బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 15, 2020 , 00:18:24

టార్గెట్‌ డీసీసీబీ!

టార్గెట్‌ డీసీసీబీ!

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన అన్ని ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం డీసీసీబీ స్థానంపై గురిపెట్టింది. సింగిల్‌విండో ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 17 సొసైటీలను గులాబీ పార్టీ ఇప్పటికే తనఖాతాలో వేసుకున్నది. త్వరలోనే నోటిఫికేషన్‌ రానున్న డీసీసీబీ, డీసీఎంస్‌ ఎన్నికల్లో సత్తాచాటనున్నది. ఉమ్మడి జిల్లాలోని 76 సొసైటీల పరిధిలోని 988 టీసీల్లో 285 ఏకగ్రీవం కాగా... అందులో 248 టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇప్పటికే చాలా సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు సొసైటీలో పాలకవర్గాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పలు చోట్ల ఇప్పటికే 13 స్థానాలకు గాను 4 నుంచి 6 వరకు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఒకటి, రెండు స్థానాలు గెలిస్తే చాలు సొసైటీలు కైవసం చేసుకునే వీలున్న పరిస్థితి ఉంది.  

పాత పద్ధతిలోనే డీసీసీబీలు...

నేడు సహకార సంఘాల ఎన్నికలు అనంతరం ఫలితాలు వెలువడతాయి. ఫలితాలు వచ్చిన తర్వాత రేపు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉండనుంది. ఈ మేరకు రేపు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో సహకార సంఘాల పాలకవర్గాల నోటిఫై కాగానే ఒకటి, రెండు రోజుల్లో డీసీసీబీ, డీసీఎంస్‌ పాలకవర్గాల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నది. ఉమ్మడి జిల్లాలోని 87 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. వీటిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 11 సంఘాలు (వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి) వెళ్లాయి. మహబూబ్‌ నగర్‌ 76 సొసైటీల్లో గండీడ్‌ సొసైటీ పూర్వపు రంగారెడ్డి జిల్లా పరిధికి చెందింది. గండీడ్‌ ఎన్నిక మహబూబ్‌ నగర్‌ నుంచి జరిగినా డీసీసీబీ, డీసీఎంస్‌ ఎన్నికలకు మాత్రం గండీడ్‌ పూర్వపు రంగారెడ్డి పరిధిలోకి వెళ్తుంది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ మాత్రమే మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలో జరుగుతుంది. మిగతా ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా రంగారెడ్డి పరిధిలోనే జరుగుతాయి. ప్రతి జిల్లాకో డీసీసీబీ ఏర్పాటుకు రిజర్వ్‌ బ్యాంకు అనుమతులు, మిగతా టెక్నికల్‌ విషయాల్లో ఏర్పడిన ఇబ్బందుల మూలంగానే పాత డీసీసీబీల పరిధిలోనే డీసీసీబీ, డీసీఎంస్‌ ఎన్నికలు జరుగనున్నాయని తెలుస్తున్నది.  

డీసీసీబీలే లక్ష్యంగా...

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలోని 87 పీఏసీఎస్‌ల పరిధిలో రంగారెడ్డి మినహా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లో ఉన్న 76 సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే 17 సొసైటీలను కైవసం చేసుకుని ఊపు మీదుంది. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో ఉన్న 11 సొసైటీల పరిధిలో ఇప్పటికే హస్నాబాద్‌ (కొడంగల్‌ మండలం) టీఆర్‌ఎస్‌ పార్టీకి ఏకగ్రీవం అయ్యింది. మొత్తంగా 18 సొసైటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. శనివారం జరిగే ఎన్నికల్లో రైతు బాంధవునిగా పేరొందిన సీఎం కేసీఆర్‌ రైతుల కోసం చేపట్టిన పథకాలు, వారి సంక్షేమం కోసం చేస్తున్న కృషిని గుర్తించి టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉన్నది. పీఏసీఎస్‌ల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని డీసీసీబీ, డీసీఎంస్‌ పీఠాలను అధిష్ఠించే దిశగా గులాబీ సేన వ్యూహరచన చేస్తున్నది.

20 మంది డైరెక్టర్లు...

ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీసీసీబీ, డీసీఎంస్‌లకు ఒక్కో వ్యవస్థకు 20 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. పాత డీసీసీబీ పరిధిలోని 87 పీఏసీఎస్‌ చైర్మన్లు ఈ డైరెక్టర్‌ స్థానాల కోసం పోటీ పడతారు. అయితే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని టీఆర్‌ఎస్‌ పార్టీయే డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సైతం ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏకగ్రీవమైన స్థానాలను బట్టి ఇదంత కష్టమేమీ కాదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు డీసీసీబీ, డీసీఎంస్‌ పదవుల కోసం తమ తమ అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాల్లో భాగంగా ముఖ్య నేతలను కలుస్తూ ముందుకు సాగుతున్నారు.


logo