శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 14, 2020 , 01:07:30

ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం

ఖిల్లాఘణపురం : రెండు అక్షరాల పదం ‘ప్రేమ’ .. రెండు జీవితాల కలయిక పెండ్లి.. ప్రేమతో మనస్సులు కలిస్తే.. పెండ్లితో అనుబంధం బలపడుతుంది. ప్రేమ అంటే ఆకర్షణ కాదు.. రెండు గుండెల్లో చిగురించిన ప్రేమ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. విద్వేషాలకు తావివ్వకుండా.. మనస్పర్థలకు చోటు లేకుండా.. కడదాక కొనసాగితేనే ప్రేమకు అర్థం పరమార్థం.. నిజమైన, నిస్వార్థమైన ప్రేమకు ఎప్పటికీ చావు ఉండదు.. ప్రతి మనిషీ జీవితాంతం ప్రేమ కోసం పరితపిస్తూనే ఉంటాడు. ప్రేమ కోసం ప్రాణలర్పించేది ఒక జంట అయితే.. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యేది మరో జంట.. ప్రేమ కోసం సామ్రాజ్యా లు నిర్మించిన వారు ఒకరైతే.. ప్రేమ కోసం సర్వం కోల్పోయిన వారు మరొకరు.. అయితే, జిల్లాలో ప్రేమించుకొని.. పెండ్లి చేసుకున్న పలు జంటలు అన్యోన్యంగా జీవిస్తున్నాయి. కొందరి ప్రేమ ప్రయాణంలో ముళ్ల బాటలు ఎదురవుతున్నా..మరికొందరి ప్రేమలు పూలబాటలుగా మారుతున్నాయి. చదువుకునే చోట, ఉద్యోగ నేపథ్యంలో ఏర్పడిన పరిచయాలు ఇష్టంగా మారి ప్రేమ పెండ్లి జరిగిపోవడం సర్వసాధారణంగా మారింది. పెద్దలు ప్రేమ పెండ్లిళ్లకు అంగీకరించకపోవడంతో కొందరు తల్లిదండ్రులను వదిలి సుదూర ప్రా ంతాలకు వెళ్లిపోతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ను ఒప్పించి ప్రేమ వివా హం చేసుకుంటున్నారు. అయితే కొ న్ని వివాహాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతుండగా, మరికొందరు స్నేహితుల సహకార ంతో దేవాలయాల్లో జరుపుకుంటున్నారు. శుక్రవారం ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌డే సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రేమికుల కోసం..!

ప్రేమికుల రోజు విశిష్టత..

 ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల రోజుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, క్రీస్తుశకం 270వ సంవత్సరంలో రోమ్‌ను పాలిస్తున్న  రెండో క్లాడియాన్‌ అనే చక్రవర్తి సైనికులు వివాహాలు చేసుకుంటే ఏకాగ్రతతో యుద్దాలు చేయలేరని, దాని మూలంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని భావించి, ఆ దేశంలో సైనికుల వివాహాలను నిషేదించారు. అయి తే, అదే రాజ్యంలో సైనికుడిగా పని చేస్తున్న వాలెంటైన్‌ ప్రేమ వివాహాలను అధికంగా ప్రోత్సహించి, పెండ్లిళ్లు జరిపించేవాడు. ఈ విషయాన్ని గుర్తించిన చక్రవర్తి ప్రేమ వివాహాలను ప్రోత్సహించే వాలెంటైన్‌ను ప్రేమ వివాహాలకు దూరంగా ఉంచుతూ ఆయనను జైలులో నిర్భందించాడు. అయితే, చక్రవర్తి కూతురు వాలెంటైన్‌ను అమితంగా ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆయన.. వాలెంటైన్‌కు మరణ శిక్ష విధిస్తాడు. మరణ శిక్ష అమలు చేసే వరకు జైలులో ఉన్న వాలెంటైన్‌ తన ప్రియురాలి కోసం తపించిపోయేవాడు. చెట్ల ఆకులను తుంచి తన రక్తంతో ప్రేయసికి సందేశం రాసేవాడు. మానవ హృదయ ఆకారంలో ఉండే ఆ చెట్ల ఆకులపై రాసిన సందేశాన్ని ప్రియురాలికి అందడానికి ఆ ఆకు మధ్య ఒక పుల్లను గుచ్చి బయటకు విసిరేవాడు. ఆకు మధ్యలో పుల్ల ప్రేమకు గుర్తుగా మిగిలిపోయింది. అయితే, వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. వాలెంటైన్‌ను ఉరి తీశారనే విషయం తెలుసుకున్న అక్కడి యువత అంతా జైలుకు వెళ్లి వాలెంటైన్‌ను చూస్తారు. ప్రేమికుల కోసం ప్రాణ త్యాగం చేసిన వాలెంటైన్‌ ఆ రోజు నుంచి ప్రేమికులకు ఆరాధ్యుడయ్యాడు. ప్రేమికులను ఏకం చేసేందుకు చివరి క్షణం వరకు పరితపించిన వాలెంటైన్‌ స్మృతిగా ప్రతి యేటా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

ప్రేమకు నమ్మకమే పునాది..

 తొలిచూపుల ద్వారా ప్రారంభమైన ప్రేమ ప్రేమికులిద్దరినీ జీవితాంతం వరకు నడిపించాలి. ఒకరిమీద మరొకరికి నమ్మకం సడలనంత వరకు వారి మధ్య ప్రేమ సాఫీగా సాగుతుంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య నమ్మకం సడలుతుందో ఆ ప్రేమికులకు కష్టాలు, ఇబ్బందులు ప్రారంభమవుతాయి. జీవితంలో తాము అనుకున్నది సాధించాలంటే ప్రేమికులు ఎన్నో సమస్యలు, అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఒకరికొకరు తోడుగా, నమ్మకంతో జీవనం సాగించాలి. ఇద్దరూ ఏకమై తమకు ఎదురైన సమస్యలను చేధించగలిగితే జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అప్పుడే మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తారు. ప్రేమికుల్లో తన జీవిత భాగస్వామిని మించి పోవాలనే ఆరాటం వారిద్దరిలో ఏ ఒక్కరిలో మొదలైనా ప్రేమికుల మధ్య విభేదాలు తప్పవు. పంతాలు, పట్టింపులు, అసహనం, అనుమానం, చీత్కారాలకు ఏ మాత్రం అవకాశం కల్పించినా ఇక వారి మధ్య కొనసాగిన ప్రేమ ఎంతో కాలం నిలువదు. ఎలాంటి మనస్వార్ధాలు లేకుండా కొనసాగే ప్రేమనే సుదీర్ఘకాలం కొనసాగగలుగుతుంది. సమాజంలో తమ తల్లిదండ్రులు చిన్నబుచ్చుకునే విధంగా ప్రేమికులు వ్యవహరించకూడదు. తమ ప్రేమను పెండ్లి వరకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలను ఒప్పించగలగాలి. తల్లిదండ్రుల అంగీకారం పొందడానికి తమ మిత్రులు, సన్నిహితుల సహకారం వినియోగించుకోవాలి. ఒకరికొకరు అవరోధం కాకుండా మసులుకుంటూ ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించినప్పుడే ప్రేమ పుష్పం జీవితాంతం వికసిస్తూ ఉంటుంది. అనుమానానికి ఏ మా త్రం జీజం పడినా.. వారి ప్రేమ పెటాకుల వర కు దారితీసే ప్రమాదం ఉంది. ఇద్దరి మధ్య న మ్మకం ఎంత పెరిగితే ఆ ప్రేమ అన్నికాలాలు సా ఫీగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రేమ సందేశాలు

 మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ సందేశాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నాటి కాలంలో ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపర్చేందుకు మొదట పావురాలు, చిలుకలను రాయబారులను ఉపయోగించేవారు. రానురాను ప్రేమ లేఖలతో తమ ప్రేమ సందేశాన్ని చేరవేసుకున్నారు. ఆధునిక యుగంలో ప్రస్తుతం వాట్సాప్‌, మేసేజ్‌, మెసింజర్‌లతో ఒక్కరికొక్కరు తమ ప్రేమను తెలుపుకుంటున్నారు. మరికొందరు దూర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం వీడియో కాలింగ్‌ ద్వారా నేరుగా ప్రేమానురాగాలను పంచుకుంటున్నారు. దూరం ఎంతైనా ప్రేమకు హద్దులు లేవని పలువురు అంటున్నారు. 


logo