నాయి. సంస్థానాధీశుల కాలం నుంచి ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.  

ప్రత్యేక పూజలు : శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో బిల్వార్చన, ఫలపుష్పాభిషేకాలు ఉంటాయి. సాయంత్రం భజన కార్యక్రమాలు, మహామంగళ హారతి నిర్వహిస్తారు. 

ఇలా వెల్లాలి: జాతీయరహదారి ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు వచ్చే రోడ్డు మార్గంలో ఎడమవైపు గ్రామం ఉంటుంది. గద్వాలడిపో నుంచే బస్సు సౌకర్యం కలదు. పూడురు గ్రామానికి రైలు సౌకర్యం కూడా ఉన్నది. గద్వాల నుంచి కర్నూలుకు వెళ్లే రైలు మార్గంలో మొదటి స్టేషన్‌ పూడురు. 


సప్తనదీ సంగమం..సోమేశ్వర క్షేత్రం

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: ప్రకృతి ఒడిలో దాగి ఉన్న క్షేత్రం..సోమేశ్వరాలయం. సప్తనదుల సంగమంగా  పిలువబడుతూ,నల్లమల అందాలను వీక్షించేందుకు అనువుగా ఉన్న సోమశిల ఆలయం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల కేంద్రానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది.సోమశిలలోని శ్రీలలితాసోమేశ్వరస్వామి ఆలయం, శ్రీపోతులూరి వీరబ్రహ్యేంద్రస్వామి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. 

ప్రత్యేక పూజలు: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 21వ తేదీ నుంచి 25వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈనెల 21రాత్రి 8గంటలకు శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి నాటక ప్రదర్శన. 22న శివపార్వతుల కల్యాణం, దేవుని ఊరేగింపు, సాయంత్రం 4గంటలకు రథోత్సవం, 25న మంగళహారతితో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇలా వెళ్లాలి: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి వచ్చేవారు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. కొల్లాపూర్‌ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆటోలు ఇతర ప్రైవేట్‌ వాహనాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి వెళ్లే వారు నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌కు చేరుకొని వెళ్లవచ్చు.


శ్రీశైలం ఉత్తర ద్వారం.. ఉమామహేశ్వర క్షేత్రం

 అచ్చంపేట రూరల్‌: పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీశైల క్షేత్రమునకు ఉత్తర ద్వారముగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధి గాంచినది. ఉమామహేశ్వర క్షేత్రము నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌గ్రామ పరిధిలో ఉన్నది. పవిత్ర ప్రసిద్ద క్షేత్రమైన రెండవ శ్రీశైలముగా పిలవబడుతుంది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రము మహా వైభవముగా ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర వలన తెలియుచున్నది. 

ప్రత్యేక పూజలు: శుక్రవారం ఉదయం 5గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు లింగోద్భవం, ఒంటి గంటకు పాపనాశనము వరకు పల్లకీసేవ నిర్వహిస్తారు. శనివారం తెల్లవారుజామున పార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తారు.

ఇలా వెళ్లాలి: వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు ఆర్టీసీ బస్సుల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చేరకోవాలి. అక్కడి నుంచి అచ్చంపేట మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు ఉంటాయి. అక్కడి ఉమామహేశ్వర క్షేత్రానికి ప్రత్యేక బస్సులు కలవు. అచ్చంపేట నుంచి రంగాపూర్‌ చేరుకొని అక్కడి నుంచి ఉమామహేశ్వర వెళ్లాల్సి ఉంటుంది.


కల్పవృక్షాల నెలవు కందూరు

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వరాలయం కల్పవృక్షాల నెలవుగా విరాజిల్లుతున్నది. ఇక్కడ పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. ఆలయ ముఖద్వారా పశ్చిమదిశగా ఉండటం మరో ప్రత్యేకత. కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కల్పవృక్షాలను మనం ఈ క్షేత్రంలో చూడొచ్చు. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో వడ్డెమాన్‌ను పరిపాలించే రాజు తైలప్ప కూతురు వసుంధరా దేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. 

శివరాత్రి వేళ: మహా శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచిఅభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం పల్లకీ సేవ అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో నిశీపూజ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. 

ఎలా వెళ్లాలి :  కందూరు ఆలయానికి వెళ్లటానికి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, కర్నూలు నుంచి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. 44వ జాతీయ రహదారిపై గల కందూరు స్టేజి దగ్గర దిగి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. భూత్పూర్‌ నుంచి 22 కిలోమీటర్లు, కొత్తకోట నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 


గిరిజనులే పూజారులు

జడ్చర్ల రూరల్‌: జడ్చర్లకు ఐదు కిలో మీటర్ల దూరంలో చెలమలింగేశ్వరాలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో మర్రి చెట్టు నీడనా చిన్న చెలిమలో మహాశివుడు వెలిసినట్లు చరిత్ర చెప్తుంది. అనాదిగా ఇక్కడ గిరిజనులే స్వామి వారికి పూజలు, ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

జాతర: మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఇక్కడ ప్రత్యేక పూజలు, జాతర నిర్వహిస్తారు. 

ఎలా వెళ్లాలి: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల ప్రధాన రహదారి పై మయూరి నర్సరీ సమీపంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న చెలిమలింగేశ్వరాలయాన్ని బస్సులు, ఆటో ద్వారా చేరుకోవచ్చు. 


పరశురామ ప్రతిష్ఠిత లింగం

జడ్చర్ల రూరల్‌: దుందుభి నది తీరాన త్రేతాయుగంలో సాక్షాత్తు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా భాసిల్లుతున్నది పర్శవేదీశ్వర క్షేత్రం. పర్శవేదీశ్వరుడినే స్థానికులు మీనాంబరేశ్వరుడు అని కూడా పిలుస్తారు. జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి గ్రామ శివారులో ఉండే ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు.

ప్రత్యేక పూజలు : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయత్పూర్వం నుంచే రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. లింగోద్భవ సమయంలో నిశీపూజలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 

ఎలా వెళ్లాలి : మహబూబ్‌నగర్‌ నుంచి కల్వకుర్తి బస్సుల్లో కుర్వగడ్డపల్లి స్టేజీ దగ్గర దిగి కాలినడకన ఈ ఆలయానికి చేరుకోవచ్చు. 


logo