శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 19, 2020 , 00:11:29

పల్లెలకు ప్రగతి బాటలు

పల్లెలకు ప్రగతి బాటలు

పల్లెల అభివృద్ధికి ప్రగతి బాటలు పరుచుకోనున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అమలవుతున్న పల్లె ప్రగతి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన ఈ బృహత్తర కార్యక్రమం మరోసారి నిర్వహించబోతున్నారు.

  • ఈనెల 23న పంచాయతీరాజ్‌ సమ్మేళనం
  • పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు
  • హాజరుకానున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
  • పాలెం బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహణ
  • వైకుంఠ ధాములు, శ్మశాన వాటికలకు ప్రాధాన్యత
  • ఇకపై అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
  • పరుగులు పెట్టనున్న గ్రామాల అభివృద్ధి

పల్లెల అభివృద్ధికి ప్రగతి బాటలు పరుచుకోనున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అమలవుతున్న పల్లె ప్రగతి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన ఈ బృహత్తర కార్యక్రమం మరోసారి నిర్వహించబోతున్నారు. ప్రత్యేక కలెక్టర్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణతో గ్రామాల్లో పల్లె ప్రగతి మరింత పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా ఈనెల 23న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్‌ సమ్మేళనం జరగబోతోంది. తద్వారా రాబోయ పక్షం రోజుల్లో పల్లెలకు మంచి రోజులు రానున్నాయి.      - నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈనెల 23న పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించనున్నారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టారు. జిల్లాలోని 453పంచాయతీల్లోనూ తొలుత అక్టోబర్‌లో నెల రోజుల పాటు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లో మురుగు కాల్వలను, నీటి ట్యాంకులను శుభ్రపర్చడం,  గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారు. ముళ్ల పొదలను తొలగించారు. అలాగే శిథిలమైన బోర్లు, బావులను పూడ్చివేయడం, పాత ఇండ్లను తొలగించడంతో పాటుగా విద్యుత్‌ సమస్యలను సైతం పరిష్కరించారు. ఇలా నెల రోజుల ప్రగతి తర్వాత మరోమారు ప్రత్యేకంగా పది రోజుల పల్లె ప్రగతి నిర్వహించారు. దీని ద్వారా గతంలో చేపట్టగా మిగిలిన పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మండలం, గ్రామాలకు ప్రత్యేక అధికారుల ద్వారా ఈ కార్యక్రమం అమలైంది. నిరంతరం జరిగేలా రూపొందించిన ఈ కార్యక్రమం మరోసారి చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశించారు. 


ఇందులో భాగంగా జిల్లాలోనూ పల్లె ప్రగతి జరగబోతోంది. ఈ నేపథ్యంలో తొలుత పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిని ఇందుకోసం సీఎం నియమించారు. మంత్రి పర్యవేక్షణలో మలిదిశ పల్లె ప్రగతిపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 23వ తేదీన పాలెంలోని బాలాజి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇందులో ప్రభుత్వ విప్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటుగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన కార్యదర్శి నుంచి జిల్లా అధికారి వరకు అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్‌లు సైతం హాజరవుతారు. ఈ సమావేశంలో గతంలో రెండుసార్లు జరిగిన పల్లె ప్రగతిపై చర్చిస్తారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై లక్ష్యాన్ని నిర్దేశిస్తారు.  ప్రస్తుతం హరితహారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రాబోయే వర్షాకాలంలో మొక్కల పెంపకం కోసం వన నర్సరీల నిర్వహణపై సూచనలు ఇస్తారు. అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డులను నిర్మించడంతో పాటుగా వైకుంఠ ధామాల నిర్మాణానికీ చర్యలు చేపడతారు. 


జిల్లాలో 442పంచాయతీల్లో స్థలాలను గుర్తించగా 423గ్రామాల్లో పూర్తి చశారు. ఇందులో 283డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 140గ్రామాల్లో నిర్మాణ దశలో ఉండగా 38పంచాయతీల్లో పనులు చేపట్టాల్సి ఉంది. మరో 16పంచాయతీల్లో స్థలాల సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇక 401వైకుంఠ ధామాలకు గాను ఇప్పటి వరకు కేవలం 3మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 118నిర్మాణంలో ఉండగా 280వైకుంఠ ధామాల్లో పనులు ప్రారంభించలేదు. జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ఈ పనులపై పంచాయతీరాజ్‌ అధికారులపై జరుగుతున్న నిర్లక్ష్యంపై ఇప్పటికే ఓమారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి నిర్మాణాలకు కావాల్సిన స్థలాల సేకరణ సైతం చేపట్టనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. ఇప్పటికే గతంలో జరిగిన పనుల్లో నిర్లక్ష్యంపై విజిలెన్స్‌ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలువురు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు మెమోలు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ పల్లె ప్రగతికి ప్రభుత్వం నిధులను కూడా కొరత లేకుండా విడుదల చేస్తుంది. గత నాలుగు నెలల్లో దీనికోసం రూ.34కోట్ల వరకు మంజూరు చేసింది. ఇంకా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో మరో విడత పల్లె ప్రగతిని ఉద్యమంలా చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలను విజయవంతం చేసేందుకు జిల్లాలోనూ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోనున్నారు.


అభివృద్ధి, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు మౌళిక సదుపాయాల కల్పనకు పల్లె ప్రగతి ఓ మంచి కార్యక్రమం. ఈనెల 23న నిర్వహించే పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో జిల్లాలో మరోసారి చేపట్టబోయే పల్లె ప్రగతిపై లక్ష్యం నిర్దేశిస్తాం. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌ అధికారులు, ఉద్యోగులతో పాటు ప్రజలూ స్వచ్ఛందంగా కదలాలి. గ్రామాల అభివృద్ధి వల్లే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. పల్లె ప్రగతి హరితహారం, డంపింగ్‌యార్డు, వైకుంఠ ధామాల నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది.

- మనూచౌదరి, అడిషనల్‌ కలెక్టర్‌


జములమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

గద్వాల రూరల్‌ : నడిగడ్డ ప్రజల ఇలవేల్పు, కొలిచిన వారికి కొంగు బంగారంగా నిత్యపూజలు అందుకుంటున్న గద్వాలలోని జములమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో నడిగడ్డ ప్రాంతంలో ఇంట్లో శుభ కార్యానికి ముందు జములమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాలను భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.  


logo