గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Feb 16, 2020 , 00:35:02

77.92%

77.92%
  • సహకారానికి పోటెత్తిన ఓటర్లు
  • 246 డైరెక్టర్లకు 554మంది అభ్యర్థులు
  • పండు వృద్ధులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు
  • నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 23విండోల పరిధిలో 299డైరెక్టర్ల స్థానాలు ఉండగా గొరిట సంఘం ఏకగ్రీవమైంది. ఇక్కడ 13డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే జిల్లాలో మొత్తం 53వార్డులు ఏకగ్రీవం అయాయ్యి. దీనివల్ల 22విండోల్లోని 246డైరెక్టర్ల పదవులకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ పదవులకు గాను 1179మంది నామినేషన్లు వేయగా తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం 554మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ అభ్యర్థులంతా గత నాలుగు రోజులుగా తమకు కేటాయించిన గుర్తులతో విస్తృత ప్రచారం నిర్వహించారు. మందు, విందులతో పాటుగా డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం 22విండోల పరిధిలోని 33పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికలకు ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. ఒక్కో వార్డు పరిధిలో 350ఓట్లకు అటు ఇటుగానే ఉండటంతో ఓటర్లను అభ్యర్థులు పలుమార్లు చేసిన ప్రచారాలతో వ్యక్తిగతంగానూ పరిచయమయ్యారు. దీనివల్ల శనివారం నాడు ఉదయం నుంచే ఆటోలు, కార్లల్లో ఓటర్లను ఆయా విండోల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను సైతం బూత్‌లకు తీసుకొచ్చారు. దీనివల్ల ఉదయం 11గంటల వరకే ప్రతి వార్డులో 70శాతంపైగా పోలింగ్‌ నమోదైంది. 


పోలింగ్‌ బూత్‌ల వద్ద విండో ఛైర్మన్‌ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు సందడి చేశారు. అలాగే ఆయా పార్టీల నాయకులు సైతం పోలింగ్‌ బూత్‌ వెలుపల ఉంటూ అక్కడికి వచ్చే ఓటర్లకు మరోమారు ఓటును గుర్తు చేస్తూ కనిపించారు. ఇక పోలీసులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే జిల్లాలో మొత్తం 77.92శాతం పోలింగ్‌ జరగడం గమనార్హం. జిల్లాలో 91వేల మంది ఓటర్లు ఉండగా తిమ్మాజిపేట(గొరిట) విండో మినహాయించి ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం 59,254ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 42,936మంది కాగా మహిళలు 16,318మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. జిల్లాలోని 22విండోల్లో చూస్తే మాచినేనిపల్లి సింగిల్‌ విండోలో అత్యధికంగా 92.99శాతం పోలింగ్‌ జరిగింది. ఇక్కడ 12డైరెక్టర్లకు ఎన్నికలు జరిగితే 358ఓట్లు పోలయ్యాయి. ఇక అత్యల్పంగా నర్సాయపల్లి విండోలో కేవలం 35.19శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఈ విండోలో 13డైరెక్టర్ల పదవులకు గాను 789ఓట్లు పోలయ్యాయి. 


మహిళా ఓట్లను చూస్తే వెల్దండలో అధికంగా 1371మంది ఓట్లు వేయగా, గన్యాగులలో కేవలం 58మంది మాత్రమే ఉండటం గమనార్హం. కొందరు ఓటర్లు ఆఖరి రెండు నిమిషాల సమయం మాత్రమే ఉండగా కూడా పోలింగ్‌ కేంద్రాల్లోకి చేరుకొన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్‌లో ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, బీరం హర్షవర్ధన్‌ రెడ్డితో పాటు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌ రెడ్డిలు సైతం ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఇలా మధ్యాహం 1గంటకు పోలింగ్‌ ముగిసింది. అనంతరం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతి రౌండ్‌కు 4వార్డుల చొప్పున మూడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రక్రియ దాదాపు రెండు గంటల్లో సాయంత్రం 4గంటల వరకు జరిగింది. రౌండ్ల వారీగా గెలిచిన పార్టీల అభ్యర్థులను బట్టి పోలింగ్‌ బూత్‌ల బయట వేచి ఉన్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల్లో కేరింతలు, నిరాశ చెంబుతూ కనిపించారు. మొత్తం మీద విండో ఎన్నికలు విజయవంతం అయ్యాయి. ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు జరుగుతాయి.


logo