శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 18, 2020 , 00:48:55

డంపింగ్‌లకు స్థలాలు కొనండి

డంపింగ్‌లకు స్థలాలు కొనండి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : పల్లెప్రగతిలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణపు పనులను  త్వరగా  పూర్తి చేయాలని  కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు,  శ్మశాన వాటికలు, నర్సరీలు తదితర అంశాలపై సమీక్షించారు. శ్మశాన వాటికల పురోగతిపై పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లు నిర్మిస్తున్న శ్మశాన వాటికల ప్రగతిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు వేగవంతం కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక కోసం స్థలం లేదో అక్కడ జీపీ నిధుల నుంచి రెండ్రోజుల్లోగా స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని, డీపీవో సురేశ్‌మోహన్‌ను ఆదేశించారు. శ్మశాన వాటికల నిర్మాణాలను   పూర్తి చేయాలని పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు. ఈ నెల 20 లోగా జిల్లాలోని అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను, ట్రాలీలను కొనుగోలు పూర్తి చేయాలన్నారు. 


ప్రతిరోజు ట్రాక్టర్లు చెత్త సేకరణకు వెళ్ళే రూట్‌ మ్యాప్‌లు, సమయం, నిర్వాహణకు అయ్యే ఖర్చు తదితర వివరాలు తెలియజేయాలన్నారు. గ్రామ పంచాయతీ బడ్జెట్‌లో ట్రాక్టర్‌, డ్రైవర్‌, ఇంధనం, మిస్లేనియస్‌ ఖర్చుల కింద నిధులు కేటాయించాలన్నారు. మండల ప్రజాపరిషత్‌ అధికారి ప్రతి గ్రామాన్ని వారంలో ఒకరోజు సందర్శించి, నర్సరీల్లో మొక్కలను పరిశీలించి గ్రామాల అభివృద్ధిని పరిశీలించాలన్నారు.  నర్సరీలకు కావాల్సిన సంరక్షణ చర్యలను పటిష్టంగా తీసుకోవాలని, గ్రామీణాభివృద్ధి అధికారి సుధాకర్‌ను ఆదేశించారు.  23వ తేదీన పాలెం బాలాజీ గార్డెన్స్‌లో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సమ్మేళనానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, డీపీవో సురేష్‌మోహన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుధాకర్‌ పాల్గొన్నారు.


పనులు వేగవంతం చేయండి 

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగంగా చేయాలని అదనపు కలెక్టర్‌ మనూ చౌదరి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పంచాయతీఆజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన డిప్యూటీ ఇంజినీర్లు,అసిస్టెంట్‌ ఇంజినీర్‌లతో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడు గుంతలపై మండలాల వారీగా పనుల ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, ఇంకుడు గుంతల నిర్మాణాలను శరవేగంగా చేపట్టి పనులను పూర్తి చేయాలన్నారు.  వైకుంఠధామాలు 401కి   ఇప్పటి వరకు మూడు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, 118 నిర్మాణ దశలో ఉన్నాయని, 280 ఇంకా పనులు మొదలు పెట్టలేదని, వీటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రగతి సాధించని వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అంతకుముందు ట్రాక్టర్ల కొనుగోలుపై డీలర్లతో సమావేశమై సమీక్షించారు. ఆర్డర్‌ ఇచ్చిన గ్రామాలకు వెంటనే ట్రాక్టర్లతోపాటు ట్రాలీలు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీపీవో సురేశ్‌మోహన్‌, డీఆర్‌డీవో సుధాకర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ దామోదర్‌రావు, మండలాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.logo