బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 19, 2020 , 00:13:20

నల్లమలలో శివోహం

నల్లమలలో శివోహం

నల్లమల సానువులు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అభయారణ్యం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. శైవక్షేత్రాలకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం కావడంతో మహాశివరాత్రికి కొండకోనల్లో వెలసిన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. వేలాది మంది శివస్వాములు నిత్యం పాదయాత్రగా శైవక్షేత్రాలను దర్శించుకుంటూ శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటున్నారు.

  • శైవక్షేత్రాలకు ఆధ్యాత్మిక శోభ
  • దాతృత్వం చాటుకుంటున్న దాతలు
  • మార్మోగుతున్న శివనామస్మరణ
  • శ్రీశైలానికి స్వాములు పాదయాత్ర
  • శ్రీశైలానికి స్వాములు పాదయాత్ర
  • పులకిస్తున్న అభయారణ్యం
  • స్వాములకు అడుగడుగునా అల్పాహారాలు, నీటి వసతి

నల్లమల సానువులు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అభయారణ్యం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. శైవక్షేత్రాలకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం కావడంతో మహాశివరాత్రికి కొండకోనల్లో వెలసిన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. వేలాది మంది శివస్వాములు నిత్యం పాదయాత్రగా శైవక్షేత్రాలను దర్శించుకుంటూ శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటున్నారు. దాతల సహాయంతో దారిపొడవునా స్వాములకు అన్నదానం, ఫలదానం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చెంచులు, గిరిజనులే పూజారులుగా వ్యవహరించే ఆదివాసీ భౌరాపూర్‌ భ్రమరాంబ జాతర ఈనెల 20నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈయేడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది.              - అచ్చంపేట రూరల్‌/అమ్రాబాద్‌ రూరల్‌


అచ్చంపేట రూరల్‌: హర హర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమఃశివాయ అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల అభయారణ్యంతో మార్మోగుతున్నది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రం శివభక్తులతో పులకిస్తున్నది. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునుడు కొలువుదీరి ఉన్నారు. ఈ క్షేత్రంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దీంతో శివమాల ధరించిన వేలాదిమంది భక్తులు వివిధ జిల్లాల నుంచి అచ్చంపేట మీదుగా అమ్రాబాద్‌ అభయారణ్యం నుంచి పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్నారు. కొల్లాపూర్‌, అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, నారాయణపేట, కోస్గి, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, హన్వాడ, వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి తదితర ప్రాంతాలకు చెందిన శివస్వాములు, భక్తులు కఠోర దీక్షతో మండుటెండలో కాలినడకన కొండలు, గుట్టలు, బండరాళ్లను దాటుకుంటు పాదయాత్రగా రావడంతో అభయారణ్యం పరవశిస్తున్నది. 


శివరాత్రికి 41రోజుల ముందు దీక్షపూనిన భక్తులు తమ ప్రాంతాల నుంచి వారంరోజుల ముందుగా పాదయాత్రను ప్రారంభించి శివరాత్రికి శ్రీశైలం చేరుకుని దీక్షను విరమిస్తారు. పాదయాత్రగా వెళ్తున్న శివస్వాములు, భక్తుల ఆకలి తీర్చేందుకు దైవభక్తి కలిగిన వ్యక్తులు ఆయా గ్రామాలలో, పట్టణాలలో అల్పాహారం కేంద్రాలను ఏర్పాటు చేస్తు భక్తిని చాటుకుంటున్నారు. అచ్చంపేటలో శివ సేవా సమితి, ఉమామహేశ్వర సేవా సమితి, పద్మశాలి యువజన సంఘం, లారీ అసోసియేషన్‌ మొదలైన సంఘాల వారు అన్నదానం, ఫలదానం, తాగునీటి సౌకర్యాలు కల్పించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అక్కడక్కడా టెంట్లు, చెట్ల కింద భక్తులు సేదతీరుతున్నారు. అనంతరం మళ్లీ మండుటెండను సైతం లెక్క చేయకుండా కాళ్ల నొప్పులతో అడుగులు వేస్తు ముందుకు కదులుతున్నారు.


పాదయాత్ర ఓ మధుర జ్ఞాపకం

శివమాల ధరించి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లడం జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలుస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడ్డాకుల మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెల్లగా నడుస్తూ వెళ్తున్నాం. ఏడేండ్ల నుంచి శివమాల ధరించి పాదయాత్రగా వెళ్తున్నాను. - రాజుగౌడ్‌, శివభక్తుడు, అడ్డాకుల


వైద్య శిబిరాలు అవసరం

శివమాల ధరించి కఠోర దీక్షతో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న వేలాదిమంది శివ స్వాములు, భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. 18వ సారి శివమాలధరించి 5వ సారి పాదయాత్రగా వెళ్తున్నాను. శివభక్తుల కోసం అల్పాహారం, పండ్లు, తాగునీరు, అన్నదానం మొదలైన సౌకర్యాలు అచ్చంపేట పట్టణంలోనే అధికంగా ఏర్పాటు చేశారు. గురువారం వరకు శ్రీశైలం చేరుకుంటాం.  - నర్సింహులు, గురుస్వామి, వేపూర్‌, హన్వాడ మండలం


మొదటిసారి పాదయాత్ర

మొదటిసారి శివమాల ధరించి శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేస్తున్నాను. తోటి స్వాముల వెంట నడుస్తుంటే ఉల్లాసంతో ముందుకు కదులుతున్నాం. మొదటిసారి కావడంతో కాళ్ల నొప్పులతో కాస్త ఇబ్బందిగా ఉన్నది. ఈ నెల 14న మా సన్నిధానం నుంచి బయలుదేరాము. బుధవారం రాత్రికి శ్రీశైలం చేసుకుంటాం.

- రాఘవేందర్‌, కన్నెస్వామి, వేపూర్‌, హన్వాడ మండలం 


పన్నెండేండ్లుగా అన్నదానం 

పన్నెండేండ్లుగా ప్రతి శివరాత్రికి వారం రోజుల ముందు నుంచి అన్నదానం, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఏడాది సుమారు 15 క్వింటాళ్ల బియ్యంతో అన్నదానం చేయడం, శ్రీశైలం రహదారి వెంట యాత్రికులకు పులిహోర, నీళ్ల ప్యాకెట్స్‌ పంపిణీ చేస్తున్నాం. భక్తులు సహకరించి విరాళాల రూపంలో మరికొంత సహాయ సహకారాలు అందిస్తే మరింత మంది స్వాములకు అన్నదానం చేస్తాం. 

- సుంకరి బాల్‌రాజు, శివ సేవా సమితి అధ్యక్షుడు


logo