గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 18, 2020 , 00:46:34

కలెక్టరేట్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం

నాగర్‌కర్నూల్‌ క్రైం : తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌, తాసిల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం పైకి ఎక్కిన 11 మంది జటప్రోలు గ్రామానికి చెందిన రైతులు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వారిలో ఇద్దరు రైతులు కిరోసిన్‌ డబ్బా పట్టుకొని కలెక్టర్‌ రావాలంటూ కుమ్మిగోడపై కూర్చొని నిరసన తెలుపుతూ అధికారులకు ముచ్చమటలు పట్టించారు. వెంటనే ప్రజావాణిలో నుంచి బయటకు వచ్చిన డీఆర్‌వో మధుసూదన్‌ నాయక్‌ సముదాయిస్తున్నా పట్టించుకోకపోవడంతో విషయన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్‌ అక్కడకు చేరుకున్నారు. వారితో ఫోన్‌లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి వచ్చారు. అప్పటికే అప్రమత్తమైన అధికారులు ఫైర్‌ స్టేషన్‌కు, అంబులెన్స్‌లకు ఫోన్‌ చేయడంతో వారు కూడా సమయానికి అక్కడికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి


నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన 11 మంది రైతులు శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు. ముంపు ప్రాంతంలో ఇళ్లతో పాటు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వచ్చి జటప్రోలు గ్రామంలో నివసిస్తున్నామన్నారు. ఈ క్రమంలో పశువుల మేత పెట్టుకోవడానికి జటప్రోలు గ్రామానికి దగ్గరలోని గోపులాపూర్‌ గ్రామ శివారులోని వడ్డెమాన్‌ మశన్నకు చెందిన సర్వే నెంబర్‌ 177 భూమిలో రెండున్నర ఎకరాల భూమిని 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. ఆ పొలం చుట్టూ దొడ్డిగోడ నిర్మించుకున్నారు. అప్పటి నుంచి బాధితులు 11 మంది పశువుల మేతకోసం ఆ పొలాన్ని వినియోగించుకుంటున్న అక్కడే పశువులను ఉంచుతున్నారు. కానీ మశన్న కుటుంబం చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు రాయలసీమలో ఉన్న లక్ష్మయ్య ఇక్కడికి వచ్చి తాసిల్దార్‌ సహకారంతో మా గడ్డివాములను తీసివేయించారన్నారు. అప్పటికే అక్కడ మొక్కలను నాటుకున్నామని, వాటిని కూడా తామే నాటేకున్నామంటూ భూమిని ఆక్రమించుకున్నాడన్నారు. తమను ఆ పొలంలోకి రానివ్వడం లేదని చెప్పారు. దీంతో 11 మంది రైతులమంతా కలిసి రెండు నెలలుగా కలెక్టర్‌, తాసిల్దార్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. 


త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం : కలెక్టర్‌

జటప్రోలు గ్రామ రైతుల ఆధీనంలో ఉన్న భూమి విషయంలో రైతులకు త్వరలో న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. వాస్తవానికి 11 మంది రైతుల ఆధీనంలో ఉన్న భూమి 1990లో ఒక ఎస్సీకి అసైన్డ్‌ చేయడం జరిగిందన్నారు. కానీ 1994లో జటప్రోలుకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి కొన్నానని, సాధా కాగితాలు చూపిస్తున్నాడని, కాగితం రాసిన వారు ఉన్నారని చెప్పడంతో వారిరువురిని పిలిపించి వాస్తవ విషయాలు తెలుసుకొని సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. దీంతో రైతులు వెళ్లిపోయారు. 


logo